Amara Raja in Telangana: అమర్ రాజా భారీ పెట్టుబడులు, సీఎం రేవంత్‌తో గల్లా జయదేవ్ చర్చలు
Revanth Reddy: ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గల్లా జయదేవ్ తో చర్చలు జరిపారు.
Amar Raja Investments in Telangana: తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ (Amar Raja) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ సంప్రదింపులు జరిపారు. అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ (గతంలో అమర రాజా బ్యాటరీస్) రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు నెలకొల్పుతోంది. ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గల్లా జయదేవ్ తో చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం అందించే సహాయ సహకారాలపై సమావేశంలో చర్చించారు.
అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ (ARE&M) భారతదేశంలోని ప్రముఖ ఎనర్జీ స్టోరేజ్, మొబిలిటీ ఎంటర్‌ప్రైజ్‌లో ఒకటి. పారిశ్రామిక, ఆటోమోటివ్స్ రంగంలో ఉపయోగించే బ్యాటరీల తయారీదారులలో అతిపెద్ద కంపెనీ. పెరుగుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్‌కు అనుగుణంగా అడ్వాన్స్డ్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీని ప్రవేశ పెట్టేందుకు మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా ఒక గిగా కారిడార్‌ను ఏర్పాటు చేస్తోంది. దేశంలోనే పెద్దదైన అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ACC), లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీని ఇక్కడ నెలకొల్పుతోంది. తెలంగాణ న్యూ ఎనర్జీ పార్క్, బ్యాటరీ ప్యాక్ అసెంబ్లింగ్ యూనిట్, శంషాబాద్‌లోని ఇ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్ పేరుతో రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ హబ్ ను ఏర్పాటు చేయనుంది. మొత్తం రూ.9,500 కోట్ల పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది. దీంతో దాదాపు 4,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దాదాపు అదే సంఖ్యలో పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి పథంలో అమర రాజా కీలక భాగస్వామి అని అన్నారు. తెలంగాణలో ఆ కంపెనీ తలపెట్టిన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగినంత సహాయ సహకారాలను అందిస్తుందని భరోసా ఇచ్చారు. అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ గిగా ఫ్యాక్టరీ, ప్యాక్ అసెంబ్లీ, ఇ పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్‌ల నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. క్లీన్ ఎనర్జీకి తెలంగాణ కట్టుబడి ఉందని, అడ్వాన్డ్స్ కెమిస్రీ సెల్ వంటి అధునాతన స్టోరేజీ టెక్నాలజీలకు, కొత్త పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
తమ ప్రాజెక్టును వేగంగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మద్దతుకు అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జయదేవ్ గల్లా ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో తమ ప్రాజెక్టును మరింత విస్తరించేందుకు సన్నద్ధంగా ఉన్నామని అన్నారు. రోజురోజుకూ విస్తరిస్తున్న ఎలక్ట్రానిక్ వెహికల్స్, న్యూ ఎనర్జీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం ప్రధాన భూమిక పోషిస్తోందని, కొత్త పరిశ్రమల స్థాపనకు తగినంత మద్దతును ఆశిస్తున్నామని అన్నారు. న్యూ ఎనర్జీ, లిథియం అయాన్ బ్యాటరీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలతో పాటు వివిధ రంగాలలో తెలంగాణలో మరిన్ని పెట్టుబడులకు తమ కంపెనీ సంసిద్ధతను ఆయన వ్యక్తపరిచారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.