Gaalodu Review: గాలోడు రివ్యూ: సుడిగాలి సుధీర్ పెద్ద స్క్రీన్‌పై కూడా హిట్ కొట్టాడా?
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన గాలోడు సినిమా ఎలా ఉందంటే?
రాజశేఖర్ రెడ్డి పులిచర్ల
సుడిగాలి సుధీర్, గెహనా సిప్పీ తదితరులు
సినిమా రివ్యూ : గాలోడు
రేటింగ్ : 2.25/5
నటీనటులు : సుడిగాలి సుధీర్, గెహనా సిప్పీ తదితరులు
ఛాయాగ్రహణం : సి.రామ్ ప్రసాద్
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
నిర్మాణ సంస్థ : సంస్కృతి ఫిల్మ్స్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల
విడుదల తేదీ: నవంబర్ 18, 2022
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సుడిగాలి సుధీర్. స్మాల్ స్క్రీన్ మీద ఓ రేంజ్ క్రేజ్ ఉన్న అతి కొద్దిమందిలో సుధీర్ ఒకడు. సుధీర్ హీరోగా నటించిన ‘గాలోడు’ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. పెద్ద తెరపై ప్రేక్షకులను పలకరించడం సుధీర్‌కు కొత్తేమీ కాదు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’, ‘3 మంకీస్’ సినిమాలతో గతంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చినా, తను నటించిన పూర్తిస్థాయి మాస్ ఎంటర్‌టైనర్ మాత్రం ఇదే. పెద్ద హీరోల సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఫైట్లు, డ్యాన్స్‌లు కూడా ఇందులో ఉన్నట్లు టీజర్, ట్రైలర్లు చూస్తే చెప్పవచ్చు. ఇవి సినిమాపై ఆసక్తిని కూడా పెంచాయి. మరి సినిమా సుధీర్ కోరుకున్న హిట్‌ను అందించిందా?
కథ: రజనీకాంత్ (సుడిగాలి సుధీర్) ఊర్లో పనీ పాటా లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. దీంతో అందరూ సుధీర్‌ని గాలోడు అంటూ ఉంటారు. ఒక గొడవలో అనుకోకుండా సర్పంచ్ కొడుకు చనిపోతాడు. ఆ కేసు రజనీకాంత్‌పై పడుతుంది. దీంతో ఊరి నుంచి పారిపోయి హైదరాబాద్ వస్తాడు. సిటీలో బిచ్చగాళ్ల దగ్గర డబ్బులు దొంగిలిస్తూ, గుడిలో ప్రసాదం తింటూ బతుకుతుంటాడు. ఆ సమయంలోనే శుక్ల (గెహనా సిప్పీ) పరిచయం అవుతుంది. వీరిద్దరూ ప్రేమలో పడతారు. శుక్ల తన ఇంట్లోనే రజనీకాంత్‌కు పని ఇప్పిస్తుంది. ఇంతలో ఒకరోజు పోలీసులు వచ్చి రజనీకాంత్‌ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? రజనీకాంత్, శుక్ల ఒక్కటయ్యారా? అనేది మిగతా కథ.
విశ్లేషణ: సుధీర్ డ్యాన్స్‌లు, ఫైట్లు బాగా చేయగలడు. తన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. కానీ చిన్నతెరకు, సిల్వర్ స్క్రీన్‌కు చాలా తేడా ఉంటుంది. ఒక 10 నిమిషాలు డ్యాన్స్ చేసి, స్కిట్ చేసి మెప్పించడం వేరు. రెండు గంటల సినిమా తీసి ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించడం వేరు. ఇప్పటికే రెండు సినిమాలు చేసి ఎదురు దెబ్బలు తిన్నా సుధీర్‌కి ఆ తత్వం ఇంకా బోధపడలేదు.
దర్శకుడు రాజశేఖర్ రెడ్డి సినిమాను కాస్త ఆసక్తికరంగానే ప్రారంభిస్తాడు. జైల్లో సుడిగాలి సుధీర్ ఇంట్రడక్షన్, తన పాత్రకు ఇచ్చే బిల్డప్ ఆసక్తిని కలిగిస్తుంది. ఎప్పుడైతే సినిమా ఫ్లాష్ బ్యాక్ దారి పట్టిందో అప్పుడే దారి తప్పింది. ఏ లక్ష్యం లేకుండా గాలికి తిరిగే హీరోకి, కోటీశ్వరుల ఇంటికి ఏకైక వారసురాలు అయిన హీరోయిన్ అట్రాక్ట్ అవ్వడం, వీరి మధ్య వచ్చే సన్నివేశాలు నీరసంగా సాగుతాయి. హీరోయిన్ ఎందుకు హీరోని ప్రేమించిందో తెలిపే ఒక్క సన్నివేశం కూడా సినిమాలో లేదు. సప్తగిరి, షకలక శంకర్‌ల కామెడీ నవ్వించకపోగా విసిగిస్తుంది. పాటలు, యాక్షన్ సన్నివేశాలు ఉన్నంతలో పర్వాలేదనిపిస్తాయి.
‘నువ్వు శనివారం పుట్టావా? నీకెలా తెలుసు... శనిలా తగులుకుంటేనూ...’ ఇది సినిమాలో ఒక డైలాగ్. రచయతల సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఇలాంటి పంచ్‌ల దగ్గరే ఆగిపోయింది. ఇక ఆఖరిలో వచ్చే కోర్టు సీన్ అయితే ‘నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’ అనుకోవచ్చు. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని కోర్టులో హీరో, హీరోయిన్లు చెప్పాక మీ ప్రేమలో నిజాయితీని నిరూపించుకోమని జడ్జి అడగడం, వారి మాటలు ప్రభుత్వ ఖర్చులతో హీరో, హీరోయిన్ల పెళ్లి ఘనంగా చేయమని జడ్జి తీర్పు ఇవ్వడం, తామిక్కడే పెళ్లి చేసుకుంటామని కోర్టులోనే పెళ్లి చేసుకోవడం లాంటి సీన్లు నభూతో నభవిష్యత్ అని చెప్పాలి.
ఇక నటీనటుల విషయానికి వస్తే... సుడిగాలి సుధీర్ దగ్గర మంచి టాలెంట్ ఉంది. తను డ్యాన్సులు, ఫైట్లు బాగా చేస్తాడు. కానీ మొదటి అడుగులోనే మాస్ హీరో అయిపోవాలనుకుంటే దానికి సరైన కథ ఎంచుకోవాలి. ఇలాంటి కథ తీసుకుంటే మాత్రం ఆడియన్స్ దగ్గర నుంచి మొట్టికాయలు తప్పవు. ప్రేక్షకులు సినిమాను చూసే విధానం చాలా మారిపోయింది. అవుట్‌డేటెడ్ కథలతో వస్తే స్టార్లకు కూడా కనీస ఓపెనింగ్స్ రావడం లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పాటు తన టాలెంట్ ప్రదర్శించే స్కోప్ ఉన్న కథలను ఎంచుకుంటే సుధీర్ కచ్చితంగా సక్సెస్ అవుతాడు. గెహనా సిప్పీ తెరపై అందంగా కనిపించింది. షకలక శంకర్, సప్తగిరిల కామెడీకి నవ్వడం కష్టమే.
ఓవరాల్‌గా చెప్పాలంటే... సుడిగాలి సుధీర్ వీరాభిమానులకు సినిమా నచ్చుతుంది. కథ అవసరం లేకపోయినా సాంగ్స్, మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను ఆదరించే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లవచ్చు. మిగతావాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించాల్సిందే.