Beauty Movie Review - బ్యూటీ రివ్యూ: ప్రేమికుడితో అమ్మాయి... వెతుకుతూ తండ్రి - ఎమోషనల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?
Beauty Review In Telugu: దర్శకుడు మారుతి సమర్పణలో అంకిత్ కొయ్య, నీలాఖి పాత్రో జంటగా నటించిన సినిమా 'బ్యూటీ'. సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?
జెఎస్ఎస్ వర్దన్
అంకిత్ కొయ్య, నీలాఖి పాత్ర, నరేష్ విజయకృష్ణ, వాసుకి ఆనంద్ తదితరులు
Ankith Koyya's Beauty Movie Review: మారుతి సమర్పణలో వచ్చిన కొత్త సినిమా 'బ్యూటీ'. ఇందులో అంకిత్ కొయ్య, కొత్త అమ్మాయి నీలాఖి పాత్ర జంటగా నటించారు. 'గీతా సుబ్రహ్మణ్యం' సిరీస్ ఫేమ్, రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే' దర్శకుడు జెఎస్ఎస్ వర్దన్ తెరకెక్కించారు. హీరోయిన్ తల్లిదండ్రులుగా వాసుకి ఆనంద్, సీనియర్ నరేష్ నటించిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకోండి.
కథ (Beauty Movie Story): విశాఖలో నారాయణ (సీనియర్ నరేష్) క్యాబ్ డ్రైవర్. అమ్మాయి అలేఖ్య (నీలాఖి పాత్ర) అంటే అతనికి పంచప్రాణాలు. తల్లి (వాసుకి ఆనంద్) క్రమశిక్షణలో ఉంచాలని ఎంత ప్రయత్నించినా... తండ్రి మాత్రం అలేఖ్యను గారాబం చేస్తాడు. అమ్మాయి అడిగిందని బండి కొనిస్తాడు.
డ్రైవింగ్ నేర్చుకునే క్రమంలో అర్జున్ (అంకిత్ కొయ్య)తో ప్రేమలో పడుతుంది అలేఖ్య. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రేమికుడిని పిలుస్తుంది. పక్కింటి అంకుల్ వాళ్ళిద్దరినీ చూస్తాడు. మరోసారి తల్లికి వీడియో చాట్ చేస్తూ దొరికేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అమ్మాయిని వెతుకుతూ నారాయణ హైదరాబాద్ ఎందుకు వచ్చాడు? విశాఖలో అమ్మాయిలను ట్రాప్ చేసి వేధిస్తున్న మరో యువకుడు హైదరాబాద్ ఎందుకు వచ్చాడు? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Beauty Review Telugu): కాలంతో పాటు ప్రేమించే తీరు మారుతోంది. అదే విధంగా మోసం చేసే తీరు కూడా! టెక్నాలజీ, మరీ ముఖ్యంగా సీక్రెట్ కెమెరా కల్చర్ వచ్చాక అమ్మాయిలను ప్రేమ పేరుతో లొంగదీసుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం పనిగా పెట్టుకున్న యువకులు గురించి వార్తల్లో వింటున్నాం. జర్నలిస్టు నుంచి రచయితగా మారిన సుబ్బు అటువంటి కథను 'బ్యూటీ'లో చెప్పారు. సమాజానికి అవసరమైన సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇటువంటి కథతో మలయాళంలో 'కప్పేలా' వచ్చింది. తెలుగులో ఆ సినిమాను 'బుట్ట బొమ్మ'గా రీమేక్ చేశారు.
క్లైమాక్స్ వచ్చేవరకు ఇతర కథలతో పోలికలు లేకుండా కొత్త సినిమా అందించే ప్రయత్నం చేసింది 'బ్యూటీ' టీమ్. కథకు, సినిమాకు మెయిన్ హైలైట్ అలేఖ్య పాత్ర! అందులో హీరోయిన్ నీలాఖి నటన! ఒకానొక సందర్భంలో ఆమెను 'నిబ్బి' అంటాడు హీరో. స్నేహితుడి దగ్గర ఆమెపై అసహనం, కోపం వ్యక్తం చేస్తాడు. తెర ముందున్న ప్రేక్షకులకు సైతం అలేఖ్య చేసే పనులు చూస్తే కోపం వస్తుంది. 'లైఫ్‌లో నిన్ను ఇంకేం అడగను' అని అంటుంటే... 'ఈ డైలాగ్ ఎన్నిసార్లు చెబుతుంది' అనుకోవడం ఆడియన్స్ వంతు అవుతుంది. చుట్టుపక్కల ఇళ్లల్లో నుంచి సోషల్ మీడియాలోనూ, వార్తల్లోనూ మనం చూస్తున్న కథలకు రూపం తెరపై కనబడుతుంది. అయితే ఆడపిల్లలకు, ముఖ్యంగా అమ్మాయిల తండ్రులకు అవసరమైన జాగ్రత్తలు చెబుతుందీ సినిమా.
'బ్యూటీ' ఫస్టాఫ్ బావుంది. సెకండాఫ్‌లో కాస్త హడావిడి ఎక్కువైంది. ఒక దశకు వచ్చాక రొటీన్‌గా మారింది. కానీ క్లైమాక్స్ కాస్త సంతృప్తి ఇస్తుంది. ఇంటర్వెల్ ముందు పదిహేను నిమిషాలు సినిమాకు 'పీక్' మూమెంట్ అని చెప్పాలి. మనం తెరపై చూస్తున్నది ప్రేమ కథ కాదు, థ్రిల్లర్ అనేంత రీతిలో దర్శకుడు వర్ధన్, రచయితలు సుబ్బు - దేవ్ చక్కటి సన్నివేశాలు రాశారు. ఆ తర్వాత ఎమోషనల్ థ్రిల్లర్ రూట్ తీసుకుంది. కొందరి ప్రేక్షకుల ఊహకు అందేలా ఉంటుంది ఎండింగ్ ట్విస్ట్. అయితే విజయ్ బుల్గానిన్ పాటలు - నేపథ్య సంగీతంతో పాటు నటీనటుల ప్రతిభ సినిమాను నిలబెట్టింది. కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్ బావుంది.
'బ్యూటీ' ఆర్టిస్టుల్లో అసలైన బ్యూటిఫుల్ యాక్టింగ్ అంటే సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ విజయకృష్ణ (Naresh Vijaya Krishna)ది అని చెప్పాలి. మిడిల్ క్లాస్ తండ్రిగా ఆయన నటించలేదు, జీవించారు. ఆయన కన్నీరు పెడుతుంటే ప్రేక్షకుల కళ్ళలో నీళ్లు తిరుగుతాయని చెప్పవచ్చు. తండ్రి ప్రేమ విజయం సాధించాలని మనం కోరుకుంటాం. అంత చక్కగా చేశారు. నరేష్ భార్య పాత్రలో వాసుకి ఆనంద్ సహజంగా నటించారు. అలేఖ్యగా నీలాఖి బబ్లీ నటనతో ఆకట్టుకున్నారు. తింగరిగా చేయడం వల్ల కొన్ని సన్నివేశాలు బాగా వచ్చాయి. హీరో అంకిత్ కొయ్యకు డిఫరెంట్ రోల్ ఇది. సైలెంట్‌గా కనిపిస్తూ చక్కటి యాక్టింగ్ చేశారు. మిగతా ఆర్టిస్టులు కూడా బాగా చేశారు.
సమాజానికి, ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకు చక్కటి సందేశం ఇచ్చే సినిమా 'బ్యూటీ'. కొన్ని సినిమాలను వినోదం కోసం చూస్తాం. కానీ, వినోదం వెనుక ఉన్న చక్కటి సందేశం కోసం చూడాల్సిన చిత్రమిది. సమాజంలో జరిగేవి స్పష్టంగా తెరపై చెప్పిన చిత్రమిది. అయితే అన్ని వర్గాలను మెప్పించే సినిమా కాదు. ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్ళడం మంచిది.
Also Read: భద్రకాళి రివ్యూ: పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్... విజయ్ ఆంటోనీ సినిమా హిట్టా? ఫట్టా!?





















