Air India: పైలట్‌ల కోసం ఎయిర్ ఇండియా వెతుకులాట, కొత్త ఫ్లైట్‌లు నడిపేందుకట!
Air India: కొత్త విమానాలు నడిపేందుకు పైలట్‌ల కోసం అన్వేషిస్తోంది ఎయిర్ ఇండియా.
Air India Pilot Recruitment:
6 వేల మందికి పైగా అవసరం..
ఎయిర్ ఇండియా పైలట్‌ల అన్వేషణలో పడింది. కొత్త పైలట్‌ల కోసం వెతుకులాట మొదలు పెట్టింది. ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి 470 ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసే విషయంలో ఇటీవలే ఒప్పందం కుదిరింది. వాటిని నడిపేందుకు కొత్త పైలట్‌లను నియమించుకోవాల్సి ఉంది. 6,500 మంది కన్నా ఎక్కువ మంది పైలట్‌లు అవసరమని భావిస్తోంది. అంతర్జాతీయంగా కార్యకలాపాలను విస్తృతం చేసుకోవడమే లక్ష్యంగా భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఎయిర్ ఇండియా. ఇందులో భాగంగా 840 ఎయిర్ క్రాఫ్ట్‌లు కొనుగోలు చేయనుంది. అయితే వీటిలో 370 ఎయిర్ క్రాఫ్ట్‌ల కొనుగోలుని "ఆప్షనల్"గా పెట్టుకుంది. అంటే..అవసరమైతే కొంటుంది. లేకపోతే లేదు. ఇప్పటి వరకూ ఇండియన్ ఎయిర్ లైన్స్‌లో ఇంత భారీ ఒప్పందం కుదిరిందే లేదు. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 1600 మంది పైలట్‌లు ఉన్నారు. 113 ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే...సిబ్బంది కొరత కారణంగా చాలా సందర్భాల్లో ఫ్లైట్‌లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇది ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగానే కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లను బుక్ చేసుకుంది ఎయిర్ ఇండియా.
నాలుగు దేశాలు కలుపుతూ..
ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి మొత్తం 470 విమానాలను ఎయిర్ ఇండియా ఆర్డర్ చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ నుంచి 250 విమానాలు, అమెరికాకు చెందిన బోయింగ్ నుంచి 220 విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆర్డరు మొత్తం విలువ 80 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 6.40 లక్షల కోట్లు) ఉంటుందని మార్కెట్ అంచనా వేసింది. ఎయిర్ ఇండియా ఒప్పందం జరిగిన తర్వాత, నాలుగు దేశాల ప్రభుత్వానేతలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రో, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దీన్ని బట్టి ఈ డీల్ ఎంత పెద్దది, ఎంత ప్రాధాన్యం ఉందన్న విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడి కార్యాలయం 'వైట్ హౌస్' నుంచి కూడా దీనిపై ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే.. బోయింగ్ & ఎయిర్ ఇండియా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం బోయింగ్ నుంచి 220 విమానాలను 34 బిలియన్ డాలర్లకు ఎయిర్ ఇండియా కొనుగోలు చేస్తుంది. వీటిలో 190 B737 Max, 20 B787, 10 B777X మోడళ్లు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం మరో 70 విమానాలను కొనుగోలు చేసేందుకు కూడా ఎయిర్ ఇండియాకు అనుమతి ఉంది. అవకాశం ఉంటుంది.
తొలిసారి..
విమానాల కొనుగోలుకు ఎయిర్ ఇండియా ఆర్డర్లు ఇవ్వడం గత 17 ఏళ్లలో ఇదే తొలిసారి. టాటా గ్రూప్ యాజమాన్యం కిందకు వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియాకు ఇది మొదటి ఆర్డర్. టాటా గ్రూప్, 2022 జనవరి 27న ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందానికి 17 సంవత్సరాల ముందు, అంటే 2005లో 111 విమానాల కొనుగోలుకు ఎయిర్ ఇండియా ఆర్డర్ ఇచ్చింది. అందులో 68 విమానాల ఆర్డర్ బోయింగ్‌కు, 43 విమానాల ఆర్డర్ ఎయిర్‌బస్‌కు అందింది.
Also Read: Organ Donation Law: అవయవ దానం చట్టంలో కీలక మార్పులు, కేంద్రం కొత్త మార్గదర్శకాలివే