Snake Bite: స్టేషన్‌లోనే పాముకాటుకు గురైన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆందోళనలో పోలీసులు!
Snake Bite: ఈరోజు వేకువజామున 3.30 గంటలకు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను పాము కరిచింది. ప్రస్తుతం పాముకాటుకు గురైన పోలీసులు ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Snake Bite: అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు ఏజెన్సీ కూనవరం పోలీస్ స్టేషన్ లో ఇద్దరు కానిస్టేబుళ్లు పాము కాటుకు గురయ్యారు. ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కానిస్టేబుళ్లు ఉన్న బ్యారక్ లోకి వచ్చిన పాము ఇధ్దరు పోలీసులను కరిచింది. అయితే విషయం గుర్తించిన తోటి పోలీసులు వారిని వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుళ్ల పిరిస్థితి బాగానే ఉందని.. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. పాము కాటుకు గురైన ఇద్దరు కానిస్టేబుళ్లు ఏపిఎస్పీ 3వ బెటాలియన్ కు చెందిన వారని సమాచారం.
పాములు పట్టే వ్యక్తి పాము కాటుకు మృతి..
చాకచక్యంగా పాములు పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేస్తారు. అలా పాము పట్టడానికి వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. పాములు పట్టే అలవాటు ఉన్న ఓ వ్యక్తి అదే పాము కాటుతో ప్రాణం కోల్పోయారు. ఆయన పేరు కొండూరి నాగబాబు శర్మ. వృత్తి రీత్యా పురోహితుడు. ఆయనది కృష్ణా జిల్లా కృత్తివెన్ను గుడిదిబ్బ. అయితే.. కొంతకాలంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. దసరా కావడంతో స్వగ్రామం కృత్తివెన్నుకు వచ్చారు. గ్రామాల్లో కనిపించే పాములను పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలేసే అలవాటు ఆయనకు ఉంది. కృత్తివెన్ను పీతలావ గ్రామస్థులు కొండూరు నాగబాబు శర్మను శనివారం మధ్యాహ్నం పిలిచారు. వాళ్ల విజ్ఞప్తి మేరకు పామును పట్టుకున్నారు నాగబాబు శర్మ. ఎప్పట్లాగే ఆ పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేసే ప్రయత్నంలో ఉండగానే పాము కాటు వేసింది. అతని చేతిపై కాటు వేసింది.
కాటేసినా పామును వదల్లే..
పాము కాటువేసినా ఆయన పామును మాత్రం వదల్లేదు. దాన్ని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టేశారు. తర్వాత ఇంటికి వచ్చిన తనను పాము కాటు వేసిన చోట ప్రథమ చికిత్స తీసుకున్నారు. కానీ కొంతసేపటికే పరిస్థితి విషమించింది. సమీపంలోని చినపాండ్రాక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు నాగబాబు శర్మను పరీక్షంచి పరిస్థితి విషమంగా ఉందని.. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని వారు చెప్పారు. నాగబాబు శర్మ కుటుంబ సభ్యులు ఆయనను సొంత కారులో మచిలీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నాగబాబు శర్మకు వైద్యులు చికిత్స మొదలు పెట్టారు. కానీ వైద్యం చేస్తుండగానే కొండూరి నాగబాబు శర్మ ప్రాణాలు కోల్పోయారు.