Afghanistan Taliban Rule: తాలిబన్ల మధ్య తన్నులాట.. 'బరాదర్' బరాబర్ ఫైట్ చేస్తారా?
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయి.. తాలిబన్ల సర్కార్ కూడా ఏర్పడింది. కానీ తాలిబన్ల మధ్య తన్నులాట మొదలైంది. బరాదర్- హక్కానీ వర్గాల మధ్య విబేధాలు కొట్టుకునే స్థాయికి వెళ్లినట్లు సమాచారం.
అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ తాలిబన్లకు ప్రశాంతత లేదు. వాళ్లలో వాళ్లే తన్నుకుంటున్నారు. కేబినెట్ కూర్పుపై ఈ అంతర్యుద్ధం నడుస్తున్నట్లు బీబీసీ రిపోర్ట్ చేసింది. ముఖ్యంగా అఫ్గాన్ ఉపప్రధాని ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్.. ప్రస్తుత ప్రభుత్వ కూర్పుపై తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
మీటింగ్‌లో ఫైటింగ్..
ఇటీవల అఫ్గాన్ అధ్యక్ష భవనంలో బరాదర్ వర్గం, హక్కానీ వర్గాలు ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం ఏర్పాటు, అఫ్గాన్‌లో తాలిబన్ల విజయంపై 'క్రెడిట్' ఎవరికి దక్కాలనే విషయంపై హక్కానీ నెట్‌వర్క్‌లోని పవర్‌ఫుల్ నేత ఖలీల్ ఉర్ రహ్మన్ హక్కానీ, ముల్లా బరాదర్ మధ్య వివాదం మొదలైంది. తమ దౌత్య చర్చల వల్లే అమెరికన్లు వెళ్లిపోయారని బరాదర్ వర్గం వాదించగా.. తాము యుద్ధం చేయడం వల్లే అమెరికన్లు జారుకున్నారని హక్కానీ అనుచరులు వాదించారు.
ఈ క్రమంలోనే బరాదర్- హక్కానీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఇరువర్గాల సభ్యలు తన్నుకున్నారని.. తాలిబన్ సీనియర్ నేత బీబీసీకి చెప్పినట్లు వార్తా సంస్థ పేర్కొంది.
బరాదర్ మిస్సింగ్..
అయితే ఆ మీటింగ్ తర్వాతే బరాదర్ ఎక్కడా కనిపించలేదు. ఆయన మరణించారని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాను క్షేమంగా ఉన్నానని బరాదర్ ఓ ఆడియో క్లిప్ కూడా విడుదల చేశారు. అయితే తాను ఎక్కడ ఉన్నా అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు బరాదర్. అయితే ప్రభుత్వంలో హక్కానీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం నచ్చని బరాదర్ అసంతృప్తితో కాందహార్‌కు వెళ్లి అక్కడ అజ్ఞాతంలో ఉంటున్నట్లు సమాచారం.
ప్రస్తుత మధ్యంతర ప్రభుత్వంలో హక్కానీల ప్రాబల్యం తగ్గించాలని బరాదర్ చూస్తున్నారు. ఆయనకు అఫ్గాన్ ప్రధాని పదవి దక్కకపోవడానికి కూడా హక్కానీలే కారణమని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. బరాదర్‌కు కతార్ మద్దతు ఇస్తుంది. ఇప్పటికే దోహాలో బరాదర్‌కు ప్రత్యేక కార్యాలయం కూడా ఉంది.
పాక్ జోక్యం..
తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటులో పాకిస్థాన్ కలుగజేసుకొంది. పాక్ ఐఎస్‌ఐ చీఫ్ ఫయాజ్ అహ్మద్ అఫ్గాన్‌కు వెళ్లి అక్కడి ప్రభుత్వ ఏర్పాటులో పావులు కదిపారు. ప్రధాన శాఖలు హక్కానీలకు కేటాయించేలా చర్చలు చేశారు. ఆ తరువాతే హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లా నేతలకు సర్కార్‌లో చోటు దక్కలేదు. ఈ విషయంలో పాక్ జోక్యంపై దోహా బృందం సైతం అసంతృప్తిగానే ఉంది. బరాదర్ సైతం ఇదే విషయమై మనస్తాపానికి గురయ్యారు. హక్కానీలతో ఆయనకు ఈ విషయమై పలు మార్లు వాగ్వాదం జరిగినట్లు సమాచారం.