(Source: Poll of Polls)
JC Prabhakar Reddy: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి, డీఎస్పీపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Tadipatri MLA Kethireddy Peddareddy: తాడిపత్రి డీఎస్పీ గంగయ్యపై, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tadipatri Latest News: అనంతపురం: తాడిపత్రి డీఎస్పీ గంగయ్యపై, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Tadipatri MLA Kethireddy Peddareddy)పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి పట్టణ సీఐ హమీద్ ఖాన్ ను సస్పెండ్ చేయడం చాలా బాధాకరమని, హామీద్ ఖాన్ సీఐగా వచ్చిన తర్వాతే తాడిపత్రి పట్టణంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులను క్రికెట్ బుకీ కేసులో హమీద్ ఖాన్ అరెస్ట్ చేశాడని, ఆ కేసులో సీఐ హమీద్ ఖాన్ ఎమ్మెల్యే మాట వినకపోవడంతో, ఆయనను పక్కా ప్రణాళిక ప్రకారం ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తాడిపత్రి డీఎస్పీ గంగయ్యలు సస్పెండ్ చేయించారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
తాడిపత్రి డీఎస్పీ గంగయ్య ఒక ఫ్రాడ్ అని, ఒక ఐదు మంది పోలీసులను ఐడి పార్టీగా నియమించుకొని ఒక్కొక్కరితో ఒక్కో లావాదేవీ నడుపుతున్నారని ఆరోపించారు. ముందుగా తాడిపత్రి డీఎస్పీపై విచారణ చేసి నిజాలు నిగ్గుతేల్చి ఆయనని సస్పెండ్ చేయాలని ఎస్పీని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. ఎవరు తాడిపత్రికి రావద్దు, ఒకవేళ వస్తే ఎమ్మెల్యేకు, డిఎస్పీకి తొత్తులుగా ఉంటేనే ఇక్కడ పనిచేస్తారు, లేకపోతే మీరు ఇక్కడికి వచ్చి సస్పెండ్ అవుతారు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి విదాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ
అనంతపురం జిల్లాలో ఇద్దరు సీఐలపై వేటు పడింది. అనంతపురం రేంజ్ డి.ఐ.జి అమ్మిరెడ్డి ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు వేశారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ నివేదిక ఆధారంగా సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాడిపత్రి అర్బన్ సి.ఐ హమీద్ ఖాన్, బుక్కరాయ సముద్రం సి.ఐ నాగార్జున రెడ్డిలను అనంతపురం రేంజ్ డి.ఐ.జి అమ్మిరెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తాడిపత్రి అర్బన్ సి.ఐ, బుక్కరాయ సముద్రం సి.ఐలు వేర్వేరుగా ఇద్దరు వ్యక్తుల పట్ల కఠినంగా ప్రవర్తించినట్లు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన కావడం తెలిసిందే. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెంటనే స్పందించి ఇద్దరు సి.ఐ లను వీ.ఆర్ కు తీసుకురావడంతో పాటు విచారణ జరిపించారు. జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఆ ఇద్దరు సి.ఐ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు