(Source: ECI/ABP News/ABP Majha)
AP Telangana : త్రిసభ్య కమిటీ తొలి భేటీలో నిరాశే ! తెలుగు రాష్ట్రాల మధ్య ఒక్క అంశంలోనూ రాని ఏకాభిప్రాయం..?
త్రిసభ్య కమిటీ భేటీలో ఒక్క అంశంపైనా ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. మొత్తం ఐదు అంశాలపై చర్చ జరిగితే ఐదు అంశాల్లోనూ రెండు రాష్ట్రాలు తమ తమ వాదనలకే కట్టుబడ్డాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ నేతృత్వంలో జరిగిన చర్చలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. తొలి మీటింగ్‌లో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశిష్ కుమార్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్ధిక శాఖ ప్రత్యేక సీఎస్‌లు ఎస్‌ఎస్ రావత్, రామకృష్ణారావులు వర్చువల్‌గా ఐదు అంశాలపై చర్చించారు. అయితే ఒక్క అంశంపై కూడా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ ఆస్తుల విభజనపై రెండు రాష్ట్రాలు ఎవరి వాదన వారికే కట్టుబడ్డాయి. ఈ సంస్థకు 270 ఎకరాల భూమి ఉంది. విభజన చట్టం ప్రకారం ఈక్విటీ జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు చెందాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అది నిబంధనల ప్రకారమే స్వాధీనం చేసుకున్నామని ఉమ్మడి ఆస్తి కాదని తెలంగాణ వాదిస్తోంది. ఈ అంశంలో ఏదీ తేలలేదు. ఇక కరెంట్ బకాయిల అంశం సుదీర్ఘంగా రెండు రాష్ట్రాల మధ్య ఉంది. విభజన చట్టం ప్రకారం ఏపీ 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందచేసింది. దీనికి సంబంధించి ఏపీకి రూ.6,284 కోట్లను తెలంగాణ చెల్లించాల్సి ఉంది. అయితే ఏపీనే తిరిగివ్వాలని తెలంగాణ వాదించింది. దీనిపై ఏకాభిప్రాయం రాలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో ఏపీకి చెందిన పలు కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. పన్నులు కూడా హైదరాబాద్‌లోనే చెల్లించాయి. ఆ విధంగా ఏపీకి చెందిన సంస్థలు చెల్లించిన పన్నులు రూ.3,800 కోట్లు వరకు ఉంటాయి. ఈ మొత్తాన్ని ఇప్పించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అలా ఇవ్వాల్సిన పని లేదని తెలంగాణ స్పష్టం చేసింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి విడుదలైన నిధుల్లో తమ వాటా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఆ నిధులను ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అయితే తెలంగాణ నిధులు తమకు ఎలా వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశ్నించింది.
ఇక రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పౌర సరఫరాల సంస్థలకు ఒకే అధికారి పని చేశారు. ఈ సమయంలో తెలంగాణలో ధాన్యం సేకరణ కోసం ఏపీకి చెందిన రూ.400 కోట్లను వినియోగించారు. ఆ మొత్తాన్ని తెలంగాణ నుంచి ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. తాము అలా తీసుకోలేదని తెలంగాణస్పష్టం చేసింది. సుదీర్ఘంగా చర్చలు జరిగినప్పటికీ ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. త్రిసభ్య కమిటీ ప్రతీ నెలా సమావేశం అవుతుంది. ఈ లోపు రెండు రాష్ట్రాలు చర్చించుకుంటే ఓ పరిష్కారం కనిపించే అవకాశం ఉంది.