Praja Bhavan Accident: బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు ర్యాష్ డ్రైవింగ్, పరారీ! నిందితుణ్ని తప్పిస్తున్నారా?
Hyderabad News: కారు డ్రైవ్ చేసిన వ్యక్తి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్ అని డీసీపీ చెప్పారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని చెప్పారు.
Praja Bhavan Car Accident: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇరుక్కున్నాడు. హైదరాబాద్ ప్రజా భవన్ వద్ద శనివారం (డిసెంబర్ 23) అర్ధరాత్రి ఓ బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే కుమారుడి పేరును కూడా చేర్చారు. ఈ విషయాన్ని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే తనయుడ్ని తప్పించారని ప్రచారం ఉన్నందున స్వయంగా డీసీపీ దీనిపై వివరణ ఇచ్చారు. కారు డ్రైవ్ చేసిన వ్యక్తి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్ అని డీసీపీ చెప్పారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని.. మిగతా వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. గతంలో కూడా ఓ ప్రాంతంలో కారుతో విధ్వంసం సృష్టించి రాహిల్ ఒకరి మరణానికి కారణమయ్యాడని డీసీపీ పేర్కొన్నారు.
ప్రజా భవన్ ఎదురుగా రోడ్డుపై న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్స్ ఉన్నాయని, వాటిని అతివేగంగా వచ్చి అతను కారుతో ఢీకొన్నాడని వివరించారు. ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నారని చెప్పారు. వీళ్లంతా కాలేజీ స్టూడెంట్స్ అని చెప్పారు.
అయితే, ఈ కేసు నమోదు సమయంలో అసలు నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యేను మరొకరి పేరును చేర్చినట్టు ఆరోపణలు వచ్చాయి. పంజాగుట్ట పోలీసులు మాత్రం.. డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని వైద్యపరీక్షల నిమిత్తం ట్రాఫిక్ పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు. కానీ, ప్రమాద సమయంలో కారు ఆగగానే అందులో నుంచి ఒకరు పరారయ్యారని చెప్పారు. మరో యువకుడిని పట్టుకున్నారు. అతడిని పరీక్షించి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి.. మద్యం తాగలేదని గుర్తించారు. అయితే, మాజీ ఎమ్మెల్యే ఆదేశంతో తన కుమారుడి ఇంట్లో పనిచేసే డ్రైవర్ తానే కారును డ్రైవ్ చేసినట్లుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. అసలు నిందితుణ్ని తప్పించడం కోసం డ్రైవర్ ను లొంగిలోపోయేలా చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. డిసెంబరు 23న అర్ధరాత్రి దాటాక 2.45 గంటల సమయంలో అత్యంత వేగంతో ఓ బీఎండబ్ల్యూ కారు (TS 13 ET 0777) ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ నియంత్రణ కోసం అడ్డుగా ఉంచిన బారికేడ్లను ఢీకొట్టి ముందుకు వెళ్లింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా, వాహన వేగానికి కారు ముందు భాగం బాగా దెబ్బతిన్నది.