2024 Elections India: రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్‌లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!
దక్షిణాదిలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు భాజపా వ్యూహరచన చేస్తోంది. రాజ్యసభకు నామినేట్ చేసిన వాళ్లంతా దక్షిణాదికి చెందిన వాళ్లే కావటంతో ఆ పార్టీ స్ట్రాటెజీ ఏంటో అర్థమవుతోంది.
దక్షిణాదిపై ఫోకస్ చేసిన భాజపా
ఉత్తరాదిలో పాగా వేసి పరుగులు పెడుతున్న భాజపా..దక్షిణాదిలో మాత్రం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. గతంతో పోల్చుకుంటే కాస్త నయమే అయినా "దక్షిణాదినీ ఏలాలి" అనే ఆకాంక్ష మాత్రం ఇంకా తీరలేదు. 2024 ఎన్నికల్లో ఆ లోటునీ భర్తీ చేయాలని గట్టిగానే కసరత్తు చేస్తోంది కాషాయ పార్టీ. కేంద్రంలో బలమైన ప్రతిపక్షం లేకపోవటం వల్ల ఎలాగో "గెలుపు మాదే" అనే ధీమాతో ఉంది. ఎటొచ్చి దక్షిణాది రాష్ట్రాల్లోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థానిక పార్టీలు, భాజపా విస్తరణను అడ్డుకుంటున్నాయి. ఈ సారి, ఎవరు అడ్డు వచ్చినా, ఎన్ని ఎత్తుగడలు వేసినా వాటిని చిత్తు చేసి అధికారంలోకి రావాలని శపథం చేసింది. అందుకే "సౌత్ ఇండియా మిషన్" అమలు చేస్తోంది. ఎప్పుడూ లేనిది హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయటంతోనే ఈ సంకేతాలు ఇచ్చేసింది. తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమే అని, ప్రజలు తమ వైపే ఉన్నారని క్లెయిమ్ చేసుకుంటోంది. ఇక్కడేంటి..? మొత్తం దక్షిణాది భాజపా అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారని బాగానే ప్రచారం చేసుకుంటోంది. ఇలాంటి ప్రకటనలతో ముందుగానే ప్రతిపక్షాలను అభద్రతా భావంలోకి నెట్టివేసే వ్యూహాన్ని అమలు చేస్తోంది.
స్ట్రాటెజిక్‌గా రాజ్యసభ ఎంపీల ఎంపిక..
దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటకలోనే అధికారంలో ఉంది భాజపా. తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో తెలంగాణలోనే భాజపాకు అత్యధిక అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన ఉప ఎన్నికలు సహా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పలు చోట్ల గెలిచింది. ఫలితంగా...ఇక్కడ వాక్యూమ్ ఉందని భావించిన భాజపా, పూర్తి స్థాయిలో పాగా వేయాలని చూస్తోంది. మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఇంకా కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తనదైన స్ట్రాటజీతో ముందుకొచ్చింది భాజపా. దక్షిణాదికి చెందిన వారిని రాజ్యసభకు నామినేట్ చేసింది. తమిళనాడుకు చెందిన సంగీత దర్శకుడు ఇళయరాజాను ఎంపిక చేసి, తమిళుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలంగాణ నుంచి బాహుబలి రైటర్, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ను నామినేట్ చేసింది. కేరళ నుంచి పరుగుల రాణి పీటీ ఉషను రాజ్యసభకు పంపనుంది మోదీ సర్కార్. ఇక కర్ణాటక నుంచి సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డే రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు. ఇలా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారిని ఎగువసభకు పంపుతూ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది కాషాయ పార్టీ.
ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకునేందుకు..
ఈ ఎంపికల్ని బట్టి చూస్తే, దక్షిణాది రాష్ట్రాల్లో వీలైనంత మేర మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. పైగా ఎంపీ సీట్లపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. సౌత్ ఇండియాలో ఏపీలో 25,తెలంగాణలో 17,కేరళలో 20, కర్ణాటకలో 28 ఎంపీ స్థానాలున్నాయి. అత్యధికంగా తమిళనాడులో 39 ఎంపీ సీట్లున్నాయి. అంటే మొత్తంగా కలుపుకుని 129 ఎంపీ స్థానాలున్నాయి. వీటిలో కనీసం 80% స్థానాల్లో మంచి ఫలితాలు రాబట్టగలిగితే దక్షిణాదిలో తమ బలం పెరుగుతుందని భాజపా భావిస్తోంది. అయితే ఈ అన్ని చోట్ల భాజపా అనుసరిస్తున్న వ్యూహం ఒకటి కామన్‌గా కనిపిస్తోంది. అదే జాతీయవాదం. ఎప్పటిలాగే హిందుత్వ కార్డ్‌ని చూపించి, ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోంది. "వన్ నేషన్, వన్ క్యాంపెయిన్" వ్యూహంతోనే దక్షిణాదిలోనూ ప్రచారం సాగించాలని కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన భారీ బహిరంగ సభలో భాజపా నేతల ప్రసంగం ద్వారానే "హిందుత్వ కార్డ్"ను ఎలా వాడనున్నారో స్పష్టంగా అర్థమైంది. "జైశ్రీరామ్" అంటూ నినాదాలు చేయటమూ ఇందులో భాగమే.
మూడు రాష్ట్రాల్లో బలం చాటుకుంటున్న భాజపా
కేరళలో క్రిస్టియన్ గ్రూప్‌ను ఆకట్టుకునేందుకు ప్లాన్ చేస్తోంది భాజపా. క్రైస్తవులు మళ్లీ హిందూ మతంలో చేరాలనే నినాదంతో "ఘర్ వాపసీ" స్ట్రాటెజీని అమలు చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఇక తమిళనాడులో ఏఐడీఎమ్‌కేకు మద్దతు తెలుపుతున్నట్టుగా కనిపిస్తున్నా, తమ ప్రత్యేకతను చాటుకోవాలని భావిస్తోంది. కానీ...ఇక్కడ ఓటు శాతం మాత్రం తక్కువగానే ఉంది. 2014లో 5.56%గా ఉన్న భాజపా ఓటు శాతం, 2019 ఎన్నికల్లో 3.66%కి పడిపోయింది. కేరళలో 2.48% పెరగ్గా, కర్ణాటకలోనూ 8%పైగా అధికమైంది. తెలంగాణలో 8.5% ఓటు శాతం పెంచుకోగలిగింది కాషాయ పార్టీ. ఏపీలో మాత్రం 7.5% మేర తగ్గిపోయింది. మొత్తంగా 5 దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు మూడు చోట్ల భాజపా బలంగానే ఉంది. మిగతా రెండు రాష్ట్రాల్లోనూ బలం పెంచుకునేందుకు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది.