Ambati Rayudu: ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నా, కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా: అంబటి రాయుడు
Ambati Rayudu: ప్రస్తుతం ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నానని.. రాబోయే కాలంలో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా ఉందని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెలిపారు.
Ambati Rayudu: రాబోయే కాలంలో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెలిపారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఎం జగన్ చెప్పారని గుంటూరు పర్యటనలో భాగంగా తెలిపారు. ముందుగా కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఆయన.. అనంతపం ప్రజల సమస్యల గురించి మాట్లాడారు. కరోనా తర్వాత రాష్ట్రంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో నాలుగు క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. గుంటూరు పుట్టిన జిల్లా కావడంతో ఇక్కడి కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నాని వివరించారు. ప్రస్తుతం ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నానని.. రానున్న కాలంలో రాజకీయాల్లోకి వస్తానని ఆయన వివరించారు. అయితే తాను ఇప్పటికీ ఏ పార్టీలోనూ చేరలేదని, ఎక్కడి నుంచి పోటీ చేయాలని డిసైడ్ కాలేదని స్పష్టం చేశారు.
అశ్రయ పాత్ర ద్వారా పిల్లలకు ఆహారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని అంబటి రాయుడు వివరించారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఐపీఎల్ జట్టు కోసం కృషి చేస్తానని వెల్లడించారు. అకాడమీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నానని... ఆయన పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి ఆయన కొన్ని నెలల క్రితం ఏపీఎల్ కు కూడా గుడ్ బై చెప్పేశారు. అయితే రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం ఉండడం వల్ల ఆయన క్రికెట్ బై చెప్పారని చాలా మంది అనుకుంటున్నారు. ఈక్రమంలోనే ఆయన కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని చెప్పడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మరి చూడాలి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పాల్గొంటారా లేదా పాల్గొంటే ఏ పార్టీ నుంచి, ఎక్కడి నుంచి పోటీ చేస్తారో.
ఇటీవలే వాలంటీర్ వ్యవస్థపై స్పందించిన అంబటి రాయుడు
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల అంశంపై జరుగుతున్న వివాదంలో మాజీ క్రికెటర్, త్వరలో రాజకీయ ప్రవేశం చేయబోతున్న అంబటి రాయుడు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందన్నారు. వాలంటరీ వ్యవస్థ మన రాష్ట్రానికి ఫ్లాగ్ షిప్ లాంటిదన్నారు. దేశంలో 70 సంవత్సరాల నుంచి జరగనిది మన రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతోందని ప్రశంసించారు. ప్రతి మనిషికి ఏది అందాలో అది వాలంటరీ ద్వారా అందుతుందని చెప్పారు. వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు ఒక గొప్ప ఆలోచన అని.. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందని ప్రకటించారు. గుంటూరులో ఆయన వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
వాలంటీర్ల వ్యవస్థ గొప్పదన్న అంబటి రాయుడు
ప్రజలకు మంచిగా సేవలందించే వాలంటరీ వ్యవస్థ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదని... కరోనా సమయంలో వాలంటీర్లు తమ ప్రాణాన్ని ఫలంగా పెట్టి అందరికీ సేవలందించారని ప్రశంసించారు. జీవితాంతం ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలని సలహా ఇచ్చారు. వాలంటరీ వ్యవస్థ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువేనని మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారన్నారు. వాటిని మనం పట్టించుకోకూడదు .. వాలంటీర్లు అందరూ ధైర్యంతో ముందుకు వెళ్లాలని సలహా ఇచ్చారు.