Kameni Comments: భారత్‌లో మైనారిటీలపై ఇరాన్ సుప్రీం లీడర్ వివాదాస్పద వ్యాఖ్యలు, తిప్పి కొట్టిన కేంద్రం
Kameni Comments: భారత్‌లో మైనారిటీలపై కమేనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటు స్పందన. తప్పుడు సమాచారంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్య. ముందు మీ దేశాల్లో మైనారిటీల పరిస్థితి ఎంటని నిలదీత
Iran supreme leader Kamenie | భారతదేశ ముస్లింలకు సంబంధించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ కమేనీ చేసన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. అదే స్థాయిలో అతడి వ్యాఖ్యలను తిప్పి కొట్టింది. భారత్‌లో మైనారిటీల గురించి మాట్లాడే ముందు.. మీ దేశంలో మైనారిటీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ముందు ఒకసారి చూసుకోండంటూ భారత విదేశీ వ్యవహరాల శాఖ ఘాటుగా బదులిచ్చింది.
భారత్‌లో ముస్లింల పరిస్థితిని గాజా బాధితులతో పోలుస్తూ కమేనీ ట్వీట్:
కమేనీ తన ట్విట్టర్ ఖాతాలో గాజా, మియన్మార్‌లో ముస్లింల కష్టాలను భారత్‌లోని ముస్లింల సమస్యలతో పోల్చుతూ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. భారత్, గాజా, మయన్మార్ సహా ప్రపంచంలోని ఏ ప్రాంతంలో నైనా ఇబ్బందులు పడుతున్న ముస్లింలకు మనం అండగా నిలవకపోతే మనం ముస్లింలమే కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. ఇస్లామిక్ శత్రువులు ఇస్లామిక్ ఉమ్మానే మన ఐడెంటిగా ఉన్న మనల్ని విభజించడమే లక్ష్యంగా అనేక కుట్రలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇరాన్- ఇజ్రాయేల్ మధ్య ఉద్రిక్తతతలు కొనసాగుతున్న వేళ.. భారత్‌ను ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతోనే కమేనీ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు ప్రపంచ దేశాల సంబంధాలపై నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
The enemies of Islam have always tried to make us indifferent with regard to our shared identity as an Islamic Ummah. We cannot consider ourselves to be Muslims if we are oblivious to the suffering that a Muslim is enduring in #Myanmar, #Gaza, #India, or any other place.
— Khamenei.ir (@khamenei_ir) September 16, 2024
కమేనీ వ్యాఖ్యలపై ఘాటుగా బదులిచ్చిన భారత్:
ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తిప్పికొట్టింది. భారత్ ముస్లింలకు సంబంధించి కమేనీ చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం అయినవి కాదని.. తప్పుడు సమాచారంతో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని భారత్ బదులిచ్చింది. భారత్‌లో ఉన్న మైనారిటీల గురించి మాట్లాడే ముందు మీ దేశంలో ఉన్న మైనారిటీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో రికార్డులు చూస్తే ఇట్టే అర్థం అవుతుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ వ్యాఖ్యానించింది. భారత్ గురించి మాట్లాడే దేశాలు ముందుగా వాళ్ల దేశంలో పరిస్థితులు ఏంటో తెలుసుకుంటే మంచిదని సూచించింది.
ఇజ్రాయెల్, ఇరాన్‌తో భారత్‌కు వ్యూహాత్మక, భద్రతాపరమైన సంబంధాలు:
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రగులుకున్న వేళ.. భారత్‌కు ఆ ప్రాంతాల్లో రెండు పక్షాలుగా ఉన్న దేశాలతోనూ సంబంధాల బలోపేతం ప్రస్తుత పరిస్థితుల్లో కత్తి మీద సాముగా మారింది. భారత్‌కు ఇజ్రాయెల్‌తో ఎప్పటి నుంచో రక్షణపరమైన వ్యూహాత్మక సంబంధాలుండగా.. ఇరాన్‌తో వాణిజ్యపరమైన సంబంధాలు ఉన్నాయి. భారత్ దిగుమతి చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్‌లో అత్యధిక శాతం పశ్చిమాసియా నుంచి వస్తున్నదే. ఈ విషయంలో ఇప్పటికే ఇరు దేశాల మధ్య అనేక ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఒక దశలో అమెరికా ఆంక్షలను కూడా లెక్కచేయకుండా న్యూఢిల్లీ టెహ్రాన్‌తో సంబంధాలను కొనసాగించింది. ఇరు దేశాలు కూడా పాకిస్తాన్, ఆప్గనిస్తాన్ నుంచి ఎగుమతి అవుతున్న ఉగ్రవాదానికి బాధితపక్షాలే. చాబర్ పోర్టు అభివృద్ధి ఇరు దేశాలకు ముఖ్యం కాగా.. భారత్ ఇరాన్ సంయుక్తంగా దానిని ముందుకు తీసుకెళ్తున్నాయి. అటు.. ఇజ్రాయెల్‌తో కార్గిల్ సమయం నుంచి భారత్‌కు వ్యూహాత్మక సంబంధాలు బలంగా ఉన్నాయి.
ముంబయిపై ఉగ్రదాడిలో ఇరు దేశాలూ నేరుగా బాధిత దేశాలే. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌తో సంబంధాలు కూడా భారత్‌కు చాలా ముఖ్యం. అందుకే.. గతేడాది అక్టోబర్ 7 హమాస్ అటాక్స్ విషయంలో కొన్ని గంటల పాటు భారత్ ఇజ్రాయెల్ పక్షం వహించింది. ఆ తర్వాత పాలస్తీనాపై ముప్పేట దాడి జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ చర్యలను భారత్ కూడా ఖండించింది.