The Girlfriend Movie Review - 'ది గర్ల్ ఫ్రెండ్' రివ్యూ: రాహుల్ రవీంద్రన్ అబ్బాయిలకు వ్యతిరేకంగా తీశారా? రష్మిక సినిమా హిట్టా? ఫట్టా?
Girlfriend Review Telugu: దీక్షిత్ శెట్టి, రష్మిక జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?
రాహుల్ రవీంద్రన్
రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి, అనూ ఇమ్మాన్యుయేల్, రావు రమేష్ తదితరులు
Rashmika Mandanna And Deekshith Shetty's The Girlfriend Review In Telugu: రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మించిన చిత్రమిది. విడుదల ముందు ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. మరి సినిమా ఎలా ఉంది?
కథ (The Girlfriend Movie Story): రామలింగయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో భూమా దేవి (రష్మికా మందన్నా) ఎంఏ లిటరేచర్ జాయిన్ అవుతుంది. అనుకోని పరిస్థితుల్లో పరిచయమైన ఆమెను విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ప్రేమిస్తాడు. భూమా కూడా ప్రేమించాల్సి వస్తుంది. అయితే విక్రమ్ ప్రేమను ఎందుకు భరించలేకపోయింది? అతనికి దూరంగా కొన్నాళ్ళు బ్రేక్ తీసుకోవాలని ఎందుకు అనుకుంది? విక్రమ్ మీద ఫస్ట్ ఇయర్ నుంచి ప్రేమ చూపిస్తున్న దుర్గ (అనూ ఇమ్మాన్యుయేల్) ఏం చేసింది? విక్రమ్ - భూమా ప్రేమ సంగతి తెలిసి ఆమె తండ్రి (రావు రమేష్) ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (The Girlfriend Review Telugu): టైమ్ పాస్ కోసం ప్రేమించే వ్యక్తులు మన సమాజంలో కొందరు కనిపిస్తారు. సిన్సియర్‌గా ప్రేమించినా తప్పనిసరి పరిస్థితుల్లో బ్రేకప్ చేసుకునే వాళ్ళు ఇంకొందరు ఉంటారు. ప్రేమలో భయానికి చోటు లేదని, మనల్ని కంట్రోల్ చేసే పవర్ వేరొకరికి ఇవ్వొద్దని చెప్పే సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. పైకి ఇదొక సింపుల్ కథగా కనిపిస్తుంది. కానీ, దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ చేసిన వర్క్ చాలా ఉంది. విజువల్స్ ద్వారా కథను చెప్పే ప్రయత్నం చేశారు.
హీరో ఇంటికి హీరోయిన్ వెళ్లిన సమయంలో వచ్చే ఒక మిర్రర్ విజువల్ ఈ 'గర్ల్ ఫ్రెండ్'లో దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ బెస్ట్ వర్క్. అలాగే, రష్మిక షవర్ సీన్ కూడా! పలు సన్నివేశాల్లో సింబాలిక్ షాట్స్ ఉన్నాయి. హిడెన్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే కథను రేసీగా చెప్పకుండా భావోద్వేగాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం వల్ల నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. ప్రారంభంలో ర్యాగింగ్ సీన్స్ వంటివి కథకు అవసరం లేదనిపించాయి. అనూ ఇమ్మాన్యుయేల్ పాత్రకు సడన్‌గా కత్తెర వేసి క్లైమాక్స్ ముందు తీసుకొచ్చారు. ఆమె క్యారెక్టర్ ఆర్క్ సరిగా లేదు.
'ది గర్ల్ ఫ్రెండ్' చూశాక... మగాళ్ళు అందరిదీ తప్పు అన్నట్టు చూపించాడని చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మీద విమర్శలు వచ్చే అవకాశం లేకపోలేదు. అలా కాకుండా దీనిని ఓ కథగా చూస్తే ఎటువంటి సమస్య ఉండదు. భూమాను ఇటు బాయ్ ఫ్రెండ్, అటు ఫాదర్... ఇద్దరూ అర్థం చేసుకోరు. ఆమె ఏం కోరుకుంటుంది? అనేది పట్టించుకోరు. అందువల్ల, వాళ్లిద్దరూ విలన్స్ అయ్యారు. దాంతో మగాళ్ళది తప్పు అన్నట్టు చూపించారని కొందరు భావించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత తరుణంలో చెప్పాల్సిన కథ ఇది.
హేషామ్ అబ్దుల్ వాహేబ్ పాటలు వినసొంపుగా ఉన్నాయి. కథతో పాటు పాటలు ముందుకు వెళ్లాయి. రాకేందు మౌళి సాహిత్యం అద్భుతంగా ఉంది. కథలో ఆత్మను ఆవిష్కరించింది. పాటల కంటే నేపథ్య సంగీతం అందించిన ప్రశాంత్ ఆర్ విహారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే... సినిమాలో మాటలు తక్కువ ఉన్నాయి. దర్శకుడిగా భావోద్వేగాలను ఎక్కువ చూపించారు రాహుల్ రవీంద్రన్. మాటలు లేని చోటు ప్రశాంత్ ఆర్ విహారి అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలకు ప్రాణం పోసింది. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ బావుంది. కథకు అవసరమైన మూడ్ లైటింగ్ ద్వారా తీసుకొచ్చారు. ప్రొడక్షన్ డిజైన్ బావుంది. నిర్మాతలు ఖర్చుకు రాజీ పడలేదు.
భూమా పాత్రలో రష్మిక జీవించారు. పైకి నవ్వుతున్నట్టు కనిపించినా... లోపల అంతులేని బాధను అనుభవించే పాత్ర ఆమెది. ఆ వెలితిని కళ్లలో చూపించిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా బ్రేకప్ సీన్‌లోని క్లోజప్ షాట్స్, క్లైమాక్స్‌లో బరస్ట్ అయ్యే సన్నివేశంలో నటనకు క్లాప్స్ పడతాయి. రష్మికకు ధీటుగా దీక్షిత్ శెట్టి నటించారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. బ్రేకప్ సీన్‌లో ఎమోషన్స్ బాగా పలికించారు. పతాక సన్నివేశాలకు వచ్చే కొలదీ విక్రమ్ పాత్రపై ప్రేక్షకులకు కోపం కలుగుతుంది. మీకు ఎంత కోపం వస్తే దీక్షిత్ అంత చక్కటి నటన కనబరిచినట్టు. ఆ పాత్రలో జీవించినట్టు.
Also Read: గర్ల్ ఫ్రెండ్ vs జటాధర... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? ఏ మూవీ క్రేజ్ ఎక్కువ??
రోహిణి గారు కనిపించేది ఒక్కటే సన్నివేశం. అందులో ఆమె తప్ప మరొకరిని ఊహించుకోలేం. అనూ ఇమ్మాన్యుయేల్ పాత్ర నిడివి తక్కువ. తన పరిధి మేరకు చేశారు. రావు రమేష్ అనుభవం తండ్రి పాత్రకు తోడు అయ్యింది. ఆయనకు ఇటువంటి పాత్రలు చేయడం, ఆ భావోద్వేగాలు పలికించడం కొత్త కాదు. ఫ్యాకల్టీగా రాహుల్ రవీంద్రన్ బాగా చేశారు. మిగతా పాత్రల్లో రిజిస్టర్ అయ్యేవి తక్కువ.
'ది గర్ల్ ఫ్రెండ్'కు వెళ్లిన ప్రేక్షకులకు ఈ కథ, అందులో క్యారెక్టర్లతో లవ్ - హేట్ రిలేషన్ తప్పకుండా ఏర్పడుతుంది. రాహుల్ రవీంద్రన్ ఫెమినిస్ట్ అని, హీరోయిన్ కోణంలో సినిమా తీసి హీరోని విలన్ చేశారని ఆయనపై కోపం రావచ్చు. దీక్షిత్ శెట్టి పాత్రపై ప్రేమ కలగవచ్చు. రాహుల్ రవీంద్రన్ కథతో ఏకీభవిస్తే రష్మిక పాత్ర నచ్చుతుంది. ఒక్కటి మాత్రం నిజం... ప్రేమలో స్పష్టత ఉండటం ముఖ్యమని చెబుతుందీ సినిమా. రష్మిక, దీక్షిత్ శెట్టి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. వాళ్ళ కోసం సినిమాకు హ్యాపీగా వెళ్ళవచ్చు. అన్నట్టు... సినిమాపై డిబేట్ తప్పకుండా జరుగుతుంది.
Also Read: బైసన్ రివ్యూ: కబడ్డీ, కుల వివక్ష నేపథ్యంలో విక్రమ్ కుమారుడి సినిమా - హిట్టా? ఫట్టా?





















