Telugu breaking News: మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి
Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
LIVE
Background
Latest Telugu breaking News:తాడేపల్లిగూడెం జెండా సభ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కలిసి మరోసారి సభలో పాల్గొంటున్నారు. రెండు పార్టీలు ఉమ్మడిగా కలిసి నిర్వహిస్తున్న జయహో బీసీ సమావేశంలో ఇద్దరూ కలిసి బీసీ డిక్లరేషన్ విడుదల చేయనున్నారు. మొదట పవన్ కల్యాణ్ ఈ సభకు హాజరవడంపై స్పష్టత లేదు. ఇతర కార్యక్రమాలేమీ లేకపోవడంతో తాను కూడా జయహో బీసీకి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేస్తారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. బీసీల భవిష్యత్ కోసం ఏం చేయబోతున్నామో ఈ సభలో ప్రకటించనున్నామని అచ్చన్న వివరించారు. అదే టైంలో వైసీపీ పాలనలో బీసీలు ఎదుర్కొన్న ఇబ్బందులు పెట్టిన కేసులు కూడా ప్రస్తావిస్తామని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలు ఈ సభకు హాజరు అవుతున్నారని సభ తర్వాత వైసీపీ నేతల్లో గుబులు మొదలవుతుందని అభిప్రాయపడ్డారు.
సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో యనమల రామకృష్ణుడు అధ్యక్షతన బీసీ డిక్లరేషన్ కమిటీ సమావేశం జరిగింది. జనసేన కూడా ఈ డిక్లరేషన్ కమిటీలో భాగంగా ఉంది. ఇందులో టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, కాలువ శ్రీనివాసులు, బీద రవిచంద్ర, అనగాని సత్యప్రసాద్, పంచుమర్తి అనూరాధ, బండారు సత్యనారాయణమూర్తి, రామారావు, గౌతు శిరీష, బీకే పార్థసారథి, కొనకళ్ల నారాయణ, గుంటుపల్లి నాగేశ్వరరావు, నిమ్మల కిష్టప్ప, రవికుమార్, జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాసయాదవ్, పీ మహేశ్, చిల్లపల్లి శ్రీనివాస్ ఉన్నారు. బీసీ డిక్లరేషన్ లో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు.
జగన్ రెడ్డి పాలనలో బీసీలు దారుణంగా మోసపోయారని బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా డిక్లరేషన్ ఉంటుందన్నారు. జగన్ చేసిన మోసం నుండి కోలుకుని ఎదిగేలా ప్రోత్సహించడమే టీడీపీ లక్ష్యమని.. స్పష్టం చేశారు. మంగళవారం నాగార్జున యూనివర్సిటి ఎదురుగా భారీ సభ ఏర్పాటు చేశారు. అందులో డిక్లరేషన్ ను ప్రకటించారు. టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో మంగళవారం జయహో బీసీ సభ నిర్వహిస్తున్నారు. బీసీల అభ్యున్నతి కోసం నిజంగా పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. బీసీలే తమ డిక్లరేషన్ ను రూపొందించుకునే అవకాశాన్ని టీడీపీ కల్పించిందని కొల్లు రవీంద్ర వెల్లడించారు. బీసీలకు అన్ని రకాలుగా మేలు చేకూర్చడమే టీడీపీ లక్ష్యం అని స్పష్టం చేశారు.
బీసీల ఇళ్లకు వెళ్లి అభిప్రాయాలు సేకరించి డిక్లరేషన్ రూపొందించామని తెలిపారు. అభిప్రాయ సేకరణలో భాగంగా క్షేత్రస్థాయిలో 850 సమావేశాలు నిర్వహించామని కొల్లు రవీంద్ర వివరించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు బీసీకులగణన నిర్వహణకు సంబంధించిన అంశాల్ని కూడా డిక్లరేషన్లో ప్రకటిస్తామన్నారు. జయహో బీసీ డిక్లరేషన్ మహాసభకు రాష్ట్రం నలుమూలల నుంచీ బీసీలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీ సోదరుల నినాదాలతో తాడేపల్లి ప్యాలెస్ కంపించాలని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బీసీ డిక్లరేష్ తర్వాత ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను కూడా టీడీపీ ప్రకటించనుంది. ఇప్పటికే టీడీపీలోని ఆయా వర్గాల నేతలు.. ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని డిక్లరేషన్‌లో పొందు పర్చాల్సిన అంశాలపై ఓ అభిప్రాయానికి వచ్చారు. త్వరలో జనసేన నేతలతో కూడా కలిసి.. బహిరంగసభలు ఏర్పాటు చేసి.. డిక్లరేషన్లను ప్రకటించే అవకాశం ఉంది.
నా 3 నెలల పాలనే, లోక్‌సభ ఎన్నికలకు రెఫరెండం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్షనేత లేనే లేడని, అందుకే అసెంబ్లీకి రావడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని.. తన 3 నెలల పాలనే, లోక్‌సభ ఎన్నికలకు రెఫరెండం అని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తాను కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించనని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తన కుటుంబసభ్యులు పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
ప్రధానిని పెద్దన్న అనడంలో ఎలాంటి తప్పు లేదున్నారు. రాష్ట్రానికి కావాల్సిన విషయాలను తాను అందరి ముందు మైక్ లోనే చెప్పానని, కేసీఆర్ లాగ చెవిలో చెప్పడం తనకు అలవాటు లేదంటూ సెటైర్లు వేశారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 100 ఏళ్ల విధ్వంసం చేశారని ఆరోపించారు. కాళేశ్వరరావు కట్టిన మేడిగడ్డ మేడిపండు అయింది.
ఆయన సీఎంగా ఉన్నప్పుడే మొత్తం డ్యామేజీ జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వమే రిపేర్ చేయాలని ఎన్ఎస్‌డీఏ నివేదిక ఇస్తే తప్పకుండా మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అనే పార్టీనే లేదని, అలాంటప్పుడు ఆ పార్టీపై కామెంట్లు అనవసరమని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ వసూళ్లలో కుంభకోణం జరిగిందని, దొంగల్ని త్వరలోనే బయటకు తీస్తామన్నారు.
ఏపీ కేబినెట్ నుంచి గుమ్మనూరి జయరాం బర్తరఫ్
ఏపీ మంత్రి గుమ్మనూరి జయరాంను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బర్తరఫ్ చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ చేసిన సిఫార్సుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. తన మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చేరడం గమనార్హం.
మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఖరారు చేశారు. ఈ మేరకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమావేశం అయ్యారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు.
బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు ఖరారు - ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. భారత రాష్ట్ర సమితి.. బహుజన సమాజ్ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ .. కేసీఆర్ తో సమావేశం అయ్యారు. కలసి పని చేయడంపై చర్చించారు. పొత్తులు పెట్టుకోవాలని నిర్ణయంచుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
కేసీఆర్‌తో తన భేటీపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ
పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక పరిణామం..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం భేటీ అయ్యారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్ళిన ప్రవీణ్ కుమార్, మరికొద్దిమంది ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరిగిన ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ భేటీకి రాజకీయాలకు ఎలాంటి సంబంధ లేదని, మర్యాదపూర్వకంగానే ఆర్ఎస్పీ వచ్చి కలిశారంటూ బీఆర్ఎస్ వర్గాలు వివరణ ఇచ్చాయి. మరోవైపు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సంజాయిషీ ఇచ్చుకున్నారు.
మంగళవారం నాడు ఉదయం "నా రాజకీయ ప్రస్థానం పై వస్తున్న వదంతులను నమ్మవద్దు. చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దిశవైపే నా ప్రయాణం" అంటూ కేసీఆర్‌తో తన భేటీపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఒంటరి అయిపోయిన బీఆర్ఎస్‌తో ఆర్ఎస్పీ భేటీ కావడం పలు సందేహాలకు తావిచ్చినట్లయింది. మర్యాదపూర్వక భేటీ అని బీఆర్ఎస్ చెప్పుకుంటున్నా... వదంతుల్ని నమ్మవద్దు అని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్పీ క్లారిటీ ఇచ్చినా లాభం లేకపోయింది. ఈ భేటీపైన రాజకీయ చర్చ జరిగిందనే ప్రచారం మాత్రం కొనసాగుతోంది.