Gurthunda Seethakalam - 'గుర్తుందా శీతాకాలం' రివ్యూ : గుర్తుంచుకునేలా ఏమైనా ఉందా? సత్యదేవ్, తమన్నా ఎలా చేశారంటే?
Gurthunda Seethakalam Movie Review : సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం'. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది.
నాగ శేఖర్
సత్యదేవ్, తమన్నా, కావ్యా శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహాసిని మణిరత్నం తదితరులు
సినిమా రివ్యూ : గుర్తుందా శీతాకాలం
రేటింగ్ : 1.5/5
నటీనటులు : సత్యదేవ్, తమన్నా, కావ్యా శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహాసిని మణిరత్నం తదితరులు
కథ : కృష్ణ
మాటలు : లక్ష్మీ భూపాల
ఛాయాగ్రహణం : సత్య హెగ్డే
సంగీతం : కాల భైరవ
సమర్పణ : ఎం.ఎస్. రెడ్డి, చినబాబు
నిర్మాతలు : రామారావు చింతపల్లి, నాగ శేఖర్, భావన రవి
దర్శకత్వం : నాగ శేఖర్
విడుదల తేదీ: డిసెంబర్ 9, 2022
సత్యదేవ్ (Satyadev) కు జంటగా తమన్నా (Tamannaah)... ఈ కాంబినేషన్ సినిమా ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించింది. పైగా, కన్నడ సినిమా 'లవ్ మాక్‌టైల్' రీమేక్ అనడంతో క్యూరియాసిటీ పెరిగింది. ఇందులో మేఘా ఆకాష్ (Megha Akash), కావ్యా శెట్టి (Kavya Shetty) కూడా ఉన్నారు. మరి, ఈ సినిమా ఎలా ఉంది (Gurthunda Seethakalam Review)?
కథ (Gurthunda Seethakalam Movie Story) : దేవ్... సత్యదేవ్ (సత్యదేవ్) మిడిల్ క్లాస్ కుర్రాడు. కాలేజీలో బాగా డబ్బులున్న అమ్మాయి అమ్ము అలియాస్ అమృత (కావ్యా శెట్టి) పరిచయం అవుతుంది. ఇంగ్లీష్ కూడా సరిగా మాట్లాడలేని అతడిని ఆమె ప్రేమిస్తుంది. సత్యదేవ్ ఓ బెంగళూరు కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటాడు. అతడికి వచ్చే శాలరీతో బతకడం కష్టమని తల్లి చెప్పిన తర్వాత నుంచి... అమ్ము ఆలోచనలో పడుతుంది. దేవ్‌ను తక్కువ చేసి మాట్లాడుతుంది, అవమానిస్తుంది. బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత దేవ్ జీవితంలోకి నిధి (తమన్నా) వస్తుంది. అతడి గతం తెలిసి ప్రేమిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ దేవ్‌కు దగ్గర అవ్వాలని అమ్ము ట్రై చేస్తుంది. అప్పుడు దేవ్ ఏం చేశాడు? నిధిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి జీవితంలో ఏం జరిగింది? ప్రయాణంలో పరిచయమైన దివ్య (మేఘా ఆకాష్) కు తమ కథ ఎందుకు చెప్పాడు? దేవ్ జీవితంలో ప్రశాంత్ (ప్రియదర్శి), అతడి ప్రేయసి గీత () పాత్ర ఏమిటి? అనేది సినిమా.
విశ్లేషణ (Gurthunda Seethakalam Movie Telugu Review) : 'గుర్తుందా శీతాకాలం' ప్రచార కార్యక్రమాల్లో 'ఇది మరో గీతాంజలి', 'ఈ సినిమా గీతాంజలి అవుతుంది' వంటి మాటలు హీరో హీరోయిన్లు చెప్పారు. మెయిన్ ట్విస్ట్ అదేననే సంగతి, ఆ మాటల్లో ఉందని 'లవ్ మాక్‌టైల్' చూడని వాళ్ళు గుర్తించాలి. ఆల్రెడీ చూసిన వాళ్ళకు కథ తెలుసు కాబట్టి ఇక్కడ ట్విస్ట్ గురించి చెప్పడం లేదు.
'గుర్తుందా శీతాకాలం' గురించి చెప్పే ముందు... మలయాళ కథలతో రీమేక్ చేసిన 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్', 'ప్రేమమ్' వంటి సినిమాలను గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే... ఆ సినిమాల్లోనూ ఓ వ్యక్తి జీవితంలో వివిధ దశల్లో ప్రేమను తెరపై ఆవిష్కరించారు. ఆ తరహా కథే 'గుర్తుందా శీతాకాలం'. కాకపోతే... దీనికి 'గీతాంజలి' టచ్ ఇచ్చారు. ప్రేమకథలు ఎన్ని వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూస్తారు... లవ్ ఫీల్ వర్కవుట్ అయితే!
'గుర్తుందా శీతాకాలం'లో లవ్, ఫీల్ ఉన్నాయా? అంటే... 'లేవు' అని చెప్పాలి. కథ ముందుకు వెళుతుంది కానీ మనం కనెక్ట్ అప్ అవ్వడం కష్టం. దీనికి మెయిన్ రీజన్... హీరో హీరోయిన్లు! ప్రేమకథలకు ఎప్పుడూ ఫ్రెష్ క్యాస్టింగ్ ఉండాలి. అలా హీరో హీరోయిన్లు కుదిరిన సినిమాల్లో లవ్ వర్కవుట్ అవుతుంది. స్టార్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఇమేజ్ డామినేట్ చేస్తుంది. ఈ సినిమాలో జరిగింది అదే. సన్నివేశాలను, అందులో ఫీల్‌ను సత్యదేవ్, తమన్నా ఇమేజ్ డామినేట్ చేసింది. దాంతో లవ్ ఫీల్ మిస్ అయ్యింది. దర్శకుడు నాగశేఖర్ కూడా సినిమాను మరీ నత్త నడకన సాగదీశారు. ఫస్టాఫ్ కాలేజ్ సీన్స్, కొన్ని డైలాగులు నవ్వించాయి. సెకండాఫ్‌లో ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మరీ సాగదీశారు. ఎప్పుడు సినిమా కంప్లీట్ అవుతుందా? అని ఎదురు చూసేలా చేశారు.
నటీనటులు ఎలా చేశారు? : కాలేజీ ఎపిసోడ్స్‌లో సత్యదేవ్ నటన బావుంది. కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. ప్రియదర్శి, సత్యదేవ్ మధ్య సీన్స్ బావున్నాయి. లవ్ సీన్స్ విషయానికి వస్తే కొత్తదనం లేకపోవడంతో సత్యదేవ్ ఏం చేయలేకపోయారు. తమన్నా స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి మరీ నిధి రోల్ చేశారు. సన్నివేశాలకు ఆమె ఇమేజ్ అడ్డంకిగా మారింది. అసలు, తమన్నా ఎందుకీ సినిమా చేశారు? అనే ప్రశ్నకు పతాక సన్నివేశాల్లో సమాధానం లభిస్తుంది. కథానాయికగా తమన్నా చేసిన ప్రయోగంగా 'గుర్తుందా శీతాకాలం' మిగులుతుంది. కావ్యా శెట్టికి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లభించింది. మేఘా ఆకాష్, సుహాసిని మణిరత్నం అతిథి పాత్రల కంటే కాస్త నిడివి ఎక్కువ ఉన్న రోల్స్ చేశారంతే!
Also Read : 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'గుర్తుందా శీతాకాలం' థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు సినిమాలో గుర్తుంచుకునే కథ, కథనం, సన్నివేశాలు ఏమీ లేవు. సాగదీసి సాగదీసి సాగదీసి... ఇంతకు ముందు సినిమాల్లో చూసిన సన్నివేశాలను, ఆ తరహా కథనాన్ని మళ్ళీ చూపించి విసిగించారు. అవుట్ డేటెడ్ అండ్ బోరింగ్ లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాను ఈజీగా స్కిప్ చేయొచ్చు. కన్నడ ప్రేక్షకులకు ఈ కథ కొత్త కావచ్చు. కానీ, తెలుగు ప్రేక్షకులకు కాదు. కథల ఎంపికలో సత్యదేవ్ జాగ్రత్త వహించకపోతే భవిష్యత్‌లో డేంజర్ బెల్స్ మోగే అవకాశం ఉంది. ఇటువంటి కథలు చేస్తే అతడి ఇమేజ్‌కు డ్యామేజ్ అవ్వడం గ్యారెంటీ.
Also Read : 'బ్లర్' రివ్యూ : తాప్సీ సిస్టర్‌ను ఎవరైనా చంపారా? లేదంటే ఊహ మాత్రమేనా? మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?