Bobby Patel: డంకీ కింగ్- కోటి ఇస్తే చాలు అమెరికాకు వీసా పాస్ పోర్టు లేకుండా తీసుకెళ్లిపోతాడు ఈ బాబీ పటేల్
US: అమెరికాలో ఎలాంటి పత్రాల్లేకుండా చొరబడిన వాళ్లను ట్రంప్ వెనక్కి పంపేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా చొరబడిన అత్యధిక మందిని ఆ దేశంలోకి పంపింది బాబీపటేల్ అనే వ్యక్తి. ఇతను ఎవరో తెలుసా?
Bobby Patel Dunky King: షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ అనే సినిమా గత ఏడాది రిలీజ్ అయింది. ఆ సినిమాలో షారుక్ తో పాటు మరికొందరు వీసా, పాస్‌పోర్టులు లాంటివి లేకుండా అక్రమంగా లండన్‌లోకి చొరబడతారు. ఇలా దేశాలను దాటించడాన్ని డంకీ రూట్స్ అంటారు. అందుకే ఆ పేరు పెట్టారు. ఇలాంటి వాటిలోనూ ఎక్స్ పర్ట్స్ ఉంటారు. డంకీ మార్గం ద్వారా అమెరికాలోకి భారతీయుల్ని పంపండంలో బాబీ పటేల్ అనే వ్యక్తి దిగ్గజంగా పెరు తెచ్చుకున్నాడు. అతని పేరు వింటే అటు అమెరికా,కెనడా ఇటు ఇండియా అధికారులు అలర్ట్ అయిపోతారు. కానీ అందర్నీ ఏ మార్చి తన క్లయింట్లను అమెరికా చేర్చేస్తాడు. అదీ అతని గొప్పతనం.
బాబీ పటేల్ అనే వ్యక్తి ఇప్పటి వరకూ పదిహేను వందల మంది భారతీయుల్ని కెనడా నుంచి అక్రమంగా వీసాలు, పాస్‌పోర్టులు లేని వారిని డంకీ మార్గంలో అమెరికాలోకి చొప్పించారు. అతనిని సంప్రదించి బేరం కుదుర్చుకుంటే చాలు మిగతా పని పూర్తి చేస్తాడు. కనీసం రూ. కోటి వరకూ ఖర్చవుతుందని ముందే చెబుతాడు. ఆ డబ్బులు కూడా కట్టి అమెరికాలోకి వెళ్లేందుకు చాలా మమంది రెడీగా ఉంటారు. వారు బాబీపటేల్ ను సంప్రదిస్తే చాలు.. ప్లాన్ సిద్దం చేస్తాడు. ముందుగా స్టూడెంట్ వీసా కింద.. తన క్లయింట్ ను కెనడాకు తీసుకెళ్తాడు. అక్కడి నుంచి సరైన సమయం చూసుకుని డంకీ మార్గం ద్వారా.. అమెరికాకు సేఫ్ గా తీసుకు వెళ్తాడు. సరిహద్దు దాటించి తన పని పూర్తి చేసుకుంటాడు.
ఇలా ఇప్పటి వరకూ పదిహేను వందల మందిని అమెరికాలోకి డంకీ మార్గం ద్వారా ప్రవేశ పెట్టారని రికార్డులు చెబుతున్నాయి. గత ఏడాది గుజరాత్ లో పోలీసులు బాబీ పటేల్ ను పట్టుకున్నారు. వంద కోట్ల రూపాయలకుపైగా హవాలా మార్గం ద్వారా తరలించాడని గుర్తించారు. అతను పెద్ద రాకెట్ నడుుపుతున్నాడని గుర్తించారు. ఇప్పటికీ అతని వ్యాపారం జోరుగా సాగుతోందని ఎవర్ని ఎలా పంపుతున్నారో అర్థం కాని విధంగా నెట్ వర్క్ నడుపుతున్నాడని పోలీసులు భావిస్తున్నారు.
అసలు ఈ డంకీ రూట్ ద్వారా అమెరికాలో మనుషుల్ని పంపేలా ఈ బాబీపటేలా ఎలా నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నాడంటే అదో సినిమా స్టోరీలా ఉంటుంది. ఈ బాబీపటేల్ అమెరికాకు వెళ్లాలని చాలా కాలం ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. చివరికి కెనడాకు వెళ్లి అక్కడ్నుంచి అమెరికాలో చొరబడాలనుకున్నాడు. అది కూడా సాధ్యం కాలేదు. కానీ ఇతరుల్ని పంపించే మార్గం మాత్రం కనిపెట్టాడు. తనను రానివ్వని అమెరికాకు.. తన లాంటి వాళ్లను పంపించి బుద్ది చెప్పాలనుకున్నాడు. పెద్ద ఎత్తున డబ్బులు కూడా వచ్చే చాన్స్ ఉండటంతో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మనుషుల్ని అమెరికాలోకి పంపుతున్నాడు. ట్రంప ప్రభుత్వం ఇలా దేశంలోకి వచ్చిన వారందర్నీ గుర్తించి వారి వారి దేశాలకు పంపుతోంది.