The Great Pre Wedding Show Review - 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' రివ్యూ: తిరువీర్‌కు హ్యాట్రిక్ దక్కిందా? పల్లెటూరి కామెడీ నవ్విస్తుందా?
The Great Pre Wedding Show Review Telugu: తిరువీర్ హీరోగా నటించిన తాజా సినిమా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. రాహుల్ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా ఎలా ఉందంటే?
రాహుల్ శ్రీనివాస్
తిరువీర్, నరేంద్ర రవి, మాస్టర్ రోహన్, టీనా శ్రావ్య తదితరులు
Thiruveer's The Great Pre Wedding Show Review In Telugu: 'మాసూద'తో హీరోగా తిరువీర్ మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత 'పరేషాన్'తో మరోసారి ఆయన మెప్పించారు. ఇప్పుడు 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'తో వచ్చారు. థియేటర్లలో ఆయనకు హ్యాట్రిక్ దక్కిందా? ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? '90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'లో నటించిన 'మాస్టర్' రోహన్ ఎలా చేశాడు? 'కమిటీ కుర్రోళ్ళు' ఫేమ్ టీనా శ్రావ్య నటన ఎలా ఉంది?
కథ (The Great Pre Wedding Show Story): ఉత్తరాంధ్రలోని ఓ పల్లెటూరిలో రమేష్ (తిరువీర్) ఫోటోగ్రాఫర్. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అతని దగ్గరకు ఆనంద్ (నరేంద్ర రవి) వస్తాడు. భారీగా ఖర్చు చేయడంతో పాటు కాబోయే భార్య సౌందర్య (యామిని)తో విశాఖ వరకు వెళ్లి ఫోటో - వీడియో షూట్ చేస్తాడు రమేష్. అయితే... అతని దగ్గర పని చేసే అసిస్టెంట్ రామ్ (రోహన్ రాయ్) నిక్కరు జేబు చిరిగి ఉండటం వల్ల ఆ మెమరీ కార్డు పడిపోతుంది.
మెమరీ కార్డు పోయిన విషయం ఆనంద్ దగ్గర చెప్పలేక, ఏం చేయాలో తెలియక రమేష్ ఎన్ని తిప్పలు పడ్డాడు? ఫోటో స్టూడియో ఎదురుగా ఉన్న పంచాయతీ ఆఫీసులో పని చేసే హేమ (టీనా శ్రావ్య) అతనికి ఏ విధమైన సాయం చేసింది? సమస్య నుంచి బయట పడటం కోసం రమేష్ చేసిన ప్రయత్నాల వల్ల ఆనంద్ జీవితం ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (The Great Pre Wedding Show Review Telugu): 'ది గ్రేట్ ప్రీ వెడింగ్ షో' కథలో ట్విస్టులు ఏమీ లేవు. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ ఆ కథను ట్రైలర్‌లో చెప్పేశారు. కథ, కథనంపై ఆధారపడి తీసిన సినిమా కాదిది. కామెడీ, ఇంకా చెప్పాలంటే నటీనటుల టైమింగ్ మీద డిపెండ్ అయిన సినిమా. సింపుల్ కథతో సున్నితమైన సందర్భోచిత హాస్యంతో తీసిన సినిమా.
దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ ప్రయోగాలు చేయలేదు. పల్లె మనుషుల స్వభావం ఎలా ఉంటుంది? పంతానికి, పట్టింపులకు పోతే ఎలా ఉంటారు? అనేది చాలా చక్కగా చూపించారు. కథకు ఆయువుపట్టు కామెడీనే. సింపుల్ కథ అయినా సరే అందులోకి వెళ్ళడానికి కాస్త సమయం తీసుకున్నారు. అందువల్ల ఇంటర్వెల్ వరకు నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. అప్పటి వరకు వచ్చే వినోదం సైతం నవ్వించినా ఏదో చిన్న వెలితి ఉంటుంది. సమస్య నుంచి బయట పడటం కోసం హీరో చేసే ప్రయత్నాలు కన్వీన్సింగ్‌గా అనిపించవు. అయితే ఇంటర్వెల్ తర్వాత హీరో పాత్రలో వచ్చే మార్పు, కామెడీ మెప్పిస్తాయి. కథలో వేగం పెరుగుతుంది. పూర్తిగా ఆ పాత్రలతో ట్రావెల్ చేయడం మొదలు పెడతాం.
తెర ముందున్న ప్రేక్షకులను పల్లె వాతావరణంలోకి తీసుకు వెళ్లడంలో సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. ఆయన బాణీలు శ్రావ్యంగా ఉన్నాయి. కథలో వినోదాన్ని, ఆ పల్లె సొగసును నేపథ్య సంగీతంతో ప్రేక్షకులకు చేరువయ్యేలా చేశారు. కథంతా పల్లెటూరిలో జరుగుతుంది. అయితే ఎక్కడా ఆ ఫీలింగ్ కలగకుండా చేశారు సినిమాటోగ్రాఫర్ సోమశేఖర్. కథకు తగ్గట్టు నిర్మాతలు ఖర్చు చేశారు.
Also Read: 'ది గర్ల్ ఫ్రెండ్' రివ్యూ: ఏంటీ కథ... అబ్బాయిలకు వ్యతిరేకమా? రష్మిక సినిమా హిట్టా? ఫట్టా?
తిరువీర్ ఆర్గానిక్ యాక్టర్. ఆయన నటనలో సహజత్వం ఉంటుంది. థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో ప్రతి పాత్రలో లీనమై నటిస్తారు. 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చూస్తే నిజంగా ఉత్తరాంధ్ర పల్లెటూరి కుర్రాడిలా కనిపించారు. ఆ యాసను భలే పట్టుకున్నారు. ముఖ్యంగా మెమరీ కార్డు పోయిందని చెప్పే సన్నివేశంలో తన నిస్సహాయతను వ్యక్తం చేసిన తీరు పాత్రపై జాలి కలిగేలా చేస్తుంది. అలాగే రోహన్ మీద కోపం వ్యక్తం చేసేటప్పుడు, ప్రేమలో అతిశయోక్తి లేకుండా టీనా శ్రావ్యతో మాట్లాడే తీరు బావున్నాయి. తిరువీర్ తర్వాత థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుండే క్యారెక్టర్ నరేంద్ర రవి (Actor Narendra Ravi)ది.
'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' మొదలు నుంచి ముగింపు వరకు కంటిన్యూ అయ్యే ఆనంద్ పాత్రలో నరేంద్ర రవి ఒదిగిపోయారు. ఆయన నటన ఆకట్టుకుంటుంది. కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. ఆయనకు మంచి సన్నివేశాలు పడ్డాయి. 'కమిటీ కుర్రోళ్ళు' ఫేమ్ టీనా శ్రావ్య పక్కింటి అమ్మాయి తరహాలో పాత్రకు తగ్గట్టు సింపుల్‌గా కనిపించారు. డైలాగులతో కంటే నటనతో, చిన్న చిన్న హావభావాలతో 'మాస్టర్' రోహన్ నవ్వించారు. సౌందర్యగా యామినితో పాటు సీనియర్ ఆర్టిస్టులు ప్రభావతి, యామిని తమ నటనతో ఆకట్టుకున్నారు.
సింపుల్ కథ, సున్నితమైన హాస్యంతో తెరకెక్కిన సినిమా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన హాస్యంతో కూడిన చిత్రమిది. రెగ్యులర్ రొటీన్ కథలతో కూడిన కమర్షియల్ సినిమాల మధ్య కొత్తగా ఉంటుంది. మలయాళంలో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు నచ్చే ప్రేక్షకులకు, తెరపై పల్లెటూరి వాతావరణం చూడాలని కోరుకునే ప్రజలకు నచ్చే సినిమా. తిరువీర్ - నరేంద్ర రవి - రోహన్ వినోదం నవ్విస్తుంది. ఆర్గానిక్ కామెడీ సినిమా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. ఫ్యామిలీ అంతా కలిసి చూడవచ్చు.
Also Read: గర్ల్ ఫ్రెండ్ vs జటాధర... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? ఏ మూవీ క్రేజ్ ఎక్కువ??





















