Bofors Scam: బోఫోర్స్ కుంభకోణాన్ని తిరిగి తోడుతున్న బీజేపీ, ట్వీట్‌లతో కాంగ్రెస్‌కు స్పాట్
Bofors Scam: 1986లో జరిగిన బోఫోర్స్ కుంభ కోణాన్ని బీజేపీ మళ్లీ తెరపైకి తీసుకొచ్చి కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తోంది.
Bofors Scandal:
ట్విటర్‌లో ఘాటైన పోస్ట్...
బీజేపీ మరోసారి కాంగ్రెస్ కుంభకోణాలను ఏకరవు పెడుతోంది. బోఫోర్స్ స్కామ్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చి విమర్శలు చేసింది. ఆర్మీకి అందించే తుపాకుల విషయంలో అవినీతికి పాల్పడిందని మండి పడింది. తుపాకుల కొనుగోలులో గోల్‌మాల్ జరిగిందని వెల్లడించింది. 1986లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్స్ కుంభకోణం జరిగిందని ట్విటర్‌లో పోస్ట్ చేసింది. అప్పట్లో భారత్ 400 హోవిట్జర్ గన్స్ కొనుగోలు చేసేందుకు రూ.1,437 కోట్లు కేటాయించింది. అయితే...1987లో ఈ కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. సీబీఐ కేసు కూడా నమోదు చేసింది. ఫోర్జరీ కేసు కింద రాజీవ్ గాంధీ సన్నిహితుడైన ఒట్టావియో పై FIR నమోదైంది.
పీవీ నరసింహా రావు హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన నిందితుడైన ఒట్టావియోను దేశం దాటించిందని ఆరోపించింది. ఆ తరవాత 1999లో సీబీఐ నిందితుడిపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఒట్టావియో తన నేరాన్ని అంగీకరించినట్టు, 7 మిలియన్ డాలర్ల మేర అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్టు అందులో పేర్కొంది. దీనిపై బీజేపీ అప్పట్లో కాంగ్రెస్‌పై పోరాటం చేసింది. సుప్రీం కోర్టునీ ఆశ్రయించింది. బోఫోర్స్ కుంభకోణంపై పిటిషన్ దాఖలు చేసింది. భారత్‌కు చెందిన బడా వ్యాపారి ఒట్టావియోకి ఈ డీల్‌లో పెద్ద మొత్తంలో కమిషన్ అందినట్టు ఆరోపణలొచ్చాయి. అయితే...కాంగ్రెస్ మాత్రం ఈ స్కామ్ జరగలేదని వాదించింది. 2004లో సీబీఐ విచారణ జరిపి...రాజీవ్ గాంధీకి క్లీన్ చిట్ ఇచ్చింది.
कांग्रेस ने सेना के लिए तोपों की खरीद में किया घोटाला!
— BJP (@BJP4India) December 10, 2022
कांग्रेस का चरित्र: भारत तोड़ो pic.twitter.com/4MPTlK9Q3m
కాంగ్రెస్ ముక్త భారత్..
కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని తరచూ వినిపించే బీజేపీ...ఇలా పాత స్కామ్‌లన్నింటినీ తవ్వుతూ ఆ పార్టీని మరింత ఇరకాటంలో పడేస్తోంది. ఇప్పటికే...ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతోంది. ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా ఎక్కడా అధికారంలో లేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకునే స్థితిలో లేదు. స్థానిక పార్టీలు దూసుకుపోతుంటే...కాంగ్రెస్ ఇంకా ఇంకా వెనకబడిపోతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ ఇలా కాంగ్రెస్ స్కామ్‌లను గుర్తు చేస్తూ ట్వీట్‌లు చేయడం సంచలనమవుతోంది. తమది మచ్చ లేని ప్రభుత్వం అని బీజేపీ మొదటి నుంచి క్లెయిమ్ చేసుకుంటోంది. ఈ సారి కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కామ్‌లను తెరపైకి తీసుకొచ్చి...ఇదిగో వాళ్ల పాలనకు, మా పాలనకు తేడా ఇదే అని స్పష్టంగా చెబుతోంది. అటు కాంగ్రెస్ కూడా పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీపై అప్పుడప్పుడూ విరుచుకు పడుతున్నప్పటికీ...అవేమీ పెద్దగా ప్రభావం చూపించడం లేదు. బీజేపీకి దీటుగా విమర్శలు చేయాలంటే...సీనియర్ నేతలు మాటల్లో ఇంకాస్త పదును పెంచక తప్పదు. ఇలా స్కామ్‌ల గురించిన మాట్లిన ప్రతిసారీ...సైలెంట్ అయిపోతే అది కాంగ్రెస్‌కే నష్టం అంటున్నారు విశ్లేషకులు. మోడీ చరిష్మాకు ఇప్పట్లో ఢోకా లేదు అన్నట్టుగానే ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఇలాంటప్పుడు కాంగ్రెస్ ఎంత తొందరగా పుంజుకుంటే ఆ పార్టీ భవిష్యత్‌కి అంత మంచిది. కానీ...ఇంకా అంతర్గత కుమ్ములాటలతోనే కాలం గడిపేస్తోందా పార్టీ. అంతర్గతంగా ఉన్న సమస్యల్నే తీర్చుకోలేకపోతోంది..ఇక దేశంలోని సమస్యని ఏం తీరుస్తుంది అని బీజేపీ సెటైర్లు వేయడం కొత్తేమీ కాదు. కాకపోతే..ఈ సారి ఇలా డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టింది.