Baak Movie Review - 'బాక్' మూవీ రివ్యూ: ఆత్మగా మారిన తమన్నా - తమిళ హారర్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Aranmanai 4 Movie Review in Telugu: 'అరణ్మణై' ఫ్రాంచైజీలో సుందర్ సి మూడు సినిమాలు తీసి విజయాలు అందుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి హారర్ కామెడీతో వచ్చారు. తమిళంలో 'అరణ్మణై 4', తెలుగులో 'బాక్' ఎలా ఉందంటే?
సుందర్ సి
సుందర్ సి, తమన్నా, రాశీ ఖన్నా, రామచంద్ర రాజు, 'వెన్నెల' కిశోర్, కోవై సరళ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్ తదితరులు
Tamannaah, Raashii Khanna and Sundar C starrer Baak Movie Review: హారర్ కామెడీ సినిమాలకు సౌత్ ఇండియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో 'ప్రేమ కథా చిత్రం'తో పాటు పలు సినిమాలు హిట్టయినా... 'కాంచన' సిరీస్‌తో రాఘవా లారెన్స్ బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించినా... రీజన్ ఆ ఫ్యాన్ బేస్. హారర్ కామెడీ ఫార్ములాతో తమిళంలో కోట్లు వసూళ్లు సాధించిన మరో దర్శకుడు, హీరో సుందర్ సి. ఆయన తీసిన 'అరణ్మణై'కు ఫ్రాంచైజీకి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు 'అరణ్మణై 4' తీశారు. తెలుగులో 'బాక్'గా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Baak - Aranmanai 4 Movie Story): శివశంకర్ (సుందర్ సి) లాయర్. అతడికి చెల్లెలు శ్రీనిధి (తమన్నా) అంటే ప్రాణం. అయితే... ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా ఆమెను కుటుంబం దూరం పెడుతుంది. కొన్నాళ్లకు చెల్లెలితో పాటు బావ ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి అత్తయ్య (కోవై సరళ)తో కలిసి వెళతాడు శివ శంకర్. ఆ ఊరిలో పదేళ్లకు ఒకసారి జరిగే తిరునాళ్ల సమయంలో (జూన్ 15న) జన్మించిన వ్యక్తులను 'బాక్' అనే క్షుద్ర శక్తి చంపడానికి ప్రయత్నిస్తుందని అతడు తెలుసుకుంటాడు. తన మేనకోడలు పుట్టిన తేదీ సైతం అదేనని తెలుస్తుంది.
ఉత్తరాదిలో క్షుద్ర శక్తి దక్షిణాదిలో గ్రామానికి ఎందుకు వచ్చింది? 'బాక్' నుంచి ప్రజలను కాపాడాలని వచ్చిన స్వామి జీ (కెజియఫ్ రామచంద్ర రాజు) ఏం చేశారు? ఆత్మగా మారిన శ్రీనిధి తన కూతురు, కొడుకును కాపాడుకోవడం కోసం ఏం చేసింది? మేనకోడల్ని కాపాడుకోవడానికి శివ శంకర్ ఏం చేశాడు? చివరకు ఆ 'బాక్' ఏమైంది? ఊరిలో అమ్మవారు ఏం చేసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Baak, Aranmanai 4 Review Telugu): హారర్ కామెడీ సినిమాల్లో ఫార్ములా ఒక్కటే ఉంటుంది. అనగనగా ఓ దెయ్యం, దాన్నుంచి ప్రాణాలు కాపాడుకోవడం, ఆ ఆత్మల చేతిలో కమెడియన్లు దెబ్బలు తింటుంటే నవ్వుకోవడం, క్షుద్ర శక్తి వర్సెస్ దైవ శక్తి... ఈ ఫార్ములా కథతో కమర్షియల్ ప్యాకేజీ సినిమా తీయడం అంత సులువు కాదు. 'అరణ్మణై' అంటూ మూడుసార్లు వసూళ్లు కొల్లగొట్టిన సుందర్ సి, మరోసారి ఆ ఫార్ములాతో హిట్ అందుకుంటారా? లేదా? అనేది చూస్తే...
హారర్ కామెడీ సినిమాల్లో లాజిక్స్ కంటే మేజిక్ వర్కవుట్ కావడం ముఖ్యం. సుందర్ సి కొన్ని సన్నివేశాల్లో ఆ మేజిక్ వర్కవుట్ చేశారు. హారర్ సీన్లు, క్షుద్ర శక్తి / ఆత్మ వచ్చే సన్నివేశాలను ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగించేలా తీశారు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో! తిరునాళ్ల నేపథ్యంలో వచ్చే పాట గానీ, ఆ తర్వాత క్షుద్ర శక్తిని దైవ శక్తి అంతం చేసే సన్నివేశం గానీ మాస్ జనాల్ని మెప్పిస్తాయి.
క్షుద్ర శక్తి / ఆత్మ సన్నివేశాల్లో థ్రిల్స్ ఇవ్వడంలో వర్కవుట్ అయిన సుందర్ సి కమర్షియల్ టేకింగ్ / ఆ మేజిక్... కామెడీ, ఎమోషనల్ సీన్లలో వర్కవుట్ కాలేదు. తెలుగు ప్రేక్షకుల కోసం 'వెన్నెల' కిశోర్ / శ్రీనివాస రెడ్డితో సపరేట్ సీన్లు తీశారు. తమిళంలో యోగిబాబు, వీటీవీ గణేష్ చేసిన ట్రాక్ ఇక్కడ రీషూట్ చేశారు. దాంతో పాటు కోవై సరళ తనకు లైన్ వేస్తుందని ఓ సీనియర్ నటుడు చేసే కామెడీలో అరవ అతి ఎక్కువైంది. ఆ తమిళ మాస్ కామెడీని అందరూ ఎంజాయ్ చేయలేరు.
కమర్షియల్ ప్యాకేజీతో కూడిన కథతో 'బాక్' తీశారు సుందర్ సి. సిస్టర్ సెంటిమెంట్ కొత్త కాదు. వందల సినిమాల్లో ప్రేక్షకులు చూసిందే. అయితే కథతో పాటు ఫ్లోలో ఆ సీన్లు తీసుకు వెళ్లారు. కామెడీ విషయంలో తెలుగు కోసం స్పెషల్ కేర్ తీసుకుని ఉంటే బావుండేది. టెక్నికల్ పరంగా సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. కెమెరా వర్క్, రీ రికార్డింగ్, ప్రొడక్షన్ వేల్యూస్... బావున్నాయి.
Also Read: 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ రివ్యూ: అల్లరోడి పెళ్లి కష్టాలు - మ్యాట్రిమోనీ మోసాలు... సినిమా ఎలా ఉందంటే?
తమన్నాను ఎక్కువ శాతం గ్లామరస్ క్యారెక్టర్లలో చూసిన ప్రేక్షకులకు... 'బాక్' కొత్త మిల్కీ బ్యూటీని చూపిస్తుంది. తన పిల్లలను కాపాడుకోవడానికి ప్రయత్నించే తల్లి / ఆత్మగా ఆ పాత్రకు న్యాయం చేశారు. సుందర్ సి ఎప్పటిలా నటించారు. డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కథతో పాటు రాశీ ఖన్నా పాత్ర ప్రయాణిస్తుంది. నటిగా ఆమెకు సవాల్ విసిరే సీన్లు లేవు. ఆ పాత్రకు తగ్గట్టు హుందాగా నటించారు. కొంత విరామం తర్వాత కోవై సరళను చూపించిన చిత్రమిది. జయప్రకాశ్ సహా తెలుగు ప్రేక్షకులు తెలిసిన కొందరు తమిళ నటులు ఉన్నారు. 'కెజియఫ్' తర్వాత రామచంద్ర రాజు కథలో అంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ చేసింది ఈ సినిమాలోనే. పతాక సన్నివేశంలో వచ్చే పాటలో సీనియర్ హీరోయిన్లు సిమ్రాన్, ఖుష్బూ కనిపించారు. ఎండ్ టైటిల్స్ వచ్చే పాటలో తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ ట్రీట్ ఇచ్చారు.
బాక్... కమర్షియల్ ఫార్ములా కథతో రూపొందిన రొటీన్ హారర్ కామెడీ. ఆ కామెడీలో తమిళ అతిని తెలుగు ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేయలేరు. సినిమాలో కొన్ని థ్రిల్స్ ఉన్నాయి. రూరల్ మాస్ ఆడియన్స్ మెచ్చే క్లైమాక్స్ ఉందంతే! 'అరణ్మణై' ఫ్రాంచైజీ అభిమానుల కోసమే ఈ 'బాక్'.
Also Read: హీరామండీ రివ్యూ: స్వాతంత్ర్య సమరంలో వేశ్యల కథ - Netflix OTTలో భన్సాలీ తీసిన సిరీస్, ఎలా ఉందంటే?