Banks Money : ఆ రూ. 26వేల కోట్లు ఎవరివో ? బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసి మర్చిపోయిన జనం..!
బ్యాంకుల్లో దాదాపుగా రూ. 26వేల కోట్ల నగదు పదేళ్ల నుంచి ఖాతాల్లో ఉండిపోయాయి. ఎవరూ వాటిని క్లెయిమ్ చేసుకోవడం లేదని కేంద్రం తెలిపింది.
మనం బ్యాంకుల్లో డబ్బులు వేసుకుంటే ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటాం. ఒక రూపాయి ఎక్కువ, తక్కువైనా ఎందుకొచ్చాయి.. ఎందుకు జమ అయ్యాయో స్టేట్‌మెంట్ చూస్తాం. అయితే అందరూ మన లాంటి వాళ్లే ఉండరు. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులేసి.. మర్చిపోయేవాళ్లు ఉంటారు. ఆ డబ్బులు తీసుకునే తీరిక లేని వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్లు బాగా పెరిగిపోయారు. బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేయని మొత్తాలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం యాక్టివ్‌గా లేని బ్యాంకు ఖాతాల్లో ఏకంగా రూ.26,697 కోట్లు ఉన్నాయట. ఈ విషయం కేంద్రం అధికారికంగా ప్రకటించింది.
Also Read : చరిత్రలో రెండోసారి అత్యధికంగా జీఎస్‌టీ రాబడి.. ఎంత వచ్చాయంటే..!
దేశంలోని అన్ని బ్యాంకుల్లో వినియోగం లేని ఖాతాల్లో రూ.26,697 కోట్లు మగ్గుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు వెల్లడించారు. 2020 ముగింపు నాటికి దాదాపు 9 కోట్ల బ్యాంక్ ఖాతాల్లో ఈ మొత్తం వినియోగం లేకుండా ఉంది. దాదాపు పదేళ్ల నుంచీ నిర్వహణలో లేవు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో రూ.24,356 కోట్లు, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల్లో రూ.2,341 కోట్లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో రూ.0.71 కోట్లు చొప్పున ఈ మొత్తం ఉందన్నారు. ఈ ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు లేదా వారసులను గుర్తించాలని బ్యాంక్‌లకు సూచనలు చేశామని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది.
Also Read: Go Fashion shares: రూ.14,490 పెట్టుబడికి రూ.28,161 లాభం ఇచ్చిన ఐపీవో ఇది
ఏదైనా అకౌంట్ పదేళ్ల పాటు లావాదేవీలు లేకపోతే అందులో ఉన్న సొమ్మును "క్లెయిమ్ చేయని డిపాజిట్ల" ఖాతాలోకి చేరుస్తారు. డిపాజిటర్లకు మెరుగైన సేవలను అందించేందుకు ఆర్బీఐ ఓ నిధిని ఏర్పాటు చేసింది. క్లెయిమ్ చేయని డబ్బునంతా ఈ నిధి ఖాతాలోకి బదిలీ చేస్తారు. కస్టమర్లకు సేవలు అందించేందుకు ఈ నిధిని ఉపయోగిస్తారు. అయితే పదేళ్ల తర్వాత ఖాతాదారుడు తిరిగి వస్తే ఇవ్వరా.. అంటే... ఇచ్చి తీరాల్సిందే. తిరస్కరించడానికి బ్యాంకుకు హక్కు లేదు.
Also Read: Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..
ఎవరైనా ఒక ఖాతాదారుడు, తన అకౌంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉండి, పదేళ్లకు పైగా ఆ ఖాతాను మర్చిపోతే మళ్లీ బ్యాంకును సంప్రదించవచ్చు. ఒకవేళ ఆ ఖాతాలోని డబ్బును ప్రత్యేక నిధికి బదిలీ చేసినా, ఖాతాదారుడు బ్యాంకులకు సరైన ఆధారాలు చూపిస్తే తిరిగి అకౌంట్లోకి డిపాజిట్ చేస్తారు. యథావిథిగా ఆ అకౌంట్ న ఖాతాదారు వాడుకోవచ్చు. డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే అలా వచ్చేవారు తక్కువ. ఆనిధి ఖాతాలో సొమ్ములు అలా పెరిగిపోతూనే ఉన్నాయి.
Also Read: Star Health IPO: స్టార్ హెల్త్ ఐపీవో మొదలు.. దరఖాస్తు చేసే ముందు ఇవి తెలుసుకోండి!