Crisis in American universities: తగ్గిపోయిన విదేశీ విద్యార్థులు - ఆర్థిక సంక్షోభంలో అమెరికా యూనివర్శిటీలు
US universities విదేశీ విద్యార్థుల చేరికలు బాగా తగ్గిపోవడంతో అమెరికన్ యూనివర్శిటీలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ఒక్క ఇండియా నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా విద్యార్థులు అమెరికా వెళ్లడం లేదు.

American universities financial crisis: అమెరికా యూనివర్శిటీలు ఆర్థిక సంక్షోభం అంచున ఉన్నాయి. విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ సర్కార్ తీవ్రమైన ఆంక్షలు, హెచ్‌వన్ బీపీ, ఓపీటీ వంటి అవకాశాల విషయంలో సందిగ్ధత కారణంగా విదేశీ విద్యార్థులు అమెరికాకు వెళ్లడం అంత సేఫ్ కాదని అనుకుంటున్నారు . అదే సమయంలో అమెరికా యంత్రాంగం వీసాల జారీని కఠినతరం చేసింది. రెండు వైపుల నుంచి సమస్యలు ఉండంతో అమెరికా యూనివర్శిటీల్లో చదువుకునేందుకు చేరే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
భారీగా నష్టపోతున్న అమెరికా యూనివర్శిటీలు
విదేశీ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలకు అధిక ట్యూషన్ ఫీజులు చెల్లిస్తారు. సాధారణంగా ఇవి అమెరికా విద్యార్థుల ఫీజుల కంటే ఎక్కువగా ఉంటాయి. కేవలం అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో 10 శాతం తగ్గితే ల అమెరికా కాలేజీలకు సుమారు 3 బిలియన్ డాలర్ల నష్టం జరుగుతుంది. అలాంటిది సగానికి సగం విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని రిపోర్టులు వస్తున్నాయి. అంటే ఆదాయం ఎంత ఎక్కువగా నష్టపోతున్నారోసులువుగా అర్థం చేసుకోవచ్చు. భారతీయ విద్యార్థులే కనీసం లక్ష కోట్ల రూపాయల వరకూ అమెరికాలో ఖర్చుపెడుతూంటారని అంచనా. ఫీజులు.. ఇతర ఖర్చుల రూపంలో. ఇప్పుడు అందులో సగానికన్నా ఎక్కువ తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది.
భారత్, చైనాల నుంచి భారీగా తగ్గిన విద్యార్థులు
గత ఏడాది జూలైలో హైదరాబాద్ ఎయిర్ పోర్టు జాతరను తలపించేది. తమ పిల్లలను అమెరికా పంపేందుకు తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున వచ్చేవారు. ఈ ఏడాది జూలైలో ఎయిర్ పోర్టు ఖాళీగా ఉంది. అసలు రద్దీ కనిపించడం లేదు. అంటే పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఓ అంచనా ప్రకారం అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 80 శాతానికి పడిపోయింది. 2024లో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన F-1 వీసాలు 38 శాతం తగ్గాయి.ఈ ఏడాది స్లాట్లు కూడా ఓపెన్ చేయడానికి అమెరికా తటపటాయిస్తోంది. ఇక చైనీస్ విద్యార్థుల పరిస్థితి కూడా అంతే ఉంది. వారికీ వీసాల మంజూరులో చైనా కఠిన ఆంక్షలు పెట్టింది.
అమెరికా అర్థిక వ్యవస్థకూ నష్టమే
విదేశీ విద్యార్థుల ఫీజులు, వసతి, ఆహారం, రవాణా, ఇతర ఖర్చుల ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందిస్తారు. 2022లో విదేశీ విద్యార్థుల ఖర్చు అమెరికా ఆర్థిక వ్యవస్థకు 40 బిలియన్ డాలర్ల మేర కలసి వచ్చిందని రిపోర్టులు చెబుతున్నాయి. వీసాల తగ్గింపు వల్ల ఈ ఖర్చు తగ్గడం ద్వారా విశ్వవిద్యాలయ ప్రాంతాల్లోని వ్యాపారాలు, వసతి సౌకర్యాలు, సేవా రంగాలు నష్టపోతున్నాయి. విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మరియు మ్యాథమెటిక్స్) రంగాలలో, యూనివర్సిటీలలో పరిశోధనలకు, యు బోధనా సహాయకులుగా సహకారం అందిస్తారు. వీరి సంఖ్య తగ్గడం వల్ల పరిశోధనా కార్యక్రమాలు , బోధనా నాణ్యతపై ప్రభావం చూపుతుందని యూనివర్శిటీలు ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ విధానాలు మారే వరకూ.. విద్యార్థులు అమెరికా వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చని భావిస్తున్నారు.





















