PM Modi on India's Water: నదులు..మన నీరు.. మనకే సొంతం. దేశ ప్రయోజనాల తర్వాతే ఏదైనా.. ఏబీపీ సమ్మిట్‌లో ప్రధాని మోదీ
PM Modi on India's Water:భారత్‌లో ప్రవహించే నీరు..దేశ ప్రయోజనాలకోసమే వినియోగిస్తామని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించిన India@2047 సమ్మిట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

PM Modi on India's Water: దేశంలో ప్రవహించే నదుల నీటిని ముందు దేశ ప్రయోజనాలకోసమే వినియోగిస్తామని ఆ తర్వాతే మిగతా విషయాలు ఆలోచిస్తామని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాలుగా భారత్‌లోని నదులు అనేక వివాదాలకు, ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి.. మనం నదుల అనుసంధానానికి పూనుకున్నాం. దేశంలో నీటిపై చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు మన నీటిని వేరే వాళ్లకి కూడా ఇచ్చే వాళ్లం ఇప్పుడు అలాంటిదేం ఉండదు. ముందు దేశప్రయోజనాలే ముఖ్యం. మన నదులు మన ప్రయోజనాలే కాపాడతాయి. మన ప్రయోజనాల కోసం వాటిని ఆపుతాం అని విస్పష్టంగా చెప్పారు. ఏబీపీ నెట్‌వర్క్ భారత మండపంలో నిర్వహించిన India@2047 సమ్మిట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ -పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొని సింధూ జల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ABP Network చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ ప్రధానిని వేదికపైకి స్వాగతం పలుకుతూ మాట్లాడారు. 2047 నాటికి మన లక్ష్యం సుస్పష్టం. ఒక దేశంగా మనం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పుకోవాలి. మన ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు పెట్టడానికి మనం ఏం చేయగలం.? దేశంలోయువత, మహిళలు తమ కలలను ఎలా సాకారం చేసుకోగలరు.? అందరికీ తాగు నీటిని ఎలా అందించగలం..? ఉగ్రవాదం నుంచి మన దేశం ఎప్పుడూ సురక్షితంగా బయట పడగలుగుతుంది..ఇవన్నీ ఆలోచించుకోవాలి. అన్నారు. ఆ తర్వాత ప్రధాని కీలకోపన్యాసం చేాశారు.
దేశమే ముందు- మోదీ
స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం కన్న అతిపెద్ద కల వికసిత్ భారత్.. అది సాధ్యమేనని ప్రధాని మోదీ అన్నారు. వందేళ్ల లక్ష్యాలను సాధించుకునే సామర్థ్యం, వనరులు భారత్‌కు ఉన్నాయని మనం దానిని సాధిస్తామని ప్రధాని అన్నారు. పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి భారీ లక్ష్యాలను సాధించడానికి జాతీయభావం, దేశం సామర్థ్యం మీద నమ్మకం ఉండాలి. కానీ దురదుష్టవశాత్తూ.. కొన్ని దశాబ్దాల పాటు దీనికి దూరంగా ఉండిపోయాం. అప్పట్లో నిర్ణయాలన్నీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం తీసుకున్నారు. దీనివల్ల మన అధికారం స్థిరపడుతుందా.. మన ఓటు బ్యాంక్ పోతుందా.. అనే భయాలతో స్వార్థ పూరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయాం అన్నారు. సంస్కరణలు అమలు చేయడంలో ఆలస్యం వల్ల దేశం నష్టపోయింది. ఏ దేశం కూడా ఇలా అభివృద్ధి చెందదు. ఏ దేశం ముందుకెళ్లాలన్నా… “ దేశమే ముందు (Nation First)” అనే భావన ఉండాలి.
దేశంలోని చిన్న బ్యాంకులను విలీనం చేయడం ద్వారా బ్యాంకింగ్ సెక్టార్‌ను నష్టాల నుంచి కాపాడాం. గతంలో బ్యాంకుల నష్టాల ప్రస్తావన లేకుండా ఏ సదస్సులు ముగిసేవి కాదు. 2014కి ముందు బ్యాంకులు కుప్పకూలిపోయే స్థితిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయి. దానికి మా ప్రభుత్వ తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలే కారణం ఎయిర్ ఇండియాను నష్టాల నుంచి కాపాడాం. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి లేదు. Nation First అనే విధానం వల్లనే మేం ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగాం.
UK FTA-ప్రపంచ వాణిజ్య కేంద్రంగా భారత్
భారత్ భవిష్యత్‌లో ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఎదగనుందని.. ప్రధాని చెప్పారు. యునైటైడ్ కింగ్‌డమ్‌తో కుదిరిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందం UK FTA రెండు దేశాల అభివృద్ధిలో కీలక మైలురాయి అని చెప్పారు. దీని వల్ల మన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, MSME లకు ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు.
మనం మార్కెట్ మాత్రమే కాదు.. మేకర్స్ కూడా
ఒకప్పుడు భారత్ అంటే అతిపెద్ద మార్కెట్ మాత్రమే. మనం మేకర్స్ కాదనే భావన ఉండేది. ఇప్పుడు దానిని తుడిచిపెట్టాం. ఆత్మనిర్భరత అనేది మన ఆర్థిక డీఎన్‌ఏలోనే ఉంది. ఇప్పుడు భారత్ అతిపెద్ద రక్షణ పరికరాల తయారీదారు. మన రక్షణ ఉత్పత్తులు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఎగుమతుల విలువ అంతకంతకు పెరుగుతోంది. INS విక్రాంత్, INS Surat, INS Nilgiri మనం సొంతంగా తయారు చేసుకున్నాం.
ప్రజాస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమే
ప్రజాస్వామ్యంలో అభివృద్ధి సాధ్యమా అని చాలా మందికి సందేహాలున్నాయి. 2014లో దేశ ప్రజల ఆశలన్నీ అడియాశలైన సమయంలో మేం అధికారంలోకి వచ్చాం. మా రెండు పదవీకాలాల్లో భారత్ ఏం చేయగలదో నిరూపించాం. ప్రజాస్వామ్యంలో అభివృద్ధికి చోటు ఉండదని అంటారు. కానీ భారత్.. ప్రజాస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమే అని నిరూపించిందన్నారు.
వికసిత్ భారత్ లక్ష్యాలలో డిజిటల్ ఇండియా కూడా అతి ముఖ్యమైనదని.. తక్కవ రేట్‌కు ఇస్తున్న డేటా వల్ల ఓ కొత్త డిజిటల్ విప్లవం సాధ్యమైందని ప్రధాని అన్నారు. డిజిటల్ రివల్యూషన్ వల్ల మన జీవితాల్లో చాలా మార్పులు వస్తున్నాయన్నారు.
ఈ దశాబ్దమే మన భవితను నిర్ణయిస్తుంది
ఈ దశాబ్దం భారత్‌కు అత్యంత కీలకమైంది. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని ప్రధాని అన్నారు. “ ఈ దశాబ్దం అత్యంత ముఖ్యమైంది. దేశం కోసం కొత్త చరిత్రను లిఖించే సమయం ఇది. దేశ ప్రజలు, వ్యవస్థలన్నింటిలోనూ ఈ స్ఫూర్తి కనిపిస్తోంది” అని ప్రధాని మోదీ అన్నారు.
ఏబీపీని అభినందిస్తున్నా..
వికసిత్ భారత్ స్ఫూర్తిని అందిపుచ్చుకుని ఏబీపీ ఈ సదస్సును నిర్వహించడాన్ని ప్రధాని అభినందించారు. "ఉదయం నుంచి చూస్తున్నా.. భారత్ మండపంలో వైవిధ్యం కనిపిస్తోంది. డ్రోన్ దీదీలు, సోలార్ దీదీలు ఈ వేదికపై కనిపించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సమ్మిట్ దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది." అన్నారు.





















