Snake Robotic Legs: పాము కాళ్లతో నడవడం చూశారా? లేదంటే ఇప్పుడు చూడండి!
పాములు పాక్కుంటూ వెళ్తాయనే సంగతి మనకు తెలిసిందే. కానీ, ఈ పాము మాత్రం బల్లిలా నడుస్తోంది. ఇందుకు కారణం.. దానికి అమర్చిన రోబోటిక్ లెగ్స్.
పాములు ఎలా నడుస్తాయి? అని చిన్న పిల్లాడిని అడిగినా.. ‘‘పాక్కుంటూ’’ అంటూ ఠక్కున సమాధానం చెప్తాడు. కానీ.. పాములు కాళ్లతో నడిస్తే? వినడానికే ఆశ్చర్యంగా ఉందా? టెక్నాలజీ తలచుకుంటే ఏదైనా సాధ్యమే. కాళ్లు లేని జంతువులకు రోబోటిక్ లెగ్స్ తయారు చేసే ఓ యూట్యూబర్ చేసిన ఈ ప్రయత్నం.. ఇప్పుడు వైరల్‌గా మారింది. అతను ఏం చేశాడో చూడండి.
పాముకు రోబోటిక్ కాళ్లు
అలెన్ పాన్.. ప్రముఖ యూట్యూబర్. వింత వింత ఆవిష్కరణలు చేస్తూ… అందరి చేతి ప్రశంసలు పొందుతున్నాడు. తాజాగా ఈయన రూపొందించిన రోబోటిక్ కాళ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వాస్తవానికి అతడు పలు పక్షులు, జంతువులకు ఇప్పటికే కృత్రిమ కాళ్లను రూపొందించాడు. కోళ్లతో పాటు పెంపుడు జంతువులు కాళ్లు కోల్పోతే.. వాటి స్థానంలో ఆర్టిఫీషియల్ కాళ్లు అమర్చి నడిపించాడు. తాజాగా పామును కాళ్లతో నడిపించాలనే వింత కోరిక పుట్టింది ఈ కుర్రాడికి. ఇలాంటి ప్రయత్నం తాను తప్ప మరెవరూ చేయరంటూ అనుకున్నది సాధించాడు. అనుకున్నట్లుగానే ఎంతో శ్రమపడి రోబోటిక్ కాళ్లను రూపొందించాడు. పాము నడిచేందుకు అనుకూలంగా ఉండే నాలుగు కృత్రిమ కాళ్లను తయారు చేశాడు.
రిమోట్ తో నియంత్రణ
వాస్తవానికి పాములకు పిండం దశలో కాళ్లు ఉంటాయని పాన్ గుర్తించాడు. ఆ తర్వాత అభివృద్ధి దశలో వాటిని కోల్పోతున్నట్లు తెలుసుకున్నాడు. పాము తను అనుకున్నట్లుగా ముందుకు వెళ్లేలా ఓ పరికరాన్ని రూపొందించాడు. ఇందులోకి పాము ప్రవేశించగానే.. ల్యాప్ టాప్ నుంచి నియంత్రించే సర్వర్ పని చేయడం మొదలు పెడుతుంది. అప్పుడే పాము కదలికలకు అనుకూలంగా రోబోటిక్ కాళ్లతో కూడిన ట్యూబ్ ముందుకు కదులుతుంది.
అలెన్ ప్రయత్నం విఫలం
ముందు ఇంటి దగ్గరే కొండ చిలువ బొమ్మతో ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. బొమ్మ పామును రిమోట్ సాయంతో నడిపించగలను అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత.. రోబోటిక్ కాళ్లను కలిగిన ట్యూబ్ ను రూపొందించాడు. దాన్ని తీసుకుని కొండ చిలువలు ఉండే దుకాణానికి వెళ్లాడు. అక్కడ ఓ కొండ చిలువతో ప్రయోగం చేశాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత కొండ చిలువ ఆ ట్యూబ్ లోకి వెళ్లింది. ఆ ట్యూబ్‌ను పాన్ నియంత్రిస్తూ పామును నడిపించేలా చేశాడు. అయితే పాముకి ఆ రొబోటిక్ కాళ్ల మీద నియంత్రణ ఉండదు. దీంతో ఆ లెగ్స్ కేవలం పాములను వాకింగ్ తీసుకెళ్లడానికే తప్పా.. వాటంతట అవి నడించేందుకు ఉపయోగపడవు. అందుకే, తన ప్రయోగం సక్సెస్ అవ్వినట్లు తాను భావించడం లేదని పాన్ వెల్లడించాడు.
నెటిజన్ల ప్రశంసలు
ఆయన రూపొందించిన రోబోటిక్ పాము కాళ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే రెండున్నర మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు. ఆయన ప్రయత్నానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భారీ సంఖ్యలో కామెంట్లు పెడుతున్నారు. ఇందులో కొందరు ఆయన ప్రయత్నాన్ని మెచ్చుకుంటుంటే.. మరికొంత మంది విమర్శిస్తున్నారు. పాము నిజంగా నడవగలిగేలా చేస్తే బాగుంటుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘‘అలెన్ దేవుడిని ధిక్కరిస్తున్నాడు, అతడు చాలా శక్తివంతుడు’’ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. మున్ముందు కొమోడో డ్రాగన్‌లకు వింగ్స్ ఇవ్వడం చేస్తాడేమో అని ఇంకో నెటిజన్ వెల్లడించాడు. మొత్తంగా అలెన్ ప్రయత్నం పలువురిని అబ్బుర పరుస్తోంది.
Also read: చిన్నికృష్ణయ్యకు తియ్యటి నైవేద్యాలు, వీటిని పావుగంటలో చేసేయచ్చు
Also read: సహోద్యోగులు తన పెళ్లికి పిలిస్తే రాలేదని ఆ పెళ్లి కూతురు ఏం చేసిందంటే