Bombay High Court: అంగీకారంతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి చట్టపరమైన వయస్సును నిర్ధారించాలి: బాంబే హైకోర్టు
Bombay High Court: వివాహానికి, సెక్స్ కు మధ్య వయస్సు తేడాను గుర్తించాల్సిన అవసరం ఉందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.
Bombay High Court: ఏకాభిప్రాయంతో కూడిన లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి చట్టపరమైన వయస్సును నిర్ధారించాల్సిన అవసరాన్ని బాంబే హైకోర్టు నొక్కి చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను దేశం, పార్లమెంట్ గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ఓ తీర్పు సందర్బంగా బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. అమ్మాయి, అబ్బాయి సమ్మతితో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పటికీ.. బాలిక మైనర్ అయినందున అబ్బాయిపై లైంగిక నేరాల కేసులు పెరుగుతుండటం పట్ల విచారం వ్యక్తం చేసింది. లైంగిక చర్యలు వివాహ పరిమితుల్లో మాత్రమే జరగవని.. ఈ విషయాన్ని సమాజం, న్యాయ వ్యవస్థ గుర్తించాల్సిన ప్రాముఖ్యతను ఈ సందర్భంగా కోర్టు నొక్కి చెప్పింది.
దక్షిణ ముంబైకి చెందిన 17 బాలికపై అత్యాచారం చేసినందుకు 25 ఏళ్ల నిందితుడికి 2019 లో దిగువ 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడితో వివాహం కారణంగా ముస్లిం చట్టం ప్రకారం తనను పెద్దవారిగా పరిగణిస్తున్నట్లు బాలిక వాదించింది. ఈ కేసులో నిందితుడు, బాధితురాలు ఏకాభిప్రాయానికి వచ్చారు. దీంతో జస్టిస్ భారతీ డాంగ్రే నేతృత్వంలోని బాంబే హైకోర్టు ధర్మాసనం ఆ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేయాలని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా వివాహ వయస్సు, లైంగిక చర్యల వయస్సు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరం ఉన్నట్లు హైకోర్టు సూచించింది. ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను గుర్తించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, హంగేరీ దేశాల్లో 14 ఏళ్లు దాటిన అమ్మాయిలు, అబ్బాయిలు ఇష్టపూర్వకంగా సెక్స్ చేసుకోవచ్చు. లండల్, వేల్స్ లో అయితే అబ్బాయిలు, అమ్మాయిలు సెక్స్ చేసుకోవడానికి చట్ట పరమైన వయస్సు 16 ఏళ్లు. జపాన్ అయితే 13 సంవత్సరాలే అని బాంబే హైకోర్టు చెప్పుకొచ్చింది.
18 ఏళ్ల లోపు వయస్సు గల అమ్మాయిలు, అబ్బాయిలు సెక్స్ లో ఇష్ట పూర్వకంగా పాల్గొన్నప్పటికీ.. చట్టం దృష్టిలో నేరం కిందే పరిగణించాల్సి వస్తోందని చెప్పుకొచ్చింది. 17 ఏళ్ల 364 రోజుల వయసు ఉన్న అమ్మాయితో 20 ఏళ్ల వయస్సు యువకుడు లైంగిక చర్యలో పాల్గొనే పరిస్థితిని హైలెట్ చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అమ్మాయి తన ఇష్ట పూర్వకంగానే లైంగిక చర్యలో పాల్గొన్నట్లు చెప్పినప్పటికీ.. చట్టం ప్రకారం అది చెల్లుబాటు కాదని, యువకుడికి శిక్ష విధించాల్సి వస్తుందని కోర్టు చెప్పింది.
శృంగార సంబంధించిన కేసులు పెరుగుతున్నాయని జస్టిస్ డాంగ్రే చెప్పారు. ఈ అంశంలో ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను దేశం గుర్తించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుత నిబంధనలు సామాజిక వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలం అవుతున్నాయన్నారు. ఇష్టప్రకారం సెక్స్ లో పాల్గొన్నప్పటికీ.. దానిని బలవంతపు అత్యాచారంగానే పరిగణించాల్సి వస్తోందని చెప్పారు. యుక్త వయస్సు.. లైంగిక అభివృద్ధిలో కీలకమైన దశ, ఇది వయస్సుతో పాటు కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ ద్వారా పెరుగుతుంది. ఈ వయస్సులో అమ్మాయిలు, అబ్బాయిలు ఆకర్షితులవుతారు. ఆలోచనలో మార్పు వస్తుంది. లైంగిక కార్యకలాపాల గురించి క్రమంగా అవగాహన పెంచుకుంటారు. ఈ వయస్సులో ఉన్న వారు ఇంటర్నెట్ వాడకం ద్వారా అన్ని విషయాల గురించి తెలుసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో యవ్వన ప్రవర్తనను నియంత్రించడంలో ఎదురవుతున్న సవాళ్ల గురించి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.