Pakka Commercial Movie Review - 'పక్కా కమర్షియల్' రివ్యూ: గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన సినిమా ఎలా ఉందంటే?
Pakka Commercial Telugu Movie Review: దర్శకుడు మారుతి వినోదాత్మక చిత్రాలు చక్కగా తెరకెక్కిస్తారని పేరుంది. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా ఆయన తెరకెక్కించిన 'పక్కా కమర్షియల్' ఈ రోజు విడుదలైంది.
మారుతి
గోపీచంద్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్ తదితరులు
సినిమా రివ్యూ: పక్కా కమర్షియల్
రేటింగ్: 2.5/5
నటీనటులు: గోపీచంద్, రాశీ ఖన్నా, సత్యరాజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, అజయ్ ఘోష్, ప్రవీణ్, సప్తగిరి, శియ, చిత్రా శుక్లా తదితరులు
సినిమాటోగ్రఫీ: కర్మ్ చావ్లా
సంగీతం: జేక్స్ బిజాయ్
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: 'బన్నీ' వాసు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: జూలై 1, 2022
గోపీచంద్ (Gopichand) కథానాయకుడిగా నటించిన సినిమా 'పక్కా కమర్షియల్' (Pakka Commercial Movie). దీనికి మారుతి దర్శకుడు. హీరోలను స్టయిలిష్‌గా చూపిస్తూ... కమర్షియల్ హంగులు కూడిన కథలతో ప్రేక్షకులను నవ్విస్తూ... విజయాలు అందుకోవడం మారుతి శైలి. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాల్లో గోపీచంద్ స్టయిలిష్‌గా ఉన్నారు. హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) క్యారెక్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. మరి, సినిమా ఎలా ఉంది?
కథ (Pakka Commercial Movie Story): సూర్యనారాయణ (సత్యరాజ్) నిజాయితీకి మారుపేరు లాంటి న్యాయమూర్తి. ఒక కేసులో అమ్మాయికి న్యాయం చేయలేకపోయానని రాజీనామా చేస్తారు. నల్లకోటు తీసి కిరాణా షాపు పెట్టుకుంటారు. ఆయన కుమారుడు లక్కీ (గోపీచంద్) లాయర్ అవుతాడు. తండ్రి ముందు మంచి వాడిగా నటిస్తూ.... కోర్టులో క్రిమినల్స్ పక్కన నిలబడి వాళ్ళను బయటకు తీసుకొస్తూ ఉంటాడు. కొడుకు నిజస్వరూపం ఒక రోజు తండ్రికి తెలుస్తుంది. పైగా, ఎవరి వల్ల అయితే తాను న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశాడో... ఆ వివేక్ (రావు రమేష్) దగ్గర డబ్బులు తీసుకుంటూ, కేసుల నుంచి బయట పడేయడానికి ప్రయత్నించడం సూర్యనారాయణకు నచ్చదు. మళ్ళీ నల్లకోటు వేసుకుని కోర్టులో లాయర్‌గా అడుగుపెడతాడు. వివేక్‌కు శిక్ష పడేలా చేయడంలో సూర్యనారాయణ సక్సెస్ అయ్యారా? లేదంటే తండ్రి నుంచి క్రిమినల్‌ను కొడుకు లక్కీ కాపాడాడా? చివరకు, ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Pakka Commercial Review) : మారుతి బలం వినోదం! మరోసారి 'పక్కా కమర్షియల్'లో అది కనిపించింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. అందులో సందేహం లేదు. అయితే... కథ విషయంలో నిరాశ తప్పదు. కథానాయకుడిని స్టయిలిష్‌గా, హీరోయిజమ్ ఎలివేట్ అయ్యేలా ప్రజెంట్ చేసిన మారుతి కథపై మరింత కాన్సంట్రేట్ చేసుంటే బావుండేది. అవుట్ పుట్ మరోలా ఉండేది.
కథ సంగతి పక్కన పెడితే... క్యారెక్టరైజేషన్స్ విషయంలో మారుతి మరోసారి తన మార్క్ చాటారు. డైలాగుల్లో ఆయన మార్క్ బలంగా వినిపించింది. ముఖ్యంగా రాశీ ఖన్నా క్యారెక్టర్ విషయంలో! సినిమాల్లో ఫైట్స్ మీద వేసిన సెటైర్, పెళ్లి తర్వాత రావు రమేష్ చెప్పే డైలాగ్స్ గ్యారెంటీ నవ్విస్తాయి. అయితే... రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే కావడం సినిమాకు మైనస్. ఇంటర్వెల్ ఎలా ఉంటుందో సినిమా ప్రారంభంలో ఊహించవచ్చు. అలాగే, క్లైమాక్స్ కూడా! ఈ మధ్యలో కొన్ని సన్నివేశాలు సాగదీసిన ఫీలింగ్ ఉంటుంది.
'పక్కా కమర్షియల్' టైటిల్ సాంగ్ క్యాచీగా ఉంది. 'అందాల రాశి...' వినసొంపుగా ఉంది. పిక్చరైజేషన్ పరంగానూ రిచ్‌గా ఉన్నాయి. అయితే... సెకండాఫ్‌లో సాంగ్స్ కథకు అడ్డు తగిలాయి. ఆ పాటలు కూడా బాలేదు. నేపథ్య సంగీతం ఓకే. కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
నటీనటులు ఎలా చేశారు?: గోపీచంద్ చాలా హ్యాండ్సమ్‌గా కనిపించారు. ఆయన లుక్స్‌లో స్టయిలిష్ లుక్ ఇదే. కామెడీ టైమింగ్ బావుంది. ఆల్రెడీ ఆయన యాక్షన్ సీక్వెన్సులు గతంలో చాలా చేశారు. ఇందులోని యాక్షన్ సీక్వెన్సుల్లోనూ స్టయిలిష్‌గా కనిపించారు. ఆయన వెయిట్ తగ్గినట్లు తెలుస్తోంది. 'సుప్రీమ్', 'ప్రతి రోజూ పండగే' సినిమాల్లో రాశీ ఖన్నా కామెడీ టైమింగ్ ప్రేక్షకులు చూశారు. ఈ సినిమాలో సీరియల్ ఆర్టిస్టుగా పెక్యులర్ బాడీ లాంగ్వేజ్‌తో కామెడీ ఇరగదీశారు. గ్లామరస్‌గానూ కనిపించారు. పాటల్లో అందంగా కనిపించారు. నిజంగానే... అందాల రాశి. తండ్రి పాత్రలు చేయడం సత్యరాజ్‌కు అలవాటే. పాత్రలో ఒదిగిపోయారు. రావు రమేష్ విలన్ రోల్ చేశారు. సప్తగిరి, ప్రవీణ్, 'వైవా' హర్ష తదితరులు కామెడీ సీన్స్‌లో కనిపించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ అతిథి పాత్రలో కనిపించారు. చిత్రా శుక్లా సైతం ఒక్క సన్నివేశంలోనే కనిపించారు. శియాకు కీలక పాత్ర దక్కింది.
Also Read : 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే?: థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు రెండున్నర గంటలు పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ అందించడం కోసం తీసిన చిత్రమిది. కథ, లాజిక్స్, స్క్రీన్ ప్లే అంటూ ఆలోచించే ప్రేక్షకులకు సినిమా అస్సలు నచ్చదు. మారుతి మార్క్ హ్యూమర్ ఎంజాయ్ చేసే వాళ్ళకు ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా. జస్ట్ ఫర్ ఫన్!!
Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?