PM Modi: వచ్చే ఐదేళ్లలో 75 వేల కొత్త మెడికల్ సీట్‌లు, ప్రధాని మోదీ కీలక ప్రకటన
Medical Colleges: దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో అదనంగా 75 వేల కొత్త మెడికల్ సీట్‌లు కల్పిస్తామని ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ఇండిపెండెన్స్ డే స్పీచ్‌లో ఈ విషయం వెల్లడించారు.
Medical Seats: వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో అదనంగా 75 వేల సీట్లు కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఎర్రకోట మీదుగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం ఇచ్చిన ఆయన ఈ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా హెల్త్‌కేర్ రంగంలో సిబ్బంది కొరత ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమస్య తీర్చాలని ప్రభుత్వం ముందుకి ఎన్నో డిమాండ్‌లు వచ్చాయి. ఈ క్రమంలోనే మోదీ చేసిన ప్రకటన కీలకంగా మారింది. అడ్మిషన్‌ల కోసం ఎంతో డబ్బు ఖర్చు చేసి సీట్ రాక ఇబ్బంది పడుతున్న విద్యార్థులను ఉద్దేశించి ఈ ప్రకటన చేశారు మోదీ. ఇకపై ఈ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని అన్నారు. గత పదేళ్లలో దాదాపు లక్ష వరకూ మెడికల్ సీట్‌లు పెంచామని స్పష్టం చేశారు.
అయినా..ఏటా కనీసం 25 వేల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి అక్కడ మెడిసిన్ చదువుతున్నారని అన్నారు. ఈ సమస్య లేకుండా వచ్చే ఐదేళ్లలో మెడికల్ సీట్‌లు పెంచాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ 88% మేర మెడికల్ కాలేజ్‌ల సంఖ్య పెరిగినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2014లో 387గా ఉన్న కాలేజీల సంఖ్య ఇప్పుడు 731కి పెరిగిందని స్పష్టం చేసింది. హాస్పిటల్స్ సంఖ్యనీ పెంచనున్నట్టు ఇప్పటికే మోదీ సర్కార్ ప్రకటించింది. అందుకోసం బడ్జెట్‌లో రూ.90 వేల కోట్ల నిధులు కేటాయించింది.
నీట్ వ్యవహారం..
ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో మెడికల్ సీట్‌ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అడ్మిషన్‌ల కోసం అడ్డదారులు తొక్కుతున్నారన్న వాదనలు వినిపించాయి. ఇదంతా సీట్ల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల జరిగిందని వాదించిన వాళ్లూ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది. ఇకపై ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే...సీట్‌ల సంఖ్య పెంచడం సంగతి సరే మరి అక్కడ భద్రత సంగతేంటని ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు. కోల్‌కత్తాలో ట్రైనీ డాక్టర్ అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయింది. (Also Read: 78th Independence Day Celebrations: గెలుపు పొందు వరకూ అలుపు లేదు మనకు- ఎర్రకోట నుంచి భవిష్యత్ ప్రణాళిక వివరించిన ప్రధామంత్రి మోదీ)
హత్యాచార ఘటనపై వైద్యుల నిరసన..
ఈ ఘటన ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయంగానూ పెద్ద దుమారమే రేపింది. ముఖ్యంగా ఆమెపై అత్యాచారం జరిగిన తీరు అందరికీ తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. అంత పాశవికంగా ప్రవర్తించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా డాక్టర్‌లు నినదిస్తున్నారు. మహిళా భద్రత సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మోదీ చేసిన ప్రకటనతో "మెడికల్ సీట్‌లు పెంచడం కాదు. కాలేజీల్లో భద్రత పెంచండి" అని సోషల్ మీడియాలో కొందరు పోస్ట్‌లు పెడుతున్నారు. "సీట్‌లు పెంచి ఏం లాభం..? ఇలాంటి దారుణాలు జరగాలనేనా" అని ఘాటుగా స్పందిస్తున్నారు. "వైద్య విద్యను అంత ఖరీదు చేసేసి సీట్‌లు పెంచితే ఎవరికి ఉపయోగం" అని ఇంకొందరు వాదిస్తున్నారు.
Also Read: PM Modi: UCC పై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు, దేశవ్యాప్తంగా అమలుకి ప్లాన్ రెడీ అయినట్టే!