Jagan at Avinash Home: అవినాష్‌కు సీఎం జగన్ సపోర్ట్, విజయవాడ పాలిటిక్స్ లో ఆసక్తికర పరిణామం
YS Jagan at Avinash Home: విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఇంటికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెళ్ళారు.
YS Jagan at Avinash Home:
విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఇంటికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెళ్ళారు. అవినాష్ ఆహ్వానం మేరకు సీఎం జగన్ ఆయన ఇంటికి వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అవినాష్ ఇంటికి సీఎం జగన్...
విజయవాడలో స్టార్ హోటల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అక్కడకు సమీపంలోని పార్టి ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఇంటికి సీఎం జగన్ వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులు సీఎం జగన్ కు స్వాగతం పలికారు. దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులను పేరుపేరునా జగన్ పలకరించారు.
లోకేష్ యువగళం ఎంట్రీకి ముందు రోజు...
మరోవైపున బెజవాడ రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రదాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర రేపటి నుంచి విజయవాడలో కొనసాగనుంది. దీంతో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లో తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ విజయవాడ పర్యటన చేయటం, అందులో పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్న దేవినేని అవినాష్ ఇంటికి వెళ్ళటం హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ యువగళం పాదయాత్ర మరికొన్ని గంటల్లో విజయవాడకు చేరనున్న తరుణంలో స్వయంగా సీఎం జగన్ అవినాష్ ఇంటికి వెళ్ళటం పార్టీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే సీఎం తన ఇంటికి వస్తున్న విషయాన్ని మాత్రం అవినాష్ పార్టీ వర్గాల వద్ద ప్రస్తావించలేదు. మరోవైపున ముఖ్యమంత్రి విజయవాడ షెడ్యూల్ లో అవినాష్ ఇంటికి వెళ్ళే రూట్ ను అధికారులు నిర్దారించారు. నియోజకవర్గంలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగానే తన ఇంటికి ఆహ్వనించినట్లుగా పార్టి నాయకులకు అవినాష్ చెబుతున్నారు.
అటు యార్లగడ్డకు డోర్స్ క్లోజ్...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదనే ప్రచారం కూడ ఎప్పటి నుంచో ఉంది. పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి పదవులు ఇవ్వటం లేదనే అభిప్రాయం లేకపోలేదు. ఇటీవల కమ్మ సామాజిక వర్గానికి పదవులు ఇవ్వటం లేదని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. వీటిన్నింటికి మించి గన్నవరం శాసన సభ స్థానానికి సంబంధించి పార్టీని ముందు నుండి నమ్ముకుని ఉన్న యార్లగడ్డ వెంకటరావు పార్టి ని వీడేందుకు రెడీ అయ్యారు. ఆయన అనుచరులతో సమావేశాలు నిర్వహించుకోవటంతో పార్టీలో ఈ వ్యవహరంపై చర్చ జరుగుతోంది. తాజాగా సీఎం జగన్ స్వయంగా దేవినేని అవినాష్ ఇంటికి వెళ్ళటం ద్వారా వ్యతిరేక ప్రచారాలకు చెక్ పెట్టినట్లయ్యిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చిన అవినాష్...
2019 ఎన్నికలకు ముందు దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గుడివాడలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా కొడాలి నానిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో పార్టిలో చేరిన అవినాష్ కు ఆ తరువాత విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ గా బాధ్యతలు అప్పగించారు. 2024 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి అవినాష్ ను పార్టి అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించారు.