Bharat Jodi Yatra UP: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ఇన్విటేషన్, భారత్ జోడో యాత్రలో ఆమె పాల్గొంటారా?
Bharat Jodi Yatra UP: భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ఆహ్వానం పంపింది.
Bharat Jodi Yatra UP:
జనవరి 3న యూపీలోకి యాత్ర..
రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఇటీవలే కమల్ హాసన్ ఢిల్లీలో రాహుల్‌తో కలిసి నడిచారు. అయితే...కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కూడా కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందింది. యూపీలో జరిగే యాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్ నేత,మాజీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ నేరుగా వెళ్లి స్మృతి ఇరానీ సెక్రటరీకి ఆహ్వానం అందించారు. ఇదే విషయాన్ని గౌరీ గంజ్‌లో క్యాంప్‌లో వెల్లడించారు దీపక్ సింగ్. అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తాను కేంద్రమంత్రికి ఇన్విటేషన్ పంపినట్టు చెప్పారు. "అందరి కన్నా ముందు స్మృతి ఇరానీకి ఇన్విటేషన్ పంపాలని అధిష్ఠానం నాకు సూచించింది" అని స్పష్టం చేశారు. అయితే..దీనిపై బీజేపీ నేతలు స్పందించారు. బీజేపీ తరపున ఏ ఒక్కరూ భారత్ జోడో యాత్రలో పాల్గొనే
ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. భారత దేశ ఐక్యత కోసం బీజేపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని అన్నారు. దేశం ముక్కలు కాలేదని, వాళ్లు జోడో యాత్ర అంటూ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. జనవరి 3వ తేదీన యూపీలోని ఘజియాబాద్‌లో భారత్ జోడో యాత్ర మొదలు కానుంది. దాదాపు 5 రోజుల పాటు రాష్ట్రంలో యాత్ర కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సిద్ధం చేశారు.
అఖిలేష్ యాదవ్ స్పందన..
భారత్ జోడో యాత్రపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్రలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఐడియాలజీతో పోల్చుకుంటే...తమ పార్టీ (సమాజ్‌వాదీ) ఐడియాలజీ పూర్తిగా వేరు అని వెల్లడించారు. "మాకెలాంటి ఆహ్వానం అందలేదు. బీజేపీ, కాంగ్రెస్ ఐడియాలజీ ఒకటే. మా ఆలోచనా విధానం పూర్తిగా వేరు" అని అన్నారు. అయితే...భారత్ జోడో యాత్రకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. అఖిలేష్ యాదవ్ ఇలా స్పందించడానికి ఓ కారణముంది. భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని బీఎస్‌పీ అధినేత్రి మాయావతికి కాంగ్రెస్ ఇన్విటేషన్ పంపించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలోనే అఖిలేష్ ఇలా కామెంట్ చేశారు. యూపీలో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన ఎస్‌పీకి ఇప్పటి వరకూ ఆహ్వానం అందకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. "భారత్ జోడో యాత్రకు మా మద్దతు ఉంటుంది. అలా అని మేము ఏకమై కూటమి కడతామన్న పుకార్లు పుట్టడం మాకు ఇష్టం లేదు" అని సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి ఘనశ్యామ్ తివారీ వెల్లడించారు. గతంలో కాంగ్రెస్, ఎస్‌పీ జత కట్టాయి. 2008లో యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కలిసి పోటీ చేశాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వేరు పడ్డాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్‌కు యూపీలో మిగిలింది రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏదో విధంగా గట్టిగా నిలబడాలని కాంగ్రెస్ భావిస్తోంది.