Andhra News: 'తుపాను బాధితులకు ప్రభుత్వం రూ.25 వేలు అందించాలి' - సీఎం రైతుల బాధలు పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం
Chandrababu Slams Ysrcp Governement: ప్రభుత్వం మిగ్ జాం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
Chandrababu Visit in Michaung Affected Areas: 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన రెండో రోజు పర్యటించారు. శనివారం బాపట్ల (Bapatla) జిల్లాలోని పర్చూరు (Parchur) నియోజకవర్గంలో ఆయన బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. తుపాను వల్ల తాము సర్వం కోల్పోయామని జమ్ములపాలెం ఎస్టీ కాలనీలో గిరిజనులు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేక తాము 4 రోజులు చీకట్లోనే గడిపామని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. రోడ్లు సరిగా లేవని, తుపాను వల్ల వర్షాలతో బురదలోనే గడిపామని వివరించారు. ఈ క్రమంలో కాలనీ వాసులకు చంద్రబాబు నిత్యావసరాల కిట్ అందజేశారు. బాధితులకు అండగా ఉంటామని ఓదార్చి ధైర్యం చెప్పారు. అధికారంలోకి రాగానే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా కేంద్రంలోనే ఇలా ఉండడం దారుణం అని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ తరఫున ఒక్కో ఇంటికి రూ.5 వేల సాయం అందిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారనే ఎస్టీ కాలనీ వాసులపై ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు.
'ఈ ప్రభుత్వం అవసరమా.?'
విపత్తు సమయంలో రైతులను, సకాలంలో బాధితులను ఆదుకోలేని ఈ ప్రభుత్వం అవసరమా అని చంద్రబాబు (Chandrababu) ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ముద్దులు పెట్టడం, ఆ తర్వాత మొండిచేయి చూపించడం సీఎం జగన్ కు అలవాటేనని అన్నారు. రైతులను మోసం చేయడం చాలా సులువని సీఎం అనుకుంటున్నారని విమర్శించారు. రైతులకు సకాలంలో విత్తనాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం విరివిగా సాయం అందించాలని, ప్రత్యేక జీవోల ద్వారా వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన ఘటనపై స్పందించిన చంద్రబాబు, 'ప్రాజెక్ట్ గేట్లే మరమ్మతులు చేయలేని వ్యక్తి 3 రాజధానులు కడతారట' అంటూ ఎద్దేవా చేశారు.
'రైతు రాజ్యం తెస్తాం'
రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రాజ్యం తెస్తామని చంద్రబాబు అన్నారు. తుపాను వల్ల పంట చేతికందే సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 'టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తుపాను రాకముందే పంట చేతికి వచ్చేలా చర్యలు చేపట్టాం. పట్టిసీమ ద్వారా రైతులకు సాగునీరు అందించాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎవరి జీవన ప్రమాణాలైనా పెరిగాయా.?' అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వైసీపీ నేతలకు ఇసుకపై ఉన్న ప్రేమ రైతులపై లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. దేశంలోనే ఎక్కువ అప్పులున్న రైతులు ఏపీలోనే ఉన్నారని, రైతు బాధలు పట్టని సీఎం జగన్ ను దేవుడు కూడా క్షమించడని మండిపడ్డారు. 'మిగ్ జాం' తుపానుపై రైతులను సకాలంలో అప్రమత్తం చేయలేదని, కనీసం గోనె సంచులు ఇచ్చిన ధాన్యం ఇంటికి తెచ్చుకునే వారంటూ వ్యాఖ్యానించారు. రైతులకు పూర్తి పరిహారం అంది, వారికి న్యాయం జరిగే వరకూ టీడీపీ పోరాటం ఆగదని స్ఫష్టం చేశారు.
Also Read: JC Prabhakar Reddy: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి, డీఎస్పీపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు