Tamilnadu Voters SIR: తమిళనాడులో ఏకంగా 97 లక్షల ఓట్ల తొలగింపు - గగ్గోలు పెడుతున్నరాజకీయ పార్టీలు
Tamil Nadu Voter List : సర్ ప్రక్రియ వల్ల తమిళనాడు ఓటర్ల జాబితాలో 97 లక్షల మంది ఓటర్లు గల్లంతయ్యారు. దీంతో అక్కడి రాజకీయ పార్టీలు ఈసీపై మండి పడుతున్నాయి.
97 Lakh Names Deleted From Tamil Nadu Voter List : తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ప్రక్రియ సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా తొలి దశ ముగిసేసరికి రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 97.37 లక్షల మంది టర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. అక్టోబర్ 27 నాటికి రాష్ట్రంలో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా, తాజాగా విడుదల చేసిన ముసాయిదా జాబితాలో ఈ సంఖ్య 5.43 కోట్లకు పడిపోయింది. అంటే మొత్తం ఓటర్లలో దాదాపు 15.2% మందికి కోత పడింది.
తమిళనాడు ముఖ్య ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ ఈ తొలగింపులు అడ్డగోలుగా జరగలేదని, శాస్త్రీయంగానే జరిగాయని స్పష్టం చేశారు. తొలగించిన వారిలో మరణించిన వారు సుమారు 26.9 లక్షల మంది, చిరునామా మారిన వారు దాదాపు 66.4 లక్షల మంది ఉన్నారు. వీరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం లేదా అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఓటు హక్కు కోల్పోయారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉన్న వారు సుమారు 3.98 లక్షల మంది, సుమారు 1.36 లక్షల మంది ఓటర్ల ఆచూకీ లభించకపోవడం వల్ల వారి పేర్లను తొలగించారు.
రాష్ట్ర రాజధాని చెన్నైలో అత్యధికంగా ఓట్ల తొలగింపు జరిగింది. ఇక్కడ దాదాపు 35 శాతం అంటే సుమారు 14.2 లక్షలు మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. చెంగల్పట్టు, తిరుప్పూర్, కోయంబత్తూర్ వంటి పట్టణ ప్రాంతాల్లో కూడా భారీగానే ఓట్లు తగ్గాయి. ఈ ప్రక్రియలో భాగంగా పోలింగ్ బూత్‌ల సంఖ్యను పెంచామని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య 75,035కు చేరిందని అధికారులు తెలిపారు.
ఈ భారీ తొలగింపులపై రాష్ట్రంలో రాజకీయ యుద్ధం మొదలైంది. అధికార డీఎంకే , తమిళగ వెట్రి కజగం పార్టీలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అర్హులైన ఓటర్ల పేర్లను కూడా తొలగించి ప్రజలను ఓటు హక్కుకు దూరం చేస్తున్నారని, ఇది కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న కుట్ర అని డీఎంకే ఆరోపిస్తోంది. మరోవైపు, ప్రతిపక్ష అన్నాడీఎంకే ఈ ప్రక్రియను స్వాగతిస్తోంది. దొంగ ఓట్లను తొలగించి స్వచ్ఛమైన జాబితా రూపొందించడం మంచి పరిణామమని వారు పేర్కొంటున్నారు.
97 லட்சம் வாக்காளர்கள் நீக்கம்வாக்காளர் வரைவு பட்டியல்ஜெயக்குமார் பரபர பேட்டி#jayakumar #sir #admk #ABPNADU pic.twitter.com/n0lj8zz9BU
— ABP Nadu (@abpnadu) December 20, 2025
తమ పేర్లు పొరపాటున తొలగించబడ్డాయని భావించే వారు లేదా కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలనుకునే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. జనవరి 18, 2026 వరకు క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం కల్పించారు. తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 17, 2026న విడుదల చేయనున్నారు.





















