Bhadrakaali Review - భద్రకాళి రివ్యూ: పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్... విజయ్ ఆంటోనీ సినిమా హిట్టా? ఫట్టా!?
Bhadrakaali Review Telugu: పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'భద్రకాళి'తో విజయ్ ఆంటోనీ థియేటర్లలోకి వచ్చారు. హీరోగా ఆయన 25వ చిత్రమిది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
అరుణ్ ప్రభు
విజయ్ ఆంటోని, తృప్తి రవీంద్ర, రియా జిత్తు, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్ తదితరులు
Vijay Antony's Shakthi Thirumagan Telugu Dubbed Version Bhadrakaali Review: కథానాయకుడిగా విజయ్ ఆంటోనీ 25వ సినిమా 'శక్తి తిరుమగన్'. 'భద్రకాళి'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. తృప్తి రవీంద్ర, రియా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకుడు. తమిళంలో 'అరువి' వంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న హిట్ సినిమా తీసింది ఆయనే. ఆ తర్వాత 'వాళి' తీశారు. 'భద్రకాళి' మూడో సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజు (సెప్టెంబర్ 19న) విడుదలైంది. సినిమా ఎలా ఉందంటే?
కథ (Shakthi Thirumagan / Bhadrakaali Story): సెక్రటేరియట్‌లో కిట్టు (విజయ్ ఆంటోనీ) లాబీయిస్టు. కొందరు అతడిని బ్రోకర్ అంటుంటారు. ఐజీ ట్రాన్స్‌ఫర్ నుంచి ఎమ్మెల్యే మర్డర్ వరకు ఏమైనా చేయించగలడు, చేస్తాడు కూడా! అవి మాత్రమే కాకుండా కొన్ని మంచి పనులు కూడా చేస్తాడు.
ఢిల్లీలో పెద్ద పదవిలో ఉన్న మేడమ్ వ్యవహారంలో కిట్టు వేలు పెట్టడంతో అతని మీద నిఘా పెడతాడు. పన్నెండేళ్లుగా వివిధ పనులు చేయడం ద్వారా ఆరు వేల కోట్లు సంపాదించాడని బయట పడుతుంది. ఆ స్కామ్ కేసులో అతడిని అరెస్ట్ చేస్తారు. కిట్టు అరెస్ట్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అభ్యంకర్ (సునీల్ కిర్పాలాని) అని తెలుస్తుంది. అతను రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉన్న వ్యక్తి.
అభ్యంకర్, కిట్టు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? దేశంలో రాజకీయ నేతలు అందరినీ తన చెప్పు చేతల్లో పెట్టుకున్న వ్యక్తిని రాష్ట్రపతి కాకుండా తలకు మించిన కేసుల్లో చిక్కుకున్న కిట్టు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఏమైంది? కిట్టు నేపథ్యం ఏమిటి? చివరకు అతను విజయం సాధించాడా? లేదా? అనేది సినిమా.
విశ్లేషణ (Shakthi Thirumagan / Bhadrakaali Review): సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదని, సమాజానికి మంచి సందేశం అందించాలని తపించే దర్శకులు కొందరు ఉంటారు. వారిలో అరుణ్ ప్రభు ఒకరు. సమాజ హితం కోసం ఆయన తీసిన సినిమా 'భద్రకాళి'. రాజకీయాలు, అవినీతిపై సినిమాల ద్వారా కొన్నేళ్ల క్రితం ప్రశ్నలు సంధించారు శంకర్. 'భారతీయుడు', 'అపరిచితుడు', 'శివాజీ' తరహా చిత్రమే 'భద్రకాళి'. శంకర్ ప్రశ్నలు సంధించడం మాత్రమే కాదు... పరిష్కారాలు సైతం చూపించారు. 'భద్రకాళి'లో ప్రశ్నలు సంధించడం వరకు అరుణ్ ప్రభు సక్సెస్ అయ్యారు. కానీ పరిష్కారం మాత్రం చూపించలేదు.
రోజులు మారే కొలదీ అవినీతి జరిగే తీరు మారుతుంటుంది. 'భద్రకాళి' ప్రారంభంలో లాబీయిస్టుగా విజయ్ ఆంటోనీ చేసే ప్రతి పని ఆసక్తిగా ముందుకు సాగుతుంది. ఏం జరుగుతుంది? కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది? అనేది ప్రేక్షకుడి ఊహకు అతీతంగా ముందుకు సాగుతుంది. కిట్టు అరెస్ట్ వరకు జెట్ స్పీడులో 'భద్రకాళి' ముందుకు వెళ్ళింది. కమర్షియల్ పంథాలో వెళ్లినప్పటికీ ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు. ఇంటర్వెల్ వరకు కిట్టు టార్గెట్ ఎవరు? అనేది ప్రోపర్‌గా రివీల్ కాలేదు. దాంతో క్యూరియాసిటీ మైంటైన్ అయ్యింది.
ఇంటర్వెల్ తర్వాత కిట్టు వర్సెస్ అభ్యంకర్ గేమ్ మొదలు అయ్యాక రెగ్యులర్ రొటీన్ పంథాలోకి సినిమా వెళ్ళింది. ఆ గేమ్‌లో చూపించిన ఇంటిలిజెన్స్ సరిపోలేదు. ఆట ఇంకా ఆసక్తిగా ఉండాలి. వాట్ నెక్స్ట్? అనేది ఆడియన్ గెస్ చేయడం అంత కష్టం ఏమీ కాదు. శంకర్ సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. అది చాలదన్నట్టు 'శివాజీ'లో సీన్ చూపించారు. దాంతో అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుందనేది మరింత క్లారిటీ వస్తుంది. హీరో ఆశయం గొప్పది. కాదని అనలేం. ఆశయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పే బలమైన సన్నివేశాలు పడలేదు. రాబిన్ హుడ్ కాన్సెప్ట్ దగ్గర కథ ఆగింది.
Also Read: విజయ్ ఆంటోని 'భద్రకాళి' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
దర్శకుడు అరుణ్ ప్రభు మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. కథను ఎస్టాబ్లిష్ చేసిన తీరు బావుంది. కానీ ముగింపు మెప్పించేలా లేదు. పాలిటికల్ సిస్టమ్ మీద వేసిన కొన్ని డైలాగ్స్ పేలాయి. రోడ్స్ & ఫెసిలిటీస్ మీద వేసిన డైలాగ్స్ కేంద్ర ప్రభుత్వం మీద పరోక్షంగా విమర్శలు గుప్పించినట్టు ఉన్నాయి. కథను అవసరమైన పాటలు, నేపథ్య సంగీతం అందించారు విజయ్ ఆంటోనీ. మ్యూజిక్‌తో డామినేట్ చేసే ప్రయత్నం చేయలేదు. నిర్మాతగానూ బెస్ట్ ఇచ్చారు. రాజీ పడకుండా ప్రొడ్యూస్ చేశారు. టెక్నికల్ పరంగా ఓకే.
నటుడిగా విజయ్ ఆంటోనీ కథల ఎంపిక బావుంటుంది. లార్జర్ దేన్ లైఫ్ అన్నట్టు కాకుండా మ్యాన్ నెక్స్ట్ డోర్ అన్నట్టుగా... కామన్ పీపుల్ కనెక్ట్ అయ్యేలా క్యారెక్టర్లు ఎంపిక చేసుకుంటారు. కిట్టు కూడా అటువంటి క్యారెక్టరే. ఆ పాత్ర పరిధి మేరకు విజయ్ ఆంటోనీ చక్కటి నటన కనబరిచారు. హీరోయిన్ తృప్తి రవీంద్ర పాత్ర పరిధి పరిమితమే. ఉన్నంతలో చక్కగా నటించారు. రాజకీయ నేతల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ పాత్రలో సునీల్ కిర్పాలనీ కనిపించారు. స్పెషల్ ఆఫీసర్ రామ్ పాండేగా కిరణ్ నటన బావుంది. ఆయన వల్ల ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొంత బావున్నాయి. రియా జిత్తు సైతం స్పెషల్ అఫీసర్‌గా కనిపించారు. హీరో వెన్నంటే ఉండే మారుతిగా సెల్ మురుగన్ నటించారు.
మాంచి పొలిటికల్ థ్రిల్లర్ మూవీకి అవసరమైన పాయింట్ 'భద్రకాళి'లో ఉంది. కానీ అది పాయింట్ దగ్గర మాత్రమే ఆగింది. స్టార్టింగ్ బావుంది. కానీ, స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంగేజ్ చేసే స్క్రిప్ట్‌గా, సినిమాగా తెరపైకి రాలేదు. ఎండింగ్ చాలా రొటీన్‌గా ఉంది. సినిమాలో 'హై' ఇచ్చే మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. అయితే చివరకు మంచిగా తీసి ఉండొచ్చనే వెలితితో బయటకు వస్తాం. పొలిటికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే మోస్తరుగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. లేదంటే కష్టం.
Also Read: 'మిరాయ్' రివ్యూ: క్లైమాక్స్‌లో శ్రీరాముడు వచ్చాడు... తేజా సజ్జా - మంచు మనోజ్ మూవీ హిట్టేనా?





















