Afghanistan: అఫ్ఘానిస్థాన్ లో అమెరికా వైమానిక దాడులు.. 500 మందికి పైగా తాలిబన్లు హతం
తాలిబన్లపై అమెరికా దళాలు వైమానిక దాడి చేసినట్లు అఫ్ఘానిస్థాన్ రక్షణ శాఖ ట్వీట్ చేసింది. ఈ దాడిలో దాదాపు 500 మందికి పైగా తాలిబన్లు హతమైనట్లు పేర్కొంది.
అఫ్ఘానిస్థాన్‌లో సైన్యం, తాలిబన్ల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. అఫ్ఘాన్, అమెరికా సైన్యం చేసిన వైమానిక దాడిలో పెద్ద సంఖ్యలో తాలిబన్లు హతమైనట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. షెబెర్ గన్ నగరంలో శనివారం జరిగిన ఈ వైమానిక దాడిలో దాదాపు 500 మంది మరణించినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి.
572 terrorists were killed & 309 others were wounded as a result of ANDSF operations in Nangarhar, Laghman, Ghazni, Paktia, Paktika, Kandahar, Uruzgan, Herat, Farah, Jowzjan,Sar-e Pol, Faryab, Helmand, Nimruz, Takhar, Kunduz, Badakhshan & Kapisa Prov during the last 24 hours.
— Fawad Aman (@FawadAman2) August 8, 2021
జవ్ జాన్ రాష్ట్రంలోని షెబర్ గన్ నగరంలో ఉన్న బీ-52 తాలిబన్లపై అమెరికా వాయుసేన వైమానిక దాడి చేసినట్లు అఫ్ఘానిస్థాన్ రక్షణ శాఖ అధికారి ఫవాద్ అమన్ ట్వీట్ చేశారు. ఈ దాడిలో చాలా మంది మృతి చెందడమే కాకుండా వేల సంఖ్యలో ఆయుధాలు, వందల వాహనాలు ధ్వంసమైనట్లు ఆయన వెల్లడించారు.
ఈ దాడిలో మొత్తం 572 మంది ఉగ్రవాదులు చనిపోగా 309 మంది గాయపడినట్లు వెల్లడించారు. భారీ విస్తీర్ణంలో ఉగ్రవాద ఆక్రమిత ప్రాంతాలనూ తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అఫ్ఘానిస్థాన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకునేందుకు తాలిబన్లు వరుస దాడులు చేస్తున్నారు. జవ్ జాన్ రాష్ట్రంలోని షెబర్ గన్ నగరాన్ని తాలిబన్లు గతంలో స్వాధీనం చేసుకున్నారు.
అమెరికా దళాలు అఫ్ఘాన్‌ను వదిలివెళ్తున్న నేపథ్యంలో తాలిబన్లు ఆయా ప్రాంతాలను ఆక్రమిస్తున్నారు. వారిని కట్టడి చేసే క్రమంలో దేశ సైన్యం వరుస దాడులతో వారిపై విరుచుకుపడుతుంది. అమెరికా సైతం అఫ్ఘాన్ దళాలకు సాయం చేస్తోంది.
తాలిబన్లతో అమెరికా ఒప్పందం
అఫ్ఘానిస్థాన్ లో శాంతిని నెలకొల్పేందుకు ఖతార్‌లోని దోహాలో తాలిబన్లతో 2020, ఫిబ్రవరి 29న అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. మిలిటంట్లు ఈ ఒప్పందానికి కట్టుబడిన పక్షంలో, ఈ ఒప్పందం కుదుర్చుకున్న 14 నెలల లోపు అమెరికా, నాటో అనుబంధ దేశాలు తమ సేనలను అఫ్ఘాన్ భూభాగం నుంచి పూర్తిగా ఉపసంహరించేందుకు అంగీకరించాయి.
తప్పుకున్న అమెరికా
ఈ అధికారిక గడువు లోపే అమెరికా తమ సేనలు పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు. ఆ ఒప్పందం ప్రకారం అమెరికా తన సేనలను అంచెలంచెలుగా ఉపసంహరిస్తోంది. అయితే అవకాశం దొరికిందని తాలిబన్లు అప్ఘాన్ ను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న ఆసియా దేశాలు.. అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్లు ఎంత త్వరగా వీలయితే, అంత త్వరగా శాంతిని నెలకొల్పేందుకు చర్చలు ప్రారంభించాలని కోరుతున్నాయి.