Mukhachitram Review - 'ముఖచిత్రం' రివ్యూ : సినిమా చూశాక ప్రేక్షకుల ముఖచిత్రాలు ఎలా ఉంటాయంటే?
Mukhachitram Movie Review : 'కలర్ ఫోటో' దర్శకుడు సందీప్ రాజ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన సినిమా 'ముఖచిత్రం'. ఇందులో విశ్వక్ సేన్ కీలక పాత్ర చేశారు.
గంగాధర్
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్, విశ్వక్ సేన్ తదితరులు
సినిమా రివ్యూ : ముఖచిత్రం
రేటింగ్ : 2/5
నటీనటులు : వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్, రవిశంకర్ తదితరులతో పాటు ప్రత్యేక పాత్రలో విశ్వక్ సేన్, అతిథి పాత్రలో సునీల్
కథ, కథనం, మాటలు : సందీప్ రాజ్
సంగీతం : కాల భైరవ
సమర్పణ : ఎస్.కె.ఎన్
నిర్మాతలు : ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల
దర్శకత్వం : గంగాధర్
విడుదల తేదీ: డిసెంబర్ 9, 2022
జాతీయ అవార్డు అందుకున్న 'కలర్ ఫోటో' దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj) కథ, కథనం, మాటలు అందించిన సినిమా 'ముఖచిత్రం' (Mukhachitram Movie). 'సినిమా బండి' ఫేమ్ వికాస్ వశిష్ట, 'హుషారు' ఫేమ్ ప్రియా వడ్లమాని జంటగా నటించారు. '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ ఫేమ్ చైతన్య రావు, ఆయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. న్యాయవాదిగా విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రత్యేక పాత్ర చేశారు. ప్రచార చిత్రాలు ఆసక్తి కలిగించాయి. సినిమా ఎలా ఉంది (Mukhachitram Review)?
కథ (Mukhachitram Movie Story) :
రాజ్ కుమార్ (వికాస్ వశిష్ట) ప్లాస్టిక్ సర్జన్. వాట్సాప్‌లో పెళ్లిళ్ల పేరయ్య పంపిన మహతి (ప్రియా వడ్లమాని) ఫోటో చూసి ఇష్టపడతాడు. వాళ్ళింటికి వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడతాడు. మహతికి ప్రపోజ్ చేస్తాడు. ఆమె ఓకే చెబుతుంది. పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత రాజ్ స్కూల్ ఫ్రెండ్ మాయా ఫెర్నాండజ్ (ఆయేషా ఖాన్)కు యాక్సిడెంట్ కావడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత రోజు ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడి మహతి కోమాలోకి వెళుతుంది. ఆ తర్వాత మరణిస్తుంది. దానికి కారణం ఎవరు? రాజ్ కుమార్ మీద మరణించిన మహతి పేరుతో మాయ ఎలా కేసు పెట్టింది? ఆ కేసు ఏమిటి? మాయ తరఫున కేసు వాదించిన విశ్వామిత్ర (విశ్వక్ సేన్) ఎవరు? చివరకు, కేసులో ఎవరు విజయం సాధించారు? మహతి మరణించిన విషయం ప్రపంచానికి ఎందుకు తెలియలేదు? అది బయటకు రాకపోవడానికి కారణం ఎవరు? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Mukhachitram Movie Telugu Review) :
ఓ అమ్మాయి 'నో' అని చెబితే 'నో' అని అర్థం. No Means No - హిందీ సినిమా 'పింక్'లో ఇచ్చిన సందేశం. తెలుగు ఆ సినిమాను 'వకీల్ సాబ్'గా రీమేక్ చేశారు. 'ఓ అమ్మాయి వద్దని చెబితే వద్దు అని అర్థం' అని పవన్ కళ్యాణ్‌తో ఆ మెసేజ్ చెప్పించారు. మహిళ ఇష్టం లేకుండా శృంగారం చేయమని బలవంతం చేయకూడదని, ఆఖరితో భార్యతో అయినా సరే ఆమె ఇష్టం లేకుండా చేయకూడదని సందేశం ఇచ్చారు. 'ముఖచిత్రం'లో ఇచ్చిన సందేశం కూడా అదే. సమాజంలో ఎంతో మంది పైకి చెప్పుకోలేకపోతున్న వైవాహిక అత్యాచారాల నేపథ్యంలో తీసిన చిత్రమిది.
'ముఖచిత్రం'లో కోర్ట్ రూమ్ సీన్స్ వస్తుంటే... 'వకీల్ సాబ్'లో కోర్ట్ సీన్స్ గుర్తుకు వస్తాయి. బహుశా... ప్రేక్షకులకు ఈ సందేహం వస్తుందని అనుకున్నారేమో!? విశ్వక్ సేన్ వాదిస్తుంటే... 'వకీల్ సాబ్' సినిమా కూడా పెన్ డ్రైవ్‌లో ఇవ్వాల్సిందని కౌంటర్ డైలాగ్ చెప్పించారు. సినిమాలో సందేశం బావుంది. కానీ, ఆ సందేశాన్ని చెప్పిన తీరు ఆసక్తిగా లేదు. సందీప్ రాజ్ మంచి రచయిత. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. చాలా సన్నివేశాల్లో మాటల్లో ఏదో చెప్పాలనే ప్రయత్నం కనిపించింది. ఆయన రాసిన సంభాషణలు బావున్నాయి. ఎంపిక చేసుకున్న కథనం బావుంది, వైవాహిక అత్యాచారాలకు డిఫరెంట్ కాన్సెప్ట్ యాడ్ చేశారు. అయితే... కథనం, సన్నివేశాల్లో కొత్తదనం లోపించింది.
కాలభైరవ అందించిన స్వరాలు, నేపథ్య సంగీతం బావున్నాయి. కొన్ని సీన్స్‌లో ఫీల్ రీ రికార్డింగ్ వల్ల ఎలివేట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు ఓకే.
నటీనటులు ఎలా చేశారు? : ప్రియా వడ్లమానికి రెండు షేడ్స్ చూపించే క్యారెక్టర్ లభించింది. సాంప్రదాయబద్ధమైన అమ్మాయిగా కనిపించే సన్నివేశాల్లో కాస్త ఇబ్బంది పడినట్టు అనిపిస్తోంది. లుక్ సెట్ అయ్యింది కానీ ఎక్కడో క్యారెక్టర్‌కు అవసరమైన ఇన్నోసెన్స్ మిస్ అయ్యింది. మోడ్రన్ అమ్మాయిగా ఈజీగా చేసేశారు. సెకండాఫ్‌లో విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా రివేంజ్ తీర్చుకునే సీన్స్ బాగా చేశారు. రాజ్ కుమార్ క్యారెక్టర్ గ్రాఫ్ పడిపోకుండా చూశారు. చైతన్య రావు నటన, డైలాగ్ డెలివరీ బావున్నాయి. ఆయన టైమింగ్ కొన్నిసార్లు నవ్విస్తుంది. ఆయేషా ఖాన్ నటనలో బేసిక్స్ దగ్గర ఆగారు. ఆమె ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి. రవిశంకర్ వాయిస్‌లో బేస్, యాక్టింగ్‌లో ఫైర్ న్యాయవాది పాత్రకు సహాయపడ్డాయి. విశ్వక్ సేన్ తనకు అలవాటైన రీతిలో చేసుకుంటూ వెళ్ళారు. ఆయన నటన, ఆ పాత్ర ఏమంత ప్రభావం చూపించలేదు.
Also Read : 'గుర్తుందా శీతాకాలం' రివ్యూ : గుర్తుంచుకునేలా ఏమైనా ఉందా? సత్యదేవ్, తమన్నా ఎలా చేశారంటే?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'ముఖచిత్రం'లో మంచి సందేశం ఉంది. కొన్ని రొటీన్ సన్నివేశాల మధ్య అది మరుగున పడింది. ఓ సన్నివేశం బావుందని అనుకుంటే... ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. విశ్వక్ సేన్ వచ్చిన తర్వాత గ్రాఫ్ పెరుగుతుందని అనుకుంటే... ఒక్కసారిగా కిందకు పడింది. ప్రియా వడ్లమాని నటన సెకండాఫ్‌లో బావుంటుంది. సినిమాలో హై మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. కానీ, థియేటర్లలో ప్రేక్షకులను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజ్ చేసేలా లేవు. ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు.