(Source: Poll of Polls)
Tiku Weds Sheru Review - 'టీకూ వెడ్స్ షేరు' రివ్యూ : ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా - నిర్మాతగా కంగనా రనౌత్ హిట్టేనా?
OTT Review - Tiku Weds Sheru streaming on Amazon Prime : నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా కంగనా రనౌత్ నిర్మించిన సినిమా 'టీకూ వెడ్స్ షేరు'. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
సాయి కబీర్
నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్, ముఖేష్ ఎస్. భట్, జాకీర్ హుస్సేన్, విపిన్ శర్మ
సినిమా రివ్యూ : టీకూ వెడ్స్ షేరు
రేటింగ్ : 2/5
నటీనటులు : నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్, జాకీర్ హుస్సేన్, విపిన్ శర్మ, ముఖేష్ ఎస్. భట్, సురేష్ విశ్వకర్మ తదితరులతో పాటు అతిథి పాత్రలో కంగనా రనౌత్
రచన : సాయి కబీర్, అమిత్ తివారి
నేపథ్య సంగీతం : అమన్ పంత్
స్వరాలు : సాయి కబీర్, గౌరవ్ ఛటర్జీ
నిర్మాత : కంగనా రనౌత్
దర్శకత్వం : సాయి కబీర్
విడుదల తేదీ: జూన్ 23, 2023
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
'టీకూ వెడ్స్ షేరు' సినిమా (Tiku Weds Sheru Movie)తో కంగనా రనౌత్ (Kangana Ranaut) నిర్మాతగా కొత్త ప్రయాణం ప్రారంభించారు. సినిమా విడుదల ముందు వివాదాలు ప్రచారం తీసుకొచ్చాయి. హీరో నవాజుద్దీన్ సిద్ధిఖీకి 49 ఏళ్ళు. హీరోయిన్ అవనీత్ కౌర్ వయసు 21. ఇద్దరి మధ్య లిప్ లాక్ ఏంటి? అని కొందరు విమర్శించారు. ఓ ప్రచార చిత్రంలో హృతిక్ రోషన్ పేరు ప్రస్తావించడంతో కంగనా రనౌత్ నిర్మాత కనుక కావాలని అతడి మీద డైలాగ్ రాయించారని ట్రోల్ చేశారు. వివాదాలు, విమర్శలు, ట్రోల్స్ వదిలేసి సినిమా ఎలా ఉంది? అని చూస్తే...
కథ (Tiku Weds Sheru Story) : షేరు (నవాజుద్దీన్ సిద్ధిఖీ) జూనియర్ ఆర్టిస్ట్. నటన దర్శకుడిగా అవకాశాలు రాక మనుగడ కోసం నటుడిగా కంటిన్యూ అవుతున్నాడు. స్నేహితుడు ఆనంద్ (ముఖేష్ ఎస్. భట్)తో కలిసి సంపన్నులకు, బడా రాజకీయ నేతలకు అమ్మాయిలను సప్లై చేస్తూ ఉంటాడు. అతనికి ఓ పెళ్లి సంబంధం వస్తుంది. అమ్మాయి టీకూ (అవనీత్ కౌర్)ని ఫొటోలో చూసి ఇష్టపడతాడు. పెళ్లి చేసుకుంటాడు. టీకూకి నటి కావాలని కోరిక. ఆ విషయం పెళ్ళికి ముందు షేరుకు చెప్పలేదు. తానొక ఫైనాన్షియర్ అని, డబ్బులున్న వ్యక్తి అని టీకూకి చెబుతాడు షేరు. వేరొకరి కారణంగా ఆమె గర్భవతి అయ్యిందని తెలిసినా ప్రేమిస్తాడు. దానికి కారణం ఏమిటి? షేరు గురించి టీకూకి ఎప్పుడు నిజం తెలిసింది? మధ్యలో రాజకీయ నాయకులు ఎందుకొచ్చారు? డ్రగ్స్ ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Tiku Weds Sheru Review ) : కథ మొదలైన కాసేపటికి ముగింపు ఎలా ఉంటుందో సులభంగా ఊహించదగ్గ సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ జాబితాలో 'టీకూ వెడ్స్ షేరు' ముందు వరుసలో ఉంటుంది. కథనం, సన్నివేశాలు ఆసక్తిగా సాగితే... ముగింపు ఊహించేలా ఉన్నప్పటికీ, ప్రేక్షకుడు కళ్ళు అప్పగించి చూస్తాడు. 'టీకూ వెడ్స్ షేరు' దర్శకుడు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు.
కథానాయికగా అవకాశాలు ఇప్పిస్తానని అమ్మాయిలను లోబరుచుకునే కేటుగాళ్ల కనికట్టును, కథానాయిక కావాలంటే కాంప్రమైజ్ కాక తప్పదని వ్యభిచార రొంపిలోకి అమ్మాయిలను ఎలా దించుతారనేది చూపించిన సన్నివేశాలు ఫిల్మ్ ఇండస్ట్రీ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో ఉన్నాయి. 'ఖడ్గం'లో రవితేజ, సంగీత ట్రాక్ అందుకు మంచి ఉదాహరణ. దర్శకుడి గదిలో సంగీతను రవితేజ చూసే సన్నివేశం అద్భుతం! అటువంటి సీన్ ఒక్కటి కూడా ఈ సినిమాలో లేదు. డార్క్ సెటైరికల్ సినిమాగా 'టీకూ వెడ్స్ షేరు'ను తీయాలనుకున్నారేమో? అయితే, ఆ సెటైర్స్ కొన్ని చోట్ల మాత్రమే నవ్వించాయి.
ఐడియాగా చూస్తే 'టీకూ వెడ్స్ షేరు' బావుంటుంది. కానీ, చూస్తుంటే అంత ఆసక్తి కలిగించదు. దానికి ముఖ్య కారణం రచన, దర్శకత్వం. దర్శకుడు సాయి కబీర్ ఇండస్ట్రీ గురించి మరింత రీసెర్చ్ చేయాల్సింది. కామెడీ మీద కాన్సంట్రేట్ చేయాల్సింది. కూ క్యారెక్టర్ వరకు కొంత జస్టిఫికేషన్ ఇచ్చారు. లగ్జరీ లైఫ్ గురించి చెప్పే సీన్ బావుంటుంది. లాస్ట్ ఎండింగ్ రొటీన్ కాకుండా రియాలిటీకి దగ్గర తీయడాన్ని అప్రిషియేట్ చేయవచ్చు. అంతకు ముందు ఫైటులో లాజిక్కులు వదిలేశారు.
'టీకూ వెడ్స్ షేరు'లో బలమైన ఎమోషన్ లేదు. తాను మోసపోయానని గ్రహించిన టీకూ ఆత్మహత్య చేసుకోవాలని ట్రై చేస్తుంది. ఆస్పత్రికి వెళ్ళిన షేరుకు నిజం తెలుస్తుంది. సన్నివేశాలు ముందుకు వెళతాయి గానీ చూసే ప్రేక్షకుడి మనసులో బరువైన ఫీలింగ్ కలగదు. ప్రచార చిత్రాల్లో లిప్ లాక్స్ చూసి రొమాన్స్ ఉంటుందని ఊహించకండి. ఆ ముద్దులు తప్ప ఇంకేమీ లేదు. కథలో ప్రతి అంశాన్ని పైపైన టచ్ చేస్తూ వెళుతున్నట్టు ఉంటుంది. 'ఫ్యాషన్' లాంటి హార్డ్ హిట్టింగ్ డిటైల్డ్ సినిమాలో నటించిన కంగనా రనౌత్... 'టీకూ వెడ్స్ షేరు'లో ఎమోషన్స్, కామెడీ ఏ మేరకు ఉందనేది గ్రహించినట్టు లేరు. సాంగ్స్ ఓకే. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్టు ఉన్నాయి. నటీనటుల ప్రతిభ వల్ల కొన్ని సన్నివేశాలు బావున్నాయి. కామెడీ కొంత వర్కవుట్ అయ్యింది.
నటీనటులు ఎలా చేశారు? : నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui)లో నటుడికి సవాల్ విసిరేంత సత్తా షేరు పాత్రలో లేదు. అలవోకగా నటించారు. భార్య ముందు తానొక ఫైనాన్షియర్ అని, డబ్బున్న వ్యక్తి అని గొప్పలు చెప్పుకొనే సన్నివేశాల్లో నవాజుద్దీన్ యాస, ఇంగ్లీష్ డైలాగ్స్ బావున్నాయి. ఆయన ముందు కొన్ని సన్నివేశాల్లో అవనీత్ కౌర్ నటన తేలిపోయింది. అయితే, ఉన్నంతలో పర్వాలేదు.
నవాజుద్దీన్, అవనీత్... సినిమాలో ఇద్దరి క్యారెక్టర్లు హైలైట్ అవుతాయి. అందువల్ల, మిగతా పాత్రల మీద పెద్దగా దృష్టి పడదు. జాకీర్ హుస్సేన్, ముఖేష్ ఎస్. భట్ విపిన్ శర్మ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. కంగనా రనౌత్ అతిథి పాత్రలో ఎందుకు కనిపించారో అర్థం కాదు. తానొక స్టార్ అని, అవుట్ సైడర్ అని, ఎంతో మంది అమ్మాయిలకు తాను ఇన్స్పిరేషన్ అని సినిమాలో కూడా చెప్పడానికి ఆ సీన్ పెట్టినట్లు ఉంది.
Also Read : రామ్ చరణ్ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే
చివరగా చెప్పేది ఏంటంటే? : 'టీకూ వెడ్స్ షేరు' ఐడియా బావుంది. అయితే... ఈ సినిమాలో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే సన్నివేశాలు చాలా తక్కువ. ఒకవేళ నవాజుద్దీన్ కోసం సినిమా ఎలా ఉన్నా చూస్తామని ఫీలయ్యే ఫ్యాన్స్ ఉంటే చూసే ప్రయత్నం చేయండి.
Also Read : పాపం వరుణ్ సందేశ్ - చివరకు డ్యాన్స్ టీమ్‌ను పరిచయం చేసే స్థాయికి...
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial