Two Souls Movie Review - 'టు సోల్స్' సినిమా రివ్యూ : రెండు ఆత్మల ప్రేమకథ ఎలా ఉందంటే?
Two Souls Movie Review In Telugu : త్రినాథ్ వర్మ కలిదిండి, భావన సాగి, మోనికా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'టు సోల్స్'. థియేటర్లలో విడుదలైన ఈ చిన్న సినిమా ఎలా ఉందంటే?
శ్రవణ్ కుమార్
త్రినాథ్ వర్మ, భావన సాగి, మోనికా రెడ్డి, రవితేజ మహాదాస్యం
సినిమా రివ్యూ : టు సోల్స్
రేటింగ్ : 2/5
నటీనటులు : త్రినాథ్ వర్మ కలిదిండి, భావన సాగి, ప్రవీణ్, మోనికా రెడ్డి, రవితేజ మహాదాస్యం తదితరులు
ఛాయాగ్రహణం : శశాంక్ శ్రీరామ్
స్వరాలు : ప్రతీక్ అభయంకర్
నేపథ్య సంగీతం : ఆనంద్ నంబియార్
నిర్మాత : విజయ్ లక్ష్మీ వేలూరి
రచన, దర్శకత్వం : శ్రవణ్ కుమార్
విడుదల తేదీ: ఏప్రిల్ 21, 2022
ప్రేమ కథలకు పేరున్న తారలు అవసరం లేదు. కొత్త, ఔత్సాహిక హీరో హీరోయిన్లతో తీసినా ప్రేక్షకులు చూస్తారు. అందుకే, దర్శకులు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. 'టు సోల్స్' అంటూ కొత్త దర్శకుడు శ్రవణ్ కుమార్ (Shravan Kumar) ఓ ప్రేమకథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పరిమిత నిర్మాణ వ్యయంతో తీసిన ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Two Souls Movie Story) : అఖిల్ (త్రినాథ్ వర్మ) తండ్రికి పెద్ద కంపెనీ ఉంది. అయితే, ఆ కంపెనీని టేకోవర్ చేయకుండా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒంటరిగా ఉంటూ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటాడు. అతడికి గాళ్ ఫ్రెండ్ ఉంది. ఆమె పేరు ప్రియా (మౌనికా రెడ్డి). ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని, రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనులు చూడమని స్నేహితుడితో చెబుతాడు. ప్రియాను పిక్ చేసుకోవడానికి వెళ్లిన అఖిల్, మరొక అబ్బాయితో ఆమె సన్నిహితంగా ఉండటం చూసి షాక్ తింటాడు. ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. బాడీ హాస్పిటల్ బెడ్ మీద ఉంటుంది. సోల్ బయటకు వచ్చేస్తుంది. హాస్పిటల్ బయట ప్రియా (భావన సాగి) అని మరో అమ్మాయి సోల్, అఖిల్ సోల్ ఒకరికి ఒకరు పరిచయం అవుతారు. ఆ ప్రియా ఎవరు? ఆమెకు ఏమైంది? అఖిల్ ఆత్మకు ఎందుకు కనిపించింది? వాళ్ళ మధ్య అంతకు ముందు ఏమైనా సంబంధం ఉందా? చివరకు, ఆ రెండు ఆత్మలు నిజ జీవితంలో కలిశాయా? లేదా? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Two Souls Review Telugu) : మనిషి ప్రాణం ఉండగా శరీరం నుంచి ఆత్మ బయటకు వస్తుందా? వేరు పడుతుందా? అనే సందేహాలు రావచ్చు. ఓసారి వెనక్కి వెళితే... 'ఎందుకంటే ప్రేమంట' సినిమాలో తమన్నా క్యారెక్టర్ గుర్తు చేసుకోండి! ఈ తరహా సినిమాలకు లాజిక్స్‌తో పని లేదు. సిల్వర్ స్క్రీన్ మీద మేజిక్ వర్కవుట్ అయితే చాలు! అటువంటి మేజిక్ 'టు సోల్స్'లో ఉందా? లేదా? అనేది చూస్తే...
దర్శకుడు శ్రవణ్ కుమార్ రాసుకున్న కథలో మంచి కాన్సెప్ట్ ఉంది. అయితే, అది స్క్రీన్ మీదకు వచ్చిందా? అంటే... పూర్తి స్థాయిలో రాలేదు. కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్టు... స్టార్టింగ్ టు ఎండింగ్ 'టు సోల్స్' అట్ట్రాక్ట్ చేయలేక పోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయ్! అందులో ముఖ్యమైనవి డైలాగ్స్!
ప్రేమ కథలో ఫీల్ ప్రేక్షకుడికి చేరాలంటే... ప్రతి మాటలో డెప్త్ ఉండాలి. అది మిస్ అయ్యింది. ఆత్మల మధ్య పరిచయం, ఆ తర్వాత సన్నివేశాలు బోరింగ్! స్క్రీన్ మీద ఎక్కువ సేపు హీరో హీరోయిన్స్ ఉండటంతో మొనాటనీ వచ్చింది. కొన్ని సీన్స్ రిపీట్ చేసినట్టు ఉన్నాయి. అక్కడ ఎడిటింగ్ ఇంకా క్రిస్పీగా ఉంటే లెంగ్త్ తగ్గేది. ఇక, ఇంటర్వెల్ కూడా ఎందుకు ఇచ్చారో అర్థం కాదు. అప్పటి వరకు సరైన సీన్ పడలేదు. ఏదో సోల్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఆత్మల ప్రేమకథ కాస్త ఆత్మఘోషగా మారింది. కొన్ని సన్నివేశాల్లో 'ఎందుకంటే ప్రేమంట', 'ప్రేమ కథా చిత్రం' సినిమాలు గుర్తుకు వస్తాయి.
'టు సోల్స్'లో అసలు కథ అంతా సెకండాఫ్, మరీ ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఉంది. క్లైమాక్స్ ముందు హీరో హీరోయిన్స్ మధ్య సన్నివేశాలు, ఆ ట్విస్ట్ మంచిగా అనిపిస్తాయి. మెలోడీ సాంగ్స్, వాటిని పిక్చరైజ్ చేసిన తీరు సూపర్బ్. కథకుడిగా కంటే దర్శకుడిగా శ్రవణ్ కుమార్ ఎక్కువ మెప్పించారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ విభాగాల నుంచి కథకు కావల్సినది తీసుకున్నారు. సిక్కిం అందాలను స్క్రీన్ మీద చక్కగా చూపించారు. క్లైమాక్స్ హ్యాండిల్ చేసిన తీరు బావుంది. నటీనటులతో బాగా చేయించారు.
నటీనటులు ఎలా చేశారు? : త్రినాథ్ వర్మ, భావన... తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ ఓకే. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. షార్ట్ ఫిలిమ్స్, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్లు చేసిన చేసిన మౌనికా రెడ్డి, రవితేజ స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో బాగా చేశారు.
Also Read : 'హలో మీరా' రివ్యూ : స్క్రీన్ మీద కనిపించేది సింగిల్ క్యారెక్టరే - సినిమా ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే? : దర్శకుసు శ్రవణ్ కుమార్ సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్ట్ బావుంది. కానీ, స్క్రీన్ మీదకు తీసుకు రావడంలో ఫెయిల్ అయ్యారు. ఫస్టాఫ్ చాలా బోర్ కొట్టించారు. క్లైమాక్స్ మంచి ఫీల్ ఇస్తుందంతే! థియేటర్లలో చూడటం కష్టమే... ఓటీటీలో అయితే ఓకే!
Also Read : ఈవిల్ డెడ్ రైజ్ రివ్యూ: ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజీలో కొత్త సినిమా ఎలా ఉంది? ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిందా?