Delhi Ministers: సిసోడియా - సత్యేంద్ర జైన్ స్థానంలో కొత్త మంత్రులు, ఎమ్మెల్యేలకు అవకాశమిచ్చిన కేజ్రీవాల్
Delhi Ministers: ఇద్దరు ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ మంత్రి పదవులు కట్టబెట్టారు.
Delhi New Ministers:
పొలిటికల్ హీట్..
లిక్కర్ స్కామ్ కేసుతో ఢిల్లీ రాజకీయాలు మారిపోతున్నాయి. డిప్యుటీ సీఎం పదవిలో ఉన్న మనీశ్ సిసోడియా రాజీనామా చేశాక ఆ హీట్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. అంతకు ముందు ఆర్థిక మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ కూడా ఓ కేసులో జైలుకు వెళ్లారు. దాదాపు 10 నెలలుగా ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఇద్దరు మంత్రులూ ఇటీవలే తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు వాళ్ల స్థానంలో ఇద్దరు సీనియర్ నేతలను నియమించింది ఆప్ అధిష్ఠానం. ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌కు మంత్రి పదవులు కట్టబెట్టింది. ఇప్పటికే వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు. అతిషికి విద్యాశాఖను కేటాయించారు. సౌరభ్ భరద్వాజ్‌కు ఆరోగ్య శాఖ అప్పగించారు. ఈ నెల 7వ తేదీన సిసోడియా, సత్యేంద్ర జైన్ల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆ తరవాతే ఇద్దరు కీలక ఎమ్మెల్యేలను మంత్రులుగా చేశారు కేజ్రీవాల్. కల్కాజీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అతిషి..సిసోడియాకు రైట్ హ్యాండ్‌లా ఉండేవారు. ఈస్ట్ ఢిల్లీ నియోజవర్గం నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. గౌతమ్ గంభీర్‌పై పోటీ చేసి ఓడి పోయారు. ఇక సౌరభ్ భరద్వాజ్ ఆప్ జాతీయ ప్రతినిధిగా రాణించారు. ఢిల్లీ జల్‌బోర్డ్ వైస్ ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.
AAP MLAs Atishi and Saurabh Bharadwaj take oath as Delhi ministers pic.twitter.com/nyH1q9vsJl
— ANI (@ANI) March 9, 2023
ఊహించని రాజీనామాలు..
ఫిబ్రవరి 28వ తేదీన ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. మంత్రులు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా రాజీనామా చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లేఖలు పంపారు. ఈ మేరకు కేజ్రీవాల్ వీరిద్దరి రాజీనామాలను ఆమోదించారు. మనీశ్ సిసోడియాకు 18 మంత్రిత్వ శాఖల బాధ్యత అప్పగించారు కేజ్రీవాల్. అంతకు ముందు ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరించారు సత్యేంద్ర జైన్. అయితే ఆయన కూడా ఓ స్కామ్‌లో భాగంగా అరెస్ట్ అయ్యారు. దాదాపు 10 నెలలుగా జైల్లోనే ఉంటున్నారు. ఆయన జైలుకి వెళ్లిన తరవాత ఆరోగ్య శాఖ కూడా సిసోడియాకు అప్పగించారు కేజ్రీవాల్. ఇప్పుడు సిసోడియా కూడా సీబీఐ కస్టడీలో ఉన్నారు. లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ అరెస్ట్ చేసినప్పటికీ సిసోడియా మంత్రిత్వ పదవిలో ఎలా కొనసాగుతున్నారంటూ బీజేపీ ఇప్పటికే ప్రశ్నలు సంధించింది. ఆ వెంటనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం సంచలనమైంది.
జైల్లోనూ విచారణ..
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పటికే పలు మార్లు విచారణ చేపట్టిన అధికారులు మరోసారి ప్రశ్నలు సంధించనున్నారు. జైల్లోనే సిసోడియాను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మార్చి 7వ తేదీన దాదాపు 6 గంటల పాటు విచారించిన అధికారులు...స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. ఇంకొన్ని రోజుల పాటు ఈ విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇవాళ మళ్లీ విచారణకు వెళ్లారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్ట్ చేసింది CBI. ఈ నెల 20 వరకూ కస్టడీలోనే ఉండనున్నారు. సిసోడియా అవినీతికి పాల్పడ్డారని తేల్చి చెబుతోంది దర్యాప్తు సంస్థ. సెల్ఫోన్లలో ఆధారాల్లేకుండా వాటిని నిర్వీర్యం చేయడం సహా పదేపదే మొబైల్స్ మార్చడంపై అనుమానం వ్యక్తం చేస్తున్న అధికారులు...సిసోడియాను ఈ విషయమై ప్రశ్నించనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపైనా విచారణ జరుపుతున్నారు. ఈ పాలసీ అమల్లో భాగంగా భారీ మొత్తంలో లంచాలు ఇచ్చిన వారికే లిక్కర్ ట్రేడింగ్ లైసెన్స్‌లు జారీ చేసినట్టు CBI ఆరోపిస్తోంది. అయితే...ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తోంది. ఆ తరవాత మొత్తంగా ఈ పాలసీనే రద్దు చేసింది. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ దీనిపై సీబీఐ విచారణ జరపాలని ప్రతిపాదించిన తరవాతే దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ అప్పటి నుంచి విచారణ కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పటి వరకూ ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేశారు.Also Read: Greater Tipraland: తిప్రాలాండ్ డిమాండ్‌కు తలొగ్గేదే లేదు, మరోసారి స్పష్టం చేసిన మాణిక్ సాహా