Gandeevadhari Arjuna Review - 'గాండీవధారి అర్జున' రివ్యూ : వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు సినిమా ఎలా ఉందంటే?
Gandeevadhari Arjuna Review in Telugu : వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన సినిమా 'గాండీవధారి అర్జున'. ఈ సినిమా ఎలా ఉందంటే?
ప్రవీణ్ సత్తారు
వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, వినయ్ రాయ్ తదితరులు
సినిమా రివ్యూ : గాండీవధారి అర్జున
రేటింగ్ : 2.25/5
నటీనటులు : వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, వినయ్ రాయ్, విమలా రామన్, అభినవ్ గోమఠం, నరేన్, రోషిణి ప్రకాష్ తదితరులు
ఛాయాగ్రహణం : ముఖేష్ జి
సంగీతం : మిక్కీ జే మేయర్
నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్
రచన, దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
విడుదల తేదీ: ఆగస్టు 25, 2023
వరుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన సినిమా 'గాండీవధారి అర్జున' (Gandeevadhari Arjuna). ఇందులో సాక్షి వైద్య కథానాయిక. వాతావరణంలో మార్పులు, మనవాళిపై ప్రభావం వంటి అంశాలను స్పృశిస్తూ యాక్షన్ నేపథ్యంలో సాగిన చిత్రమిది. ఎలా ఉంది?
కథ (Gandeevadhari Arjuna Movie Story) : లండన్‌లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావడానికి భారత కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్ బహాదుర్ (నాజర్) వెళతారు. ఆయనను కలవాలని, ఓ పెన్ డ్రైవ్ (ఫైల్ 13 - వీడియోస్) ఇవ్వాలని శృతి (రోషిణి ప్రకాష్) ప్రయత్నిస్తుంది. ఆమెను కలిసినప్పుడు ఆదిత్య రాజ్ బహదూర్ మీద ఎటాక్ జరుగుతుంది. అప్పుడు ఆయనకు సెక్యూరిటీగా అర్జున్ వర్మ (వరుణ్ తేజ్)ను నియమిస్తారు. ఆదిత్య రాజ్ పర్సనల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి ఐరా (సాక్షి వైద్య), అర్జున్ వర్మ ఒకప్పటి ప్రేమికులు. ఐరా, అర్జున్ మధ్య దూరం పెరగడానికి కారణం ఏమిటి? అసలు... ఆదిత్య రాజ్ బహదూర్ మీద ఎటాక్ చేసింది ఎవరు? ఆ దాడికి, విదేశాల నుంచి ఇండియాకు వస్తున్న మెడికల్ వేస్టేజీకి సంబంధం ఏమిటి? ఆదిత్య రాజ్ బహదూర్, ఆయన ఫ్యామిలీని అర్జున్ వర్మ ఎలా కాపాడాడు? రణ్‌వీర్ (వినయ్ రాయ్) ఎవరు? అసలు,ఫైల్ 13లో ఏముంది? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Gandeevadhari Arjuna Movie Review) : 'గాండీవధారి అర్జున' పేరులో తెలుగుదనం ఉంది. కథ జరిగే ప్రాంతాల్లో తెలుగుదనం లేదు. ఎక్కువ శాతం కథ లండన్, డెహ్రాడూన్, ఢిల్లీ ప్రాంతాల్లో జరుగుతుంది. కొంత లంబసింగిలో జరిగినట్టు చూపించారు. అయితే, కథలో తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన భావోద్వేగాలు ఉన్నాయి.
'గాండీవధారి అర్జున' కోసం ప్రవీణ్ సత్తారు రాసిన కథలో, సినిమా నేపథ్యంలో పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు కావలసిన హంగులు అన్నీ ఉన్నాయి. ఓ గ్రాండియర్ కనబడుతుంది. అయితే... కథలో ప్రేక్షకుడు లీనమయ్యేలా, కథతో పాటు ప్రయాణించేలా సినిమా లేదు. కథలో కీలకమైన మెడికల్ వేస్టేజి పాయింట్ కూడా ఇంతకు ముందు సూర్య 'సింగం 3'లో టచ్ చేసినట్లు ఉంటుంది.
యాక్షన్ సినిమాలకు నేపథ్య సంగీతం చాలా అంటే చాలా కీలకం. కేవలం నేపథ్య సంగీతంతో హీరోయిజాన్ని ఎలివేట్ చేయవచ్చు. భావోద్వేగాలను ప్రేక్షకులకు చేరువ చేయవచ్చు. అటువంటి నేపథ్య సంగీతం మిక్కీ జే మేయర్ నుంచి రాలేదు. అసలు, నేపథ్య సంగీతం గమనించేలా లేదు. సినిమాటోగ్రఫీ బావుంది. స్క్రీన్ మీద విజువల్స్ బావున్నాయి. ఫారిన్ లొకేషన్స్‌ను బాగా చూపించారు.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న కథను ప్రవీణ్ సత్తారు రాశారు. నిజానికి కార్బన్ ఫుట్ ప్రింట్ సమాజానికి పట్టిన క్యాన్సర్ లాంటిది. డిస్కస్ చేయాల్సిన పాయింట్! అయితే, యాక్షన్ & ఎమోషన్స్ మధ్య బ్యాలన్స్ చేయడంలో సక్సెస్ కాలేదు. అందువల్ల, సినిమాకు కనెక్ట్ కావడం కష్టమే.
నటీనటులు ఎలా చేశారంటే... : యాక్షన్ హీరోకు అవసరమైన ఫిజిక్ వరుణ్ తేజ్ సొంతం. మాజీ 'రా' / సెక్యూరిటీ అధికారి అని ఆయన కటౌట్ చూస్తే ప్రేక్షకులు ఈజీగా నమ్మేసేలా ఆయనను దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్రజెంట్ చేశారు. నటన పరంగానూ బెస్ట్ అవుట్ పుట్ రాబట్టుకున్నారు.
సాక్షి వైద్యకు కథలో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ లభించింది. కథతో పాటు ఆమె పాత్ర ప్రయాణించింది. ఐరాగా ఆమె చక్కగా నటించారు. కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్ బహదూర్ పాత్రకు నాజర్ నటన హుందాతనం తీసుకు వచ్చింది. విమలా రామన్, అభినవ్ గోమఠం, నరేన్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు. ఇక, వినయ్ రాయ్ విలనిజం గురించి సినిమా ప్రారంభంలో చూపించినంత చివరకు వచ్చేసరికి లేదు.
Also Read : 'బెదరులంక 2012' రివ్యూ : కార్తికేయ & టీమ్ నవ్వించారా? సందేశం ఇచ్చారా?
చివరగా చెప్పేది ఏంటంటే... : హాలీవుడ్ సినిమాల స్థాయిలో మనమూ సినిమా చేయాలని వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు చేసిన ప్రయత్నం 'గాండీవధారి అర్జున'. యాక్షన్ బ్లాక్స్ కొన్ని బావున్నాయి. ఎమోషన్స్ కనెక్ట్ కాలేదు. పార్టులు పార్టీలుగా చూస్తే ఓకే.
Also Read : 'ఆఖరి సచ్' వెబ్ సిరీస్ రివ్యూ : పోలీస్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా హిట్టా? ఫట్టా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial