Keedaa Cola Review - కీడా కోలా రివ్యూ : తరుణ్ భాస్కర్ క్రైమ్ కామెడీ నవ్వించిందా? లేదా?
Keedaa Cola Movie Review : 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా 'కీడా కోలా'. థియేటర్లలో ఈ రోజు విడుదలైంది.
తరుణ్ భాస్కర్
బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు, రాగ్ మయూర్, 'రోడీస్' రఘురామ్ తదితరులు
సినిమా రివ్యూ : కీడా కోలా
రేటింగ్ : 2.5/5
నటీనటులు : బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు, రాగ్ మయూర్, 'రోడీస్' రఘురామ్, జీవన్ కుమార్, రవీందర్ విజయ్, 'టాక్సీవాలా' విష్ణు తదితరులు
ఛాయాగ్రహణం : ఎజె ఆరోన్
సంగీతం : వివేక్ సాగర్
సమర్పణ : రానా దగ్గుబాటి
నిర్మాతలు : కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ
రచన, దర్శకత్వం : తరుణ్ భాస్కర్ దాస్యం
విడుదల తేదీ: నవంబర్ 3, 2023
Keedaa Cola Review Rating In Telugu : దర్శకుడిగా పరిచయమైన 'పెళ్లి చూపులు', ఆ తర్వాత తీసిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్ భాస్కర్. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'కీడా కోలా'. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తీశారు. ఈ సినిమా ఎలా ఉంది? ఏమిటి?
కథ (Keedaa Cola Story) : వాస్తు (చైతన్య రావు) తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో... చిన్నప్పటి నుంచి తాతయ్య (వరదరాజులు) సంరక్షణలో పెరిగి పెద్దవాడు అవుతాడు. బొమ్మ విషయంలో కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వమని ఉద్యోగం ఇచ్చిన బాస్ కోర్టులో కేసు వేస్తాడు. చేతిలో చిల్లిగవ్వ లేని వాస్తు తరఫున స్నేహితుడు లాంచమ్ (రాగ్ మయూర్) కేసు వాదిస్తూ ఉంటాడు. ఓ రోజు 'కీడా కోలా' కూల్ డ్రింక్ కొంటే... అందులో బొద్దింక (కాక్రోచ్) ఉంటుంది. అప్పుడు లాంచమ్ పెద్ద ప్లాన్ వేస్తాడు.
కీడా కోలా కంపెనీ మీద కేసు వేసి కోటి రూపాయలు రాబట్టాలని లాంచమ్ పథకం రచిస్తాడు. అయితే... అతడిని 20 ఏళ్ళ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన భక్త నాయుడు (తరుణ్ భాస్కర్), కార్పొరేటర్ కావాలని ఆశపడే అతని తమ్ముడు జీవన్ (జీవన్ కుమార్) కిడ్నాప్ చేస్తారు. ఎందుకు? వాళ్ళకు, బొద్దింక పడిన కీడా కోలాకు సంబంధం ఏమిటి? కీడా కోలా కంపెనీ సీఈవో (రవీందర్ విజయ్), అతని దగ్గర పనిచేసే షాట్స్ ('రోడీస్' రఘురామ్) ఏం చేశారు? అసలు, ఆ బొమ్మ కథ ఏంటి? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Keedaa Cola Movie Review) : 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' కథల్లో యువతరం తమను తాము చూసుకుంది. హీరో క్యారెక్టర్లతో కుర్రాళ్ళు కనెక్ట్ అయ్యారు. అందుకని ఆ సినిమాల గురించి ఇప్పటికీ మాట్లాడతారు. కథ, కథనాలు పక్కన పెడితే... రచయితగా తరుణ్ భాస్కర్ ప్రతిభ సన్నివేశాల్లో కనిపిస్తుంది. 'నా సావు నేను సస్తా! నీకెందుకు?', 'నాగుల పంచమికి సెలవు' సన్నివేశాలు అందుకు చిన్న ఉదాహరణ.
సెటిల్డ్ పంచ్, కామెడీ సీన్లు రాయడంలో తరుణ్ భాస్కర్ స్పెషలిస్ట్! ఎట్ ద సేమ్ టైమ్... ఆయన సినిమాల్లో మంచి కథలు కూడా ఉంటాయి. అందుకని, ఐదేళ్ళ విరామం తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన 'కీడా కోలా'పై అంచనాలు ఏర్పడ్డాయి. మరి, ఈ సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే...
'కీడా కోలా' ప్రారంభంలోని ఓ సన్నివేశంలో జీవితంలో ముందుచూపు ఉండాలని కారు డ్రైవింగ్ చేస్తున్న తండ్రి వెనుక సీటులో ఉన్న కుమారుడికి చెబుతూ... రోడ్డుపై ముందు ఏం వస్తుందో చూడటం మానేసి వెనక్కి చూడటంతో యాక్సిడెంట్ అయ్యి పైలోకాలకు వెళతారు. ఆ సన్నివేశాన్ని సొసైటీ మీద తరుణ్ భాస్కర్ మార్క్ & టిపికల్ పంచ్ అనుకోవాలి. పైకి కామెడీ సీన్ అనిపించేలా తీసినప్పటికీ... లోతుగా ఆలోచిస్తే నీతులు చెప్పేవాళ్ళు పాటించరని తరుణ్ భాస్కర్ పరోక్షంగా చెప్పారు. రైటింగ్ పరంగా ఇటువంటి మెరుపులు, నవ్వులు సినిమాలో ఉన్నాయి.
'కీడా కోలా'లోని క్యారెక్టర్లు, క్యారెక్టరైజేషన్స్ విషయంలో తరుణ్ భాస్కర్ తన మార్క్ చూపించారు. బార్బీ (బొమ్మ) కోసం 20 లక్షలు ఇచ్చే సందర్భం గానీ, హీరోతో కూల్ డ్రింక్ యాడ్ షూటింగ్ గానీ... ఇలా చెబుతూ వెళితే కొన్ని సీన్లు నవ్విస్తాయి. కానీ, కథగా చూస్తే వెలితి కనబడుతుంది. తరుణ్ భాస్కర్ ముందు సినిమాల్లో ఉన్నంత బలమైన కథ గానీ, కథనం గానీ 'కీడా కోలా'లో కనిపించలేదు. పార్టులు పార్టులుగా సీన్లు నవ్విస్తాయి. అయితే క్యారెక్టరైజేషన్లను బేస్ చేసుకుని బలమైన, కొత్త కథను రాయడంలో తరుణ్ భాస్కర్ అంచనాలను అందుకోలేదు. ముఖ్యంగా క్యారెక్టర్లతో, సన్నివేశాలతో ప్రేక్షకులు కనెక్ట్ కావడం కష్టం.
తరుణ్ భాస్కర్ సినిమాలు సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉంటాయి. 'కీడా కోలా' సినిమాలోనూ టెక్నికల్ స్టాండర్డ్స్ కనిపించాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ బావున్నాయి. నిర్మాణంలో రాజీ పడలేదు. వివేక్ సాగర్ సంగీతంలో క్వాలిటీ ఉంది. సౌండ్ మిక్సింగ్, డిజైన్ బావున్నాయి. కానీ, కొన్నిసార్లు సన్నివేశాలకు నేపథ్య సంగీతానికి సంబంధం లేదనిపిస్తుంది.
నటీనటులు ఎలా చేశారంటే : దర్శక, రచయితగా కంటే నటుడిగా తరుణ్ భాస్కర్ ఎక్కువ ఎంటర్టైన్ చేశారు. బ్లాక్ అండ్ బ్లాక్ లుంగీ షర్ట్ గెటప్ నుంచి యాక్టింగ్ వరకు... ఆయనకు పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ కుదిరింది. వీల్ ఛైర్‌కు పరిమితం కావడం మినహా బ్రహ్మానందం పాత్రకు ప్రత్యేకమైన పర్పస్ ఏమీ లేదు. వరదరాజులుగా ఆయన డైలాగ్ డెలివరీలో టైమింగ్ మాత్రం మిస్ కాలేదు. వాస్తు పాత్ర కోసం చైతన్య రావు పడిన కష్టం స్క్రీన్ మీద కనిపించింది.
'రోడీస్' షో చూసే ప్రేక్షకులకు తెలుగు సినిమాలో రఘురామ్ కనిపించడం కొంత సంతోషం కలిగించే అంశమే. సన్నివేశాలకు అనుగుణంగా, తమ తమ పాత్రల పరిధి మేరకు జీవన్, రవీందర్ విజయ్, రాగ్ మయూర్ నటించారు. స్టార్ హీరోగా ఆ పాత్రకు కావాల్సిన యాటిట్యూడ్ చూపించారు 'గెటప్' శీను.
Also Read : లింగోచ్చా రివ్యూ : హైదరాబాద్ నేపథ్యంలో హిందూ ముస్లిం ప్రేమకథ - కార్తీక్ రత్నం సినిమా ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే : 'కీడా కోలా'ను తరుణ్ భాస్కర్ ఇంతకు ముందు తీసిన 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది'తో కంపేర్ చేయలేం. ఆ సినిమాల జానర్స్ వేరు, ఈ సినిమా జానర్ వేరు. అయితే... ఆ సినిమాల స్థాయిలో తరుణ్ భాస్కర్ నుంచి ఆశించే ఫుల్ ఫన్, ఎంటర్టైన్మెంట్ 'కీడా కోలా' ఇవ్వలేదు. అలాగని, పూర్తిగా డిజప్పాయింట్ చేయదు. 'కీడా కోలా'లో నవ్వులు కొన్ని... మెరుపులన్నీ నటుడిగా తరుణ్ భాస్కర్ (Tharun Bhascker)వే అని చెప్పాలి. ఆ మాస్ కామెడీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కు బాగా నచ్చుతుంది.
Also Read : టైగర్ నాగేశ్వరరావు రివ్యూ : రవితేజ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా? లేదా?