F3 Movie Review - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?
F3 Telugu Movie Review: వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా 'ఎఫ్ 3'. ఇది 'ఎఫ్ 2' తరహాలో నవ్వించిందా? లేదా?
అనిల్ రావిపూడి
వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, అలీ తదితరులు
సినిమా రివ్యూ: ఎఫ్ 3
రేటింగ్: 2.5/5
నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, అలీ, 'వెన్నెల' కిశోర్, రఘుబాబు తదితరులతో పాటు ప్రత్యేక గీతంలో పూజా హెగ్డే
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సమర్పణ: 'దిల్' రాజు
నిర్మాత: శిరీష్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి
విడుదల తేదీ: మే 27, 2022
వసూళ్ళ పరంగా 'ఎఫ్ 2' భారీ విజయం సాధించింది. ప్రేక్షకులకు వినోదం కూడా అందించింది. అయితే, ఆ సినిమా కొందర్ని ఆకట్టుకోలేదు. అది వేరే విషయం! ఆ సంగతి పక్కన పెడితే... ఇప్పుడు 'ఎఫ్ 3'తో హీరోలు, దర్శక - నిర్మాతలు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలా ఉంది? (F3 Review) ఇందులో వినోదం ఎంత ఉంది? ప్రేక్షకుల్ని నవ్విస్తుందా? లేదా?
కథ: వెంకీ (వెంకటేష్)కు బోలెడు డబ్బులు కష్టాలు. దీనికి కారణం మంగ ఫ్యామిలీ (తమన్నా, మెహరీన్, ప్రగతి, అన్నపూర్ణమ్మ, వై విజయ అండ్ కో). వెంకీ ఫ్రెండ్ వరుణ్ (వరుణ్ తేజ్), మరొక వ్యక్తి (రఘుబాబు) కూడా ఆ ఫ్యామిలీ బాధితులే. ఈ డబ్బు కష్టాల నుంచి గట్టెక్కడానికి సీఐ నాగరాజు (రాజేంద్ర ప్రసాద్)తో కలిసి పోలీస్ కమిషనర్ (సంపత్ రాజ్) అక్రమంగా సంపాదించిన డబ్బు, వజ్రాలను కొట్టేస్తారు. బ్యాడ్ లక్ ఏంటంటే... ఆ విషయం కమీషనర్‌కు తెలుస్తుంది. తన ఇంట్లో నుంచి కొట్టేసినవి తిరిగి ఇవ్వకపోతే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. నిజం ఏంటంటే... డబ్బులు, వజ్రాలు వెంకీ, వరుణ్ అండ్ కో దగ్గర లేవు. వాళ్ళ దగ్గర నుంచి అవి ఎలా మాయం అయ్యాయి? డబ్బు కోసం విజయనగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ ప్రసాద్ (మురళీ శర్మ) ఇంటికి వెళ్ళిన వెంకీ, వరుణ్, నాగరాజు, మంగ ఫ్యామిలీ ఏం చేశారు? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: 'నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగం' - ఇప్పుడీ మాట గురించి ప్రస్తావన ఎందుకంటే... ప్రేక్షకులను నవ్వించే యోగం దర్శకుడు అనిల్ రావిపూడి దగ్గర ఉంది. దర్శకుడిగా ప్రేక్షకులను నవ్వించే సినిమాలు తీశారు. కథ కంటే కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే దర్శకుడు ఆయన. అయితే, ఆ కామెడీ వేటలో పడి కథను పూర్తిగా పక్కన పెట్టేస్తే కష్టమే సుమీ! దర్శకుడిగా ఆయన, థియేటర్లలో ప్రేక్షకులు కష్టపడాలి. 'ఎఫ్ 3' థియేటర్లలో ప్రేక్షకులకు కొన్ని కష్టాలు తప్పవు.
'ఎఫ్ 2'లో ప్రధాన తారాగణం, వాళ్ళ క్యారెక్టరైజేషన్లు తీసుకుని అనిల్ రావిపూడి కొత్త కథ రాశారు. పెళ్లి తర్వాత వచ్చే ఫ్రస్ట్రేషన్ 'ఎఫ్ 2' కథాంశం అయితే... డబ్బు లేకపోవడం వల్ల వచ్చే ఫ్రస్ట్రేషన్ 'ఎఫ్ 3' కథకు మూలం!
'ఎఫ్ 3' ఎలా ఉంది? కామెడీ... కామెడీ... కామెడీ... ప్రేక్షకులకు కామెడీతో కితకితలు పెట్టాలనే అనిల్ రావిపూడి తాపత్రయం ప్రతి సన్నివేశంలో కనిపించింది. అయితే, కితకితలు పెట్టడం అన్నిసార్లూ కుదరలేదు. కొన్ని సన్నివేశాల్లో ఎంత ప్రయత్నించినా థియేటర్లలో నవ్వులు రాలేదు. అలాగని, సినిమాలో కామెడీ లేదని కాదు. 'ఎఫ్ 3' నవ్విస్తుంది. అయితే, అందరినీ కాదు. కొంత మందిని మాత్రమే.
కథ, క్యారెక్టర్లను మర్చిపోయి తెరపై సన్నివేశాన్ని ఎంజాయ్ చేసేలా తీయగల నేర్పు దర్శకుడు అనిల్ రావిపూడి సొంతం. 'ఎఫ్ 3'లోనూ నటీనటులకు ఫిట్స్ వచ్చే సన్నివేశాలను బాగా తీశారు. కొన్ని సీన్లు ఓవర్ ది బోర్డ్ వెళ్లారు. డబ్బు, డబ్బు లేకపోవడం వల్ల వచ్చే ఫ్రస్ట్రేషన్ కారణంగా హీరోలు పడే ఇబ్బందులు కామన్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా లేవు. అందువల్ల, సన్నివేశాలు అన్నిటికీ కనెక్ట్ కావడం కష్టం. ఎఫ్ 2'లో సన్నివేశాలకు రిలేట్ అయినట్టు... 'ఎఫ్ 3'లో సన్నివేశాలకు కావడం కష్టం. అనిల్ రావిపూడి సినిమాల్లో కథ పరంగా వీక్ స్క్రిప్ట్ 'ఎఫ్ 3'. ఇంతకు ముందు సినిమాల్లో ఒరిజినల్ కామెడీ ట్రాక్స్ రాసిన అనిల్ రావిపూడి... టీవీల్లో వచ్చే కామెడీ రియాలిటీ షోస్ తరహాలో 'ఎఫ్ 3' కామెడీ ట్రాక్స్ రాయడం, పాత సినిమాలను ఫాలో అవ్వడం పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. 'ఎఫ్ 3' చూస్తే... ఓల్డ్ కామెడీ హిట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కొన్ని ఎపిసోడ్స్ ఈవీవీ సినిమాలను గుర్తు చేస్తాయి. అవి చూసిన ప్రేక్షకులకు 'ఎఫ్ 3' కొత్తగా అనిపించదు. ముఖ్యంగా వరుణ్ తేజ్, మెహరీన్ ట్రాక్.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సోసోగా, కథకు తగ్గట్టు ఉంది. సాంగ్స్ సూపర్ అనేలా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. టెక్నికల్ టీమ్ అంతా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ఏం కావాలో, అది చేశారు.
నటీనటులు ఎలా చేశారు? వెంకటేష్ కామెడీ టైమింగ్, మేనరిజమ్స్‌తో మరోసారి అదరగొట్టారు. తన ఇమేజ్, స్టార్‌డమ్ వంటివి పట్టించుకోకుండా క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయి చేశారు. రేచీకటి ఎపిసోడ్స్‌లో వెంకీ నటించడం, ఆ డైలాగ్ చెప్పడం గొప్ప విషయం. నత్తి వల్ల మనసులో అనుకున్న మాటను బయటకు చెప్పలేక ఇబ్బంది పడే సన్నివేశాల్లో వరుణ్ తేజ్ బాగా చేశారు. పాత్ర పరిధి మేరకు ఆయన నటించారు. సెకండాఫ్‌లో గ్లామరస్‌గా కాకుండా డిఫరెంట్‌గా కనిపించే అవకాశం తమన్నాకు లభించింది. పాటలో గ్లామర్‌గా కనిపించారు. సెకండాఫ్‌లో మెహరీన్‌కు ఇంపార్టెన్స్ లేదు. కానీ, ఫస్టాఫ్‌లో మోడ్రన్‌గా, ఫ్యామిలీకి చెందిన టిఫిన్ సెంటర్‌లో చట్నీలు కట్టే అమ్మాయిగా కనిపించారు. నటిగా ఆకట్టుకునే అవకాశం లభించలేదు. సునీల్, ఆలీ, రాజేంద్ర ప్రసాద్, అన్నపూర్ణమ్మ, వై. విజయ, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, రఘుబాబు... తెరపై భారీ తారాగణం ఉంది. వాళ్ళందరూ చాలా అనుభవం ఉన్నవాళ్ళు. అందువల్ల, చాలా సులభంగా నటించారు. అందరి మధ్యలో ప్రగతి కాస్త తన ఉనికి చాటుకున్నారు. సునీల్ మళ్ళీ లైనులోకి వచ్చినట్టే.
ఫైనల్ పంచ్: 'ఎఫ్ 2' ఎంజాయ్ చేసిన ప్రేక్షకులకు 'ఎఫ్ 3' నచ్చుతుంది. కథ, లాజిక్స్ ఆలోచించే జనాలకు అసలు ఏమాత్రం నచ్చదు. మిగతావాళ్ళకూ మధ్య మధ్యలో కొన్ని బోరింగ్ మూమెంట్స్ తప్పవు. లాజిక్స్ పక్కన పెట్టి కాసేపు ప్రశాంతంగా నవ్వుకోవాలని, ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే... జస్ట్ టైమ్‌పాస్ చేయవచ్చు. ఇందులో ఫన్ తక్కువ, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ. పాత సినిమాల్లో సీన్లను రిక్రియేషన్ చేయడం కూడా!
Also Read: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!