Bharat Bandh: తెలంగాణలో నేడు యథాతథంగా బస్సులు.. భారత్ బంద్ వేళ టీఎస్ఆర్టీసీ ప్రకటన
TSRTC: దేశవ్యాప్తంగా సోమవారం రైతు సంఘాలు, పలు పార్టీల ఆధ్వర్యంలో భారత్ బంద్ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో రేపు బస్సు సర్వీసులు యథాతథంగా నడుస్తాయని ప్రకటించింది.
తెలంగాణలో రేపు (సెప్టెంబర్ 27) బస్సు సర్వీసులు యథాతథంగా నడుస్తాయని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. కేవలం తెలంగాణ పరిధిలోనే కాకుండా ఇతర రాష్ట్రలకు వెళ్లే సర్వీసులను సైతం నిలిపివేయడం లేదని స్పష్టం చేసింది. ప్రజలు ప్రతిరోజు మాదిరిగానే తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో జాతీయ రైతు సంఘాలు గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ నెల 27న (రేపు) భారత్ బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చాయి. భారత్ బంద్‌కు దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. సోమవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భారత్ బంద్ జరగనుంది.
Also Read: Bharat Bundh : భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు - బస్సులు నిలిపివేయాలని నిర్ణయం!
ఏపీలో రేపు బస్సులు బంద్..
జాతీయ రైతు సంఘాలు చేపట్టిన బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. దీనిలో భాగంగా ఈ రోజు (సెప్టెంబర్ 26) అర్ధరాత్రి నుంచి బస్సు సర్వీసులు నడవబోవని ప్రకటించింది. భారత్ బంద్‌లో భాగంగా 26వ తేదీ అర్ధరాత్రి నుంచి 27వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులు నడపమని వెల్లడించింది. ఆ తర్వాత నుంచి బస్సులు యధావిధిగా తిరుగుతాయని మంత్రి పేర్ని నాని తెలిపారు. వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్‌కు వైఎస్ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: Exams Postponed: భారత్ బంద్.. తెలుగు రాష్ట్రాల్లో రేపు పలు పరీక్షలు వాయిదా..
భారత్ బంద్‌కు మద్దతిస్తున్న పార్టీలివే..
రాష్ట్రపతి ఆమోదం పొందిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి గత కొంతకాలంగా ఆందోళనలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ బిల్లులను ఆమోదించి ఏడాది కావస్తున్న నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా (SKM) రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఏపీ, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు రైతులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ బంద్‌కు మద్దతు ఇచ్చారు. బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఈ సమ్మెలో పాల్గొంటానని ప్రకటించారు. కాంగ్రెస్ కూడా రైతుల నిరసనల్లో పాల్గొంటామని పేర్కొంది. బ్యాంకర్స్ ఆఫీసర్స్ యూనియన్ సైతం భారత్ బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.