Telugu breaking News: ఈ నెల 11న ఐదవ గ్యారంటీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
LIVE
Background
Latest Telugu breaking News: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు స్పాట్‌లోనే చనిపోయారు. వీళ్లంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.
ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నరకు అమరావతి నుంచి బయల్దేరి వెళ్తారు. దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి చేరుకుంటారు. అక్కడ వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.
ఈ నెల 11న ఐదవ గ్యారంటీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీలలో ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11న భద్రాచలం రాములోరి సన్నిధిలో ఐదవ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని తెలిపారు.
బుధవారం (మార్చి 6) సచివాలయంలో హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలి విడతగా ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేస్తున్నామని వెల్లడించారు.
నిరుద్యోగులకు అలర్ట్ - గ్రూప్ - 1, 2, 3 పరీక్షల తేదీల ప్రకటన
గ్రూప్ - 1, గ్రూప్ - 2, గ్రూప్ - 3 పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఆగస్ట్ 7, 8 తేదీల్లో గ్రూప్ - 2, నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ - 3 పరీక్షలు నిర్వహించనుంది. గ్రూప్ - 1 మెయిన్స్ ఎగ్జామ్స్ అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపింది.
టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమయ్యారు: కొడాలి నాని
టిడిపికి బీసీలు ఎప్పుడో దూరమైపోయారన్నారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబు సామాజిక వర్గం, ఆయన కోటరీకే టిడిపిలో ప్రాధాన్యత ఉంటుందని విమర్శించారు. అన్ని విభాగాల్లో బీసీలకు 50% పదవులు ఇస్తున్న ఘనత సీఎం జగన్‌దేనన్నారు. చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దానికి నిదర్శనం గుడివాడే అన్నారు. పార్టీ కోసం పని చేసే వారిని కాకుండా 150 కోట్లకు గుడివాడ సీటును ఎన్నారైకు అమ్ముకున్నారని ఆరోపించారు. అమెరికా ఎన్ఆర్ఐకు గుడివాడ ప్రజలు బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు. ఎంపీ పదవి కోసమే పురందేశ్వరి ఆరాట పడుతున్నారని కామెంట్ చేశారు. జగన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తుందని పురుందేశ్వరి బాధపడుతున్నారని అన్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారంగానే ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తుందని స్పష్టం చేశారు. పరిమితికి మించి చేసినట్లయితే ఢిల్లీలో ఫిర్యాదు చేయొచ్చు కదా అనిప్రశ్నించారు. ఎంపీ అవ్వడానికి బిజెపిని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పురిందేశ్వరి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడమే మీ విజన్- జగన్‌పై షర్మిల ఫైర్
ముందుచూపుతోనే వైజాగ్‌ను అభివృద్ధి చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించడంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. "పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది? పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్. గుట్టల్ని కొట్టడం,పోర్టులను అమ్మడం,భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్. ఇప్పుడు ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా ? అంటూ ట్వీట్ చేశారు.
పవన్‌కు మరో లేఖ రాసిన హరిరామజోగయ్య- ఈసారి అభ్యర్థుల లిస్ట్ ఇచ్చిన మాజీ మంత్రి
మాజీ మంత్రి హరిరామజోగయ్య, జనసేన అధినేత మధ్య లేఖల రాయబారం కొనసాగుతూనే ఉంది. తాజా మరో లేఖ రాసిన హరిరామజోగయ్య బలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అంతే కాకుండా కొందరి పేర్లు కూడా ప్రస్తావించారు.