Telugu States Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు- పొలిటికల్ లీడర్స్‌కు తప్పని భానుడి సెగ
Andhra Pradesh Weather: తెలుగు రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతున్నాడు. భానుడి సెగ సాధారణ ప్రజలకే కాదు.. రాజకీయ పార్టీల నేతలకు తగులుతోంది.
Telugu States Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతున్నాడు. గత నెల రెండో వారం నుంచి దక్షిణాదిలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరిగింది. ఉదయం ఎనిమిది గంటలు నుంచే ఎండ తీవ్రత అధికంగా నమోదవుతుండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రతతోపాటు ఉక్కపోత, వడగాల్పులు తీవ్రంగా వీస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 38 నుంచి 42 డిగ్రీలు వరకు నమోదవుతుండడంతో ప్రజలు ఠారెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటలు దాటిన తరువాత అత్యవసర పనులు ఉంటే తప్పా ఎవరూ బయటకు రావడానికి కూడా ఇష్టపడడం లేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు ఈ ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖకు చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
తెలంగాణలో చూసుకుంటే... సిద్దిపేట, మేడ్చల్, యాదరిగి, జనగాం, వరంగల్, కరీంనగర్ పరిధిలో 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతు రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, పెద్దపల్లి, జిల్లాల్లో 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతుల రిజిస్టర్ కావచ్చు. హైదరాబాద్‌లో కూడా గరిష్ణ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే... నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాలో 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు రిజిస్టర్ కావచ్చు. పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రిజిస్టర్ కావచ్చు. విశాఖ సుమారుగా 33 డిగ్రీలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
పొలిటికల్ లీడర్స్‌కు తప్పని సెగ
దేశంలో ఎన్నికల్ సీజన్ నడుస్తోంది. ఏపీలో పార్లమెంట్‌తోపాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల నేతలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బస్సు యాత్రలు, ప్రత్యేక సభలు, సమావేశాలను నాయకులు నిర్వహిస్తున్నారు. వీరికి కూడా భానుడి సెగ తప్పడం లేదు. ఎండ తీవ్రత దెబ్బకు నాయకులు సాయంత్రం, రాత్రి వేళల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఆయన ప్రజల్లోకి వెళుతూ మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఆ పార్టీ ముఖ్య నేత కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రజల్లోకి ఉదయం, సాయంత్రం వేళల్లోనే వెళుతున్నారు. భానుడి తాపం దెబ్బకు ఇబ్బందులు పడకుండా ఉండే ఉద్ధేశంతోనే ఈ మేరకు ఆయా పార్టీల నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా భానుడి సెగ సాధారణ ప్రజలకే కాదు.. రాజకీయ పార్టీల నేతలకు తగులుతోంది.