O Kala Movie Review - 'ఓ కల' రివ్యూ : డిప్రెషన్‌కు ఆత్మహత్యే పరిష్కారం కాదని చెప్పే సినిమా!
OTT Review - O Kala Movie In Hotstar : కొత్త హీరో హీరోయిన్లు, దర్శకుడు కలిసి చేసిన సినిమా 'ఓ కల'. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
దీపక్ కొలిపాక
గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్, 'వైవా' రాఘవ్
సినిమా రివ్యూ : ఓ కల
రేటింగ్ : 2.5/5
నటీనటులు : గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్, అలీ, 'వైవా' రాఘవ్, దేవి ప్రసాద్, శక్తి, యూట్యూబర్ రవితేజ తదితరులు
ఛాయాగ్రహణం : అఖిల్ వల్లూరి
సంగీతం : నీలేష్ మందలపు
నిర్మాతలు : లక్ష్మీ నవ్య మోటూ రు, రంజిత్ కుమార్ కొడాలి
దర్శకత్వం : దీపక్ కొలిపాక
విడుదల తేదీ: ఏప్రిల్ 13, 2022
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
నూతన తారలు, దర్శక - నిర్మాతలు చేసే సినిమాలకు ఓటీటీ మాధ్యమాలు చక్కని వేదికగా నిలుస్తున్నాయి. కంటెంట్ బావుంటే స్టార్లు లేకపోయినా ప్రేక్షకుల నుంచి చక్కటి ఆదరణ లభిస్తోంది. దాంతో కంటెంట్ బేస్డ్ లో బడ్జెట్ సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. 'ఓ కల' (O Kala Movie) కూడా ఆ కోవలో చిత్రమే. డిస్నీ పలు హాట్ స్టార్ (Disney Plus Hotstar) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ (O Kala Movie Story) : ఎంబీఏ చేసిన హారిక వర్మ (రోషిణి)కి మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఆ ఆఫర్ రిజెక్ట్ చేసి మరీ సొంతంగా బిజినెస్ పెడుతుంది. ఆమె నిర్ణయాన్ని కన్న తల్లితో సహా బంధువులు అందరూ వ్యతిరేకించినా తండ్రి (దేవి ప్రసాద్) మద్దతు ఇస్తాడు. తొలుత లాభాలు వస్తాయి. అయితే, వ్యాపార భాగస్వామి మోసం చేయడంతో కంపెనీ నష్టాల్లో కూరుకుపోతుంది. దాంతో హారిక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఆ సమయంలో హర్ష (గౌరీశ్ యేలేటి) పరిచయం అవుతాడు. ఆత్మహత్య నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడమే కాదు, హర్షతో కలిసి కశ్మీర్ వెళుతుంది.
ఫేమస్ ఫోటోగ్రాఫర్ అయిన హర్ష, తనను సహాయ దర్శకుడిగా హారికకు ఎందుకు పరిచయం చేసుకున్నాడు? హారిక జీవితంలో హర్ష తీసుకొచ్చిన మార్పులు ఏమిటి? హర్ష ప్రేయసి ప్రత్యూష (ప్రాచీ ఠక్కర్), స్నేహితుడు తరుణ్ ('వైవా' రాఘవ్) పాత్రలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (O Kala Review Telugu) : 'ఓ కల'లో మెప్పించే అంశం ఏమిటంటే... కొత్త దర్శకుడు దీపక్ కొలిపాక చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా చెప్పాడు. నేరుగా కథలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా కథలో భాగంగా కామెడీ వచ్చింది. అంతే తప్ప సెపరేట్ ట్రాక్స్ ఏమీ రాయలేదు. ప్రేమ సన్నివేశాలను సైతం సెన్సిబిల్ గా డీల్ చేశాడు.
''ఇవాళ రాత్రి మనం కళ్ళు మూసుకొని మళ్ళీ పొద్దున్న కళ్ళు తెరిస్తేనే కదా... మనం బతికి ఉన్నట్టు! లేకపోతే చచ్చి పోయినట్టే కదా! మనం కంట్రోల్ చేయలేని జీవితాన్ని, మన కంట్రోల్ లోకి తీసుకోవద్దు'' - ఇదీ 'ఓ కల'లో దర్శకుడు ఇచ్చిన సందేశం. సినిమా స్టోరీ లైన్ కూడా ఇదే! సినిమాలో బ్యూటీ ఏంటంటే... ఎక్కడా క్లాస్ పీకినట్టు ఉండదు.
కథలో కొత్తదనం లేదు. అలీ కామెడీ ట్రాక్ బాలేదు. కథా నేపథ్యం, సన్నివేశాలు సైతం ఆహా ఓహో అనేలా లేవు. అమ్మాయి సక్సెస్ సెలబ్రేట్ చేయడానికి పార్టీల కోసం లక్షలు ఖర్చు చేసే తండ్రి దగ్గర కనీసం కోట్లు లేవా? వంటి లాజిక్స్ ఇక్కడ అనవసరం. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి. అయితే... డిప్రెషన్ గురించి దర్శకుడు దీపక్ డిస్కస్ చేసిన తీరు బావుంది. హీరోయిన్ రోషిణి క్యారెక్టరైజేషన్ సైతం బావుంది. ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం కాదని, అమ్మాయిలు ధైర్యంగా నిలబడాలని చెప్పారు. రొమాన్స్ కంటే డ్రామా మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. సంభాషణలు అర్థవంతంగా ఉన్నాయి. సాంగ్స్ ఓకే. ప్రొడక్షన్ వేల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. కథకు ఎంత అవసరమో... అంతే ఖర్చు చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇటువంటి సినిమాల్లో రెండు మూడు సూపర్ హిట్ సాంగ్స్ పడితే బావుండేది.
నటీనటులు ఎలా చేశారు? : గౌరీశ్ యేలేటి, రోషిణి... హీరో హీరోయిన్లకు ఇది తొలి సినిమా. అయితే, చూస్తున్నంత సేపు కొత్తవాళ్ళు చేసినట్లు కనిపించలేదు. తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరో ప్రేయసిగా, న్యూ ఏజ్ అమ్మాయి పాత్రలో ప్రాచీ ఠక్కర్ పర్వాలేదు. 'వైవా' రాఘవ్ కామెడీ టైమింగ్ కొన్ని సన్నివేశాల్లో చిరునవ్వు తెప్పించింది. తండ్రి పాత్రలో దేవి ప్రసాద్ నటన హుందాగా ఉంది. మిగతా నటీనటులు పర్వాలేదు.
Also Read : 'శాకుంతలం' రివ్యూ : సమంత సరిగా చేయలేదా? గుణశేఖర్ బాగా తీయలేదా?
చివరగా చెప్పేది ఏంటంటే? : 'ఓ కల' కథలో మలుపులు లేవు. భావోద్వేగాలు భారీ స్థాయిలో లేవు. అయితే, అర్థవంతమైన సంభాషణలతో పాటు చక్కటి దర్శకత్వం సినిమాను చూడబుల్ గా చేశాయి. ఒక్కసారి చూడటం మొదలు పెడితే అలా అలా ముందుకు వెళతాం. చక్కటి సందేశం ఇస్తుందీ సినిమా. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే... సర్‌ప్రైజ్ చేస్తుంది. టైమ్‌పాస్ కోసం వీకెండ్ ఓ లుక్ వేయవచ్చు.
Also Read : 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?