(Source: ECI/ABP News/ABP Majha)
అమ్మ చనిపోయినా కడుపులో బిడ్డ మాత్రం సేఫ్, డెలివరీ చేసిన వైద్యులు - గాజాలో అద్భుతం
Israel Gaza War: గాజాలో దాడుల్లో చనిపోయిన మహిళ గర్భంలో శిశువు బతికే ఉన్న ఘటన వైద్యులను ఆశ్చర్యానికి గురి చేసింది.
Israel Gaza Conflict: ఇజ్రాయేల్ గాజా యుద్ధం (Israel Gaza War) కొనసాగుతూనే ఉంది. గాజాపై ఇజ్రాయేల్ సైన్యం భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఎంతో మంది పౌరులు బలి అవుతున్నారు. ఈ క్రమంలోనే పాలస్తీనాకి చెందిన ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. అందులో ఓ నిండు గర్భిణి కూడా ఉంది. ఆమె చనిపోయినప్పటికీ కడుపులోని బిడ్డ మాత్రం బతికే ఉంది. వైద్యులు ఇది గుర్తించి వెంటనే డెలివరీ చేశారు. ప్రస్తుతం ఆ ఆడ శిశువు ఆరోగ్యంగానే ఉన్నట్టు వెల్లడించారు. పాలస్తీనా అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం గాజాలోని రఫాలో ఒకేసారి బాంబుల వర్షం కురిసింది. ఈ దాడిలో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో 13 మంది చిన్నారులే ఉన్నారు. కానీ అమ్మ కడుపులో ఉన్న శిశువు మాత్రం అంత యుద్ధ వాతావరణంలో నుంచి బతికి బయటపడ్డాడు. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదో అద్భుతం అని వైద్యులే ఆశ్చర్యపోతున్నారు. C Section చేసి డెలివరీ చేసినట్టు తెలిపారు. చిన్నారి 1.4 కిలోల బరువున్నట్టు తెలిపారు. తల్లి 30 వారాల గర్భంతో ఉన్నప్పుడు దాడి జరిగి ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలోనే వైద్యులు గుర్తించి ఆమెకి డెలివరీ చేశారు. అప్పటి నుంచి ఓ హాస్పిటల్‌లోని ఇంక్యుబేటర్‌పై ఆ శిశువుని ఉంచారు. బంధువులు ఆ చిన్నారిని చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. Rouh అనే పేరు కూడా పెట్టారు. అరబింక్ భాషలో Rouh అంటే స్ఫూర్తి అని అర్థం.
"గుండె పగిలిపోయేంత బాధ ఇది. తీవ్ర మానసిక వేదనకు గురయ్యాం. కుటుంబంలో ఒక్కరు కూడా మిగలకుండా చనిపోయారు. అసలు ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు. కళ్ల ముందే పిల్లల్ని కోల్పోవడం ఎంత నరకమో తెలుసు కదా"
- బాధితులు
13 మంది చిన్నారులు బలి
శిశువు ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ మరో మూడు నాలుగు వారాల పాటు హాస్పిటల్‌లోనే అబ్జర్వేషన్‌లో ఉంచుతామని వైద్యులు చెబుతున్నారు. ఆ తరవాతే చిన్నారిని ఎవరికి అప్పగించాలో నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. ఇంత దాడులను తట్టుకుని బతికినప్పటికీ జీవితం అంతా అనాథగా పెరగాల్సిన పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలస్తీనా అధికారుల వివరాల ప్రకారం...ఇటీవల జరిగిన దాడుల్లో 13 మంది చిన్నారులు బలి అయ్యారు. అయితే..అటు ఇజ్రాయేల్ మాత్రం కేవలం సాయుధ బలగాలపైనే దాడులు చేసినట్టు చెబుతోంది. ఇజ్రాయేల్ గాజాతో ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధమూ ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో అనిశ్చితి నెలకొంది. ఇరాన్ మిలిటరీ బేస్‌లపై ఇజ్రాయేల్ దాడి చేయడంతో మొదలైన ఈ అలజడి పరస్పర దాడులతో మరింత ముదిరింది. మా జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామని ఇప్పటికే ఇజ్రాయేల్‌కి ఇరాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ అనిశ్చితి మరింత తీవ్రమైతే మరో ప్రపంచ యుద్ధం తప్పదేమో అని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: ఇండియన్ మసాలా ఉత్పత్తులపై హాంగ్‌కాంగ్ నిషేధం, ఎవరెస్ట్‌తో పాటు మరో సంస్థకీ షాక్