Badvel By Election: బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం.. జగన్ పార్టీకి భయపడేది లేదు.. సోము వీర్రాజు వెల్లడి
Somu Verraju: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని ఒకటి, రెండు రోజుల్లో ఖరారు చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు.
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయబోతున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. బద్వేలు ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని తెలిపారు. కడపలో నిర్వహించిన బీజేపీ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏపీ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్లుగా నిధులిచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడేళ్ల అభివృద్ధిపై చర్చించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని.. చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబులకు వీర్రాజు సవాల్ విసిరారు.
Also Read: ఇకపై సొంత ఊరి నుంచే పని.. 'వర్క్ ఫ్రమ్ హౌమ్ టౌన్'.. దేశంలోనే ఏపీలో తొలిసారి
ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థి ఖరారు..
బద్వేలు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని ఒకటి, రెండు రోజుల్లో ఖరారు చేస్తామని వీర్రాజు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టామని వెల్లడించారు. జిల్లాలోని పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపాక అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. జిల్లా స్థాయి నాయకులతో పాటు నియోజకవర్గంపై పట్టున్న అభ్యర్థిని నిలబెడతామని పేర్కొన్నారు. బద్వేలు ఉప ఎన్నికలో విజయం సాధించడానికి అన్ని రకాల వ్యూహాలను అనుసరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు సీఎం రమేష్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
వారసత్వ రాజకీయాలకు బీజేపీ విరుద్ధం..
కుటుంబ వారసత్వ రాజకీయాలను బీజేపీ ప్రోత్సహించదని వీర్రాజు స్పష్టం చేశారు. అధికార పార్టీ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణిని వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఆయన తప్పు పట్టారు. రాజకీయాల్లో కుటుంబ వారసత్వానికి స్థానం లేదని తేల్చి చెప్పారు. బద్వేలు ఉప ఎన్నిక కోసం కష్టపడి పని చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
బద్వేలు ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. అక్టోబర్ 8 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 13 వరకు ఉంటుంది. ఈ నెల 30న పోలింగ్, నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్ వెల్లడించారు.
Also Read: పక్కా ప్లానింగ్ తో తెలుగు అకాడమీ నిధులను కొల్లగొట్టిన ఆ ముగ్గురు ఎవరు?
Also Read: రేపు తెలుగు రాష్ట్రాల్లో అప్రెంటిస్ మేళా.. 5వ తరగతి చదివిన వారు కూడా అర్హులే..