Bangladesh Protest: బంగ్లాదేశ్ ఘర్షణల్లో 93కి చేరిన మృతుల సంఖ్య, దేశవ్యాప్తంగా కర్ఫ్యూ
Bangladesh clashes: బంగ్లాదేశ్ వ్యాప్తంగా మరోసారి అల్లర్లు చెలరేగాయి. తాజాగా హింసాత్మక ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 93కి చేరింది. ప్రధాని షేక్ హసీనా తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
Bangladesh Protest: బంగ్లాదేశ్ వ్యాప్తంగా మరోసారి అల్లర్లు చెలరేగాయి. తాజాగా హింసాత్మక ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 93కి చేరింది. ఇటీవల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు, ప్రజలు ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో గత నెలలో 200 మందికి పైగా మృతి చెందడం తెలిసిందే. దాదాపు 10,000మంది అరెస్ట్ అయ్యారు. ఆదివారం (ఆగస్టు 4) బంగ్లాదేశ్‌లో నిరసనకారులు, అధికార పార్టీ మద్దతుదారుల మధ్య హింసాత్మక ఘర్షణల్లో 93 మంది మరణించారు. చనిపోయిన వారిలో చాలా మంది పోలీసులు కూడా ఉన్నారు.
పోలీసుల అణిచివేతకు వ్యతిరేకంగా మరోసారి ఆ దేశంలో నిరసనలు మిన్నంటాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని విద్యార్థుల్లు రోడ్డెక్కారు. రాజధాని ఢాకాలో విద్యార్థులు చేపట్టిన 'సహకార నిరాకరణ' ఉద్యమంలో మొదటి రోజైన ఆదివారం బంగ్లాదేశ్‌లో అధికార అవామీ లీగ్ మద్దతుదారులకు నిరసనకారుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో వందలాది మంది గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించారు.
ప్రధాని హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'సహకార నిరాకరణ'లో పాల్గొనేందుకు నిరసనకారులు వచ్చారు. అవామీ లీగ్, ఛత్ర లీగ్, జుబో లీగ్ కార్యకర్తలు వారిని వ్యతిరేకించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బంగ్లాదేశ్‌లోని 13 జిల్లాల్లో జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 93 మంది మరణించారని అక్కడి మీడియా ప్రకటించింది. పెరుగుతున్న ఘర్షణల దృష్ట్యా ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి దేశంలో నిరవధిక కర్ఫ్యూ విధించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఫేస్‌బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను మూసివేయాలని ప్రభుత్వ సంస్థలు ఆదేశించాయి. అంతే కాకుండా 4G ఇంటర్నెట్‌ను మూసివేయాలని మొబైల్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది ప్రభుత్వం రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నేటి (ఆగస్టు 4) నుండి సంపూర్ణ 'సహకార' ఉద్యమానికి పిలుపునిచ్చింది.
ఆందోళనకారులను టెర్రరిస్టులు అన్న ప్రధాని
మరోవైపు బంగ్లాదేశ్‌లో నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడుతున్న వారు విద్యార్థులు కాదని, ఉగ్రవాదులేనని ప్రధాని హసీనా అన్నారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రజలను కోరారు. ఈ ఉగ్రవాదులతో కఠినంగా వ్యవహరించాలని దేశప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను' అని ఆమె అన్నారు. ప్రధాని షేక్ హసీనా గణ భవన్‌లో భద్రతా వ్యవహారాల జాతీయ కమిటీ సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB), బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ (BGB), ఇతర ఉన్నత భద్రతా అధికారులు హాజరయ్యారు. దేశంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ హింస చెలరేగుతున్న తరుణంలో ఈ సమావేశం జరిగింది. నిరసనల కారణంగా ఢాకాలోని చాలా దుకాణాలు, మాల్స్ మూతపడ్డాయి. ఢాకాలోని షాబాగ్‌లో వందలాది మంది విద్యార్థులు, కార్మికులు గుమిగూడడంతో ట్రాఫిక్ జామ్ అయింది.
షేక్ హసీనా రాజీనామాకు డిమాండ్
నిరసనకారులు ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల సంస్కరణలపై ఇటీవల జరిగిన నిరసనల్లో మృతి చెందిన వారికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తొలిరోజు కూడా రాజధానిలోని సైన్స్ ల్యాబ్ కూడలి వద్ద ఆందోళనకారులు గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదివారం బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్సిటీ (BSMMU) వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. ప్రజలు కర్రలు పట్టుకుని ఆసుపత్రి ఆవరణలో ప్రైవేట్ కార్లు, అంబులెన్స్‌లు, మోటార్‌సైకిళ్లు, బస్సులను ధ్వంసం చేశారు. అలాగే రోగులు, అటెండర్లు, వైద్యులు, ఇతర సిబ్బందిలో భయాన్ని సృష్టించడం కనిపించింది. ఆందోళనకారులు హసీనా చర్చల ఆహ్వానాన్ని తిరస్కరించారు. ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, మదర్సాల విద్యార్థులతో పాటు కార్మికులు, వృత్తిదారులు, రాజకీయ కార్యకర్తలు, ఇతర సామాన్య ప్రజలు పాల్గొనాలని నిరసన సమన్వయకర్తలు పిలుపునిచ్చారు.
200 మందికి పైగా మృతి
బంగ్లాదేశ్ లో ఇటీవల పోలీసులకు, నిరసనకారులకు మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ హింసాత్మక ఘటనలో 200 మందికి పైగా మరణించారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాల్గొన్న యోధుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించే వివాదాస్పద రిజర్వేషన్ వ్యవస్థను నిలిపివేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.