Aqua Farmers: ప్రభుత్వం పట్టించుకోకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తాం- ఆక్వా రైతుల అల్టిమేటం!
Aqua Farmers: ప్రభుత్వం తమ కష్టాలను పట్టించుకోకుంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని కోనసీమ జిల్లా ఆక్వా రైతులు హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్కారే చూసుకోవాలని కోరారు.
Aqua Farmers: ఆక్వా రైతులు కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకుంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని ఆక్వా రైతులు హెచ్చరించారు. ఆక్వా రైతు పోతుల నరసింహా రావు ఆధ్వర్యంలో పలువురు రైతులు గురువారం రోజు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గుండిపూడి గ్రామంలో సమావేశం అయ్యారు. ఆక్వా రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఆక్వారంగంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని, గత 30 ఏళ్లుగా ఎప్పుడూ ఈ పరిస్థితి చూడలేదని నరసింహరావు అన్నారు. కరోనా సమయంలో రైతుల పరిస్థితిని గాలికొదిలేశారని, మూడేళ్ల పాటు జగన్ అధికారంలోకి వచ్చాక రైతులు మరిన్ని కష్టాలు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం..!
అయితే 25 కిలోల ఫీడ్ బ్యాగు రూ. 2800 ధర పలుకుతుందని, రాష్ట్రానికి విదేశీ కరెన్సీ వస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం అని పోతుల నరిసింహారావు పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల కోట్లు వరకు కరెన్సీ వస్తుందన్నారు. విద్యుత్ పర్మిషన్లు ఇవ్వడంలోనూ ఇబ్బందులు ఉన్నాయని, సబ్సిడీ రూపాయిన్నర ఇచ్చి యూనిట్ ధర పెంచారని ఆరోపించారు. నాణ్యమైన విద్యుత్తు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చాలా సునాయసంగా విద్యుత్తు కనెక్షన్ కోసం పర్మిషన్ ఇచ్చేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. గత మూడేళ్ల నుంచి వంద శాతం నుంచి జీరోకు వచ్చిన పరిస్థితి ఉందని, 23 మంది ఎంపీలు ఉన్నా పార్లమెంటులో ఆక్వా రైతుల సంక్షోభంపై మాట్లాడిన దాఖలాలు లేవని వాపోయారు.
రాష్ట్రంలో 70 శాతం మంది వ్యవసాయం పైనే
ఆక్వా రంగం కూడా క్రాఫ్ హాలిడీ ప్రకటిస్తే రెండున్నర కోట్ల మంది ప్రజలు రోడ్డున పడే పరిస్థితి ఉందని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెలాఖరు నాటికి ఆక్వా రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఆక్వా రైతులు తగిన బుద్ది చెబుతారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతు పదేళ్లు వెనక్కు వెళ్లిన పరిస్థితి కనిపిస్తోందని, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే పరిస్థితి తలెత్తుతుందన్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది వ్యవసాయంపై ఆధార పడుతున్నారని వివరించారు. వరికి కిట్టుబాటు ధర రావాలని క్రాఫ్ హాలిడే ప్రకటించామని.. ఇటీవలే 50 వేల ఎకరాల్లో వరి ఊడ్చలేదని ఊడ్చిన వారు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. ప్రభుత్వం దృష్టిసారించి వరికి కిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
రైతులకు మేలు కలిగేలా ప్రభుత్వం వ్యవహరించాలి..
కోనసీమ ప్రాంతంలో మూడు పంటలైన వరి, ఆక్వా, కొబ్బరి ఈమూడు పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, అనేక ఆంక్షలతో ఆక్వా పరిశ్రమను ఇబ్బందులపాలు చేస్తున్నారని పోతుల నరసింహా రావు అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కార్పోరేట్ సంస్థలనే చూస్తున్నారని, క్వాలిటీ లేని హేచరీలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆక్వారంగం కూడా మద్దతు ధర కోసం పాకుపాలడాల్సిన పరిస్థితి దాపురించిందని, పెరిగిపోతున్న ఫీడ్, విద్యుత్తు ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. రైతులకు మేలు కలిగే విధంగా ప్రభుత్వం ప్రయత్నించాలన్నారు.