EAPCET 2021 Toppers: ఈఏపీసెట్ ఫలితాల్లో అబ్బాయిల హవా.. టాప్ 10 ర్యాంకులు వారికే..
ఈఏపీసెట్ 2021 ఫలితాల్లో అబ్బాయిలు దుమ్ములేపారు. టాప్ 10 ర్యాంకులను కైవసం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఏపీసెట్ - 2021 పరీక్షల ఫలితాలు కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈఏపీసెట్ ఫలితాల్లో అబ్బాయిలు దుమ్ములేపారు. టాప్ 10 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. 3, 4 ర్యాంకుల వారికి ఒకే మార్కులు వచ్చాయి. దీంతో ఇద్దరికీ కలిపి ర్యాంకులను కేటాయించారు. మొత్తం 1,06,090 మంది బాలురు దరఖాస్తు చేసుకోగా.. 1.7 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 79,221 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల విషయానికి వస్తే.. 70488 మంది రిజిస్టర్ చేసుకోగా.. 66453 మంది హాజరయ్యారు. 54,984 మంది క్వాలిఫై అయ్యారు.
అనంతపురం జిల్లా పరిగి మండలం సేవామందిరానికి చెందిన శ్రీ నిఖిల్ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలో మొదటి ర్యాంకు సాధించాడు. నిఖిల్ తండ్రి వెంకటేశ్వరరావు సేవా మందిరం సమీపంలోని అంధుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
టాప్ 10 ర్యాంకర్ల వివరాలు ..
1. కోయి శ్రీ నిఖిల్ (అనంతపురం)
2. వరదా మహంత్ నాయుడు (శ్రీకాకుళం)
3, 4. దుగ్గినేని వెంకట ఫణీశ్ (రాజంపేట, కడప జిల్లా), సవరం దివాకర సాయి (విజయనగరం)
5. నెల్లూరు మౌర్యా రెడ్డి (ఆత్మకూరు)
6. కాకనూరు శశాంక్ రెడ్డి (గిద్దలూరు)
7. విధాతన ప్రణయ్ (విజయనగరం జిల్లా)
8. సూరవరపు హర్ష వర్మ (విజయవాడ)
9. సత్తి కార్తికేయ (పాలకొల్లు)
10. ఓరుగంటి తేజో నివాస్ (తిరుపతి)
ఎంసెట్ పేరు ఎందుకు మార్చామంటే?
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 1000 మంది అదనంగా ఉత్తీర్ణత సాధించారని మంత్రి సురేష్ తెలిపారు. రేపటి (సెప్టెంబర్ 9) నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలకు నీట్ పరీక్ష నిర్వహిస్తున్నందున ఎంసెట్‌లో (EAMCET) M అనే అక్షరాన్ని తొలగించామని మంత్రి చెప్పారు. ఫార్మసీ ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహిస్తున్న కారణంగా M స్థానంలో P అక్షరాన్ని చేర్చి ఈఏపీసెట్‌గా (EAPCET) మార్చినట్లు వివరించారు.
ఐదుగురికి కోవిడ్ పాజిటివ్..
కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఈఏపీసెట్ 2021 పరీక్షలను నిర్వహించామని మంత్రి ఆదిమూలపు వెల్లడించారు. ఐదుగురు విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిన్నటితో (సెప్టెంబర్ 7) పూర్తయిన నేపథ్యంలో ఫలితాలకు ఇంకొన్ని రోజుల సమయం పడుతుందని తెలిపారు. ఈ ఫలితాలను ఈ నెల 14న విడుదల చేస్తామని పేర్కొన్నారు.
Also Read: EAPCET Results 2021: ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ క్లిక్ చేసి రిజల్ట్ చెక్ చేసుకోండి..
Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..