Ayodhya Ram Mandir LIVE: రాముడు వివాదం కాదు, పరిష్కారం- మోదీ
Ayodhya Ram Mandir Opening LIVE Updates: అయోధ్య ఉత్సవానికి హాజరయ్యేందుకు ప్రముఖులంతా క్యూ కట్టారు.

Background
Ayodhya Ram Mandir Inauguration:
జనవరి 22. ఈ తేదీ భారత దేశ చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజు. వందల ఏళ్ల నాటి వివాదాలకు తెరపడి అయోధ్య రాముడు (Ram Mandir Opening) ఆలయంలో కొలువుదీరే చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచే రోజు. ఎంతో మంది హిందువుల కల నెరవేరే రోజు. ఇప్పటికే అయోధ్యలో సందడి కనిపిస్తోంది. ఉత్సవానికి ముందు జరగాల్సిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ మొత్తం క్రతువులో అంత్యంత కీలకమైంది బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ. ఆ సమయం కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. అది పూర్తైన తరవాతే అయోధ్య రాముడు అందరికీ దర్శనమిస్తాడు. అప్పటి వరకూ రాముడి విగ్రహం ఓ శిల మాత్రమే. ప్రాణ ప్రతిష్ఠ (Ramlala Pran Pratishtha) జరిగిన తరవాత అదే ఆరాధ్యమూర్తి (Ayodhya Ram Mandir) అవుతుంది. అందుకే హిందూ ధర్మంలో ప్రాణ ప్రతిష్ఠ క్రతువుకి అంత ప్రాధాన్యత ఉంటుంది. పేరులోనే ఉంది...ప్రాణ ప్రతిష్ఠ అని. అంటే...అప్పటి వరకూ కేవలం ఓ బొమ్మగా ఉన్నా...ఒక్కసారి గర్భ గుడిలో ప్రతిష్ఠిస్తే అందులో ప్రాణం వచ్చి చేరుతుంది. అయోధ్య రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు పండితులంతా ఎంతో మేధోమథనం చేసి ఓ ముహూర్తాన్ని నిర్ణయించారు. జనవరి 22న మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య కాలంలో ఈ క్రతువు నిర్వహిస్తారు. మొత్తంగా 84 సెకన్ల పాటు ఇది కొనసాగుతుంది. ఇది పూర్తైన వెంటనే మహాపూజ, మహా హారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 22నే ఎంచుకోడానికి ఓ ప్రధాన కారణముంది. పురాణాల ప్రకారం ఇదే రోజున విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తాడు. అమృతం కోసం అటు దేవతలు, ఇటు రాక్షసులు క్షీరసాగరాన్ని మథిస్తున్న సమయంలో సముద్రంలోకి కుంగిపోతున్న మందర పర్వతాన్ని నిలబెట్టేందుకు విష్ణువు తాబేలు అవతారాన్ని ఎత్తాడు. ఈ ప్రపంచానికి ఆధారం ఈ కూర్మావతారం అని హిందూ ధర్మ విశ్వాసం. రాముడు విష్ణువు అవతారమే కదా. అందుకే..అదే రోజున అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ (Significance of Pran Pratishtha) చేయాలని పండితులు నిర్ణయించారు.
ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇటీవలే నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. పనులు మొదలు పెట్టినప్పటి నుంచి చాలా సమస్యలు ఎదురయ్యాయని, వాటన్నింటినీ దాటుకుని విజయవంతంగా నిర్మాణాన్ని పూర్తి చేశామని వివరించారు. ఈ సమస్యల్లో మొదటికి కూలీల కొరత. గతేడాది నవంబర్‌లో తన పాడ్‌కాస్ట్‌లో ఈ విషయం చెప్పారు నృపేంద్ర మిశ్రా. దీపావళి సమయంలో చాలా మంది కూలీలు ఇళ్లకు వెళ్లిపోయారు. అప్పుడు కూలీలు దొరకడమే కష్టమైపోయింది. నిర్మాణ పనులు ఆలస్యమవుతాయేమోనని ఆందోళన చెందినట్టు చెప్పారు మిశ్రా. డిసెంబర్ 31 నాటికి అంతా పూర్తి చేయాలని అప్పటికే టార్గెట్ పెట్టుకున్నారు. మొత్తం 3,500 మంది కూలీలు అప్పటికి అందుబాటులో ఉన్నారు. L&T సంస్థ నిర్మాణ పనులు చేపట్టగా...TATA సంస్థ వీటిని పర్యవేక్షించింది. కూలీలను రిక్రూట్ చేసుకునే బాధ్యతని L&T సంస్థే తీసుకుంది. వందల ఏళ్ల క్రితం ఇక్కడ సరయూ నది ప్రవహించడం వల్ల ఇంకా అక్కడి మట్టిలో ఆ వదులుదనం ఉన్నట్టు వివరించారు మిశ్రా. నిర్మాణం చేపట్టే క్రమంలో ఇంజనీర్లు ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు ఇదే. ఆ సమయంలోనే IIT చెన్నై సహకారం తీసుకున్నారు. 15 మీటర్ల లోతు వరకూ మట్టిని తవ్వి దాన్ని తొలగించి అక్కడ re-engineered soilతో నింపాలని సూచించారు. ఇదే 14 రోజుల తరవాత గట్టి పడుతుందని చెప్పారు ఎక్స్‌పర్ట్‌లు. వాళ్లు చెప్పినట్టుగానే అది రాయిలా తయారైంది. దానిపైనే ఆలయం నిర్మించారు. అయోధ్య వేడుకను ప్రపంచవ్యావ్తంగా లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్,కెనడా, ఫ్రాన్స్ సహా పలు దేశాల్లో హిందువులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
రాముడు వివాదం కాదు పరిష్కారం- మోదీ
శ్రీరాముడు విభజన కాదు పరిష్కారం. రాముడు అగ్ని కాదు శక్తి. రాముడు వర్తమానం కాదు శాశ్వతుడు. బానిసత్వ మనస్తత్వాన్ని విచ్ఛిన్నం చేసి, గతం నుంచి ధైర్యసాహసాలు తీసుకుంటూ ఎదిగిన దేశం ఇలాంటి కొత్త చరిత్రను సృష్టిస్తుందని మోదీ అన్నారు.
ప్రధాని మోదీకి రాజర్షి బిరుదు ఇచ్చిన గోవింద్ దేవ్ గిరి
రామాలయంలో వేదికపై ఉన్న గోవింద్ దేవ్ గిరి జీ మహరాజ్ మాట్లాడుతూ ఇది ఆలయంలోని ఒక విగ్రహానికి జరిగిన ప్రతిష్ఠ కాదని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ కృషితో రామ్‌లల్లాను ప్రతిష్ఠ భాగ్యం దక్కిందన్నారు. రామ్ లల్లా ప్రతిష్ఠ కోసం ప్రధాని మోడీ కఠిన నియమాలను పాటించారని ఆయన అన్నారు. ప్రధాని మోదీకి రాజర్షి బిరుదు ఇచ్చారు.





















