Tongue: మీ నాలుక రంగుని బట్టి మీ ఆరోగ్యం అంచనా వేయచ్చు
నాలుక రంగు చాలా ముఖ్యం. అది మారితే మాత్రం కచ్చితంగా జాగ్రత్త పడాలి.
మనం తినే ఆహారాన్ని బట్టి నాలుక రంగు తాత్కాలికంగా మారుతుంది. యథాస్థితికి వచ్చాక మాత్రం నాలుక కాస్త గులాబీరంగులో, తెల్లని రుచి గ్రంధులతో నిండి ఉంటుంది. సాధారణ మనిషికి నాలుకే ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని పరిస్థిత్తులో నాలుక రంగు మారుతుంది. నాలుక రంగుని మీ ఆరోగ్యాన్నిఅంచనా వేయచ్చు.
తెలుపు
నాలుకపై తెల్లని రుచిగ్రంధులు ఉన్నా కూడా నాలుక మాత్రం మరీ తెల్లగా ఉండదు. కానీ కొందరిలో నాలుక చాలా తెలుపుగా ఉంటుంది. పాచి పట్టినట్టు కనిపిస్తుంది. ఇది మీ శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతోందని చెప్పే సంకేతం. ఫ్లూ వల్ల కూడా నాలుక తెల్లగా మారుతుంది. నోరు శుభ్రంగా లేకపోయినా నాలుక తెల్లగా కనిపిస్తుంది.
పసుపు
నాలుక పసుపు రంగులోకి మారుతుంది అంటే మీరు జాగ్రత్త పడాలి. అది పోషకాహార లోపాన్ని సూచిస్తుంది. అలాగే జీర్ణ ప్రక్రియ సరిగా జరగడం లేదని చెప్పే సంకేతం కూడా అది. కాలేయం, పొట్ట, జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఉంటే నాలుక పసుపు రంగులోకి మారుతుంది. అలాగే నోటి పరిశుభ్రత లేకపోవడం వల్ల కూడా జరుగుతుంది.
నలుపు-నీలం
కొందరి నాలుక కాస్త నలుపు రంగులోకి మారడం, నీలం రంగులోకి మారడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన సూచిక. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్లు, అల్సర్లు ఉంటే ఇలా నాలుక రంగు మారుతుంది. ధూమపానం, కాఫీ, టీలు అధికంగా తాగేవారిలో కూడా నాలుక ఇలానే అవుతుంది. గుండె సంబంధ వ్యాధులు ఉన్నా కూడా నాలుక నీలం రంగు మారుతుంది. గుండె రక్తాన్ని పంప్ చేసేందుకు ఇబ్బంది పడినప్పుడు నాలుక రంగు మారిపోతుంది.
ఎరుపు నాలుక
నాలుక మీర ఎర్రగా మారడం, లేదా విచిత్రమైన నారింజ రంగులో కనిపించినప్పుడు మీకు విటమిన్ బి12 లేదా ఫోలిక్ యాసిడ్ లోపం ఉందని అర్థం. ఒక్కోసారి రుచి గ్రంధులు వేడి పదార్థాల వల్ల కాలిపోయి వాచిపోతాయి. అప్పుడు కూడా నాలుక ఎర్రబడుతుంది.
నాలుక రంగు మారితే తేలికగా తీసుకోకుండా, ఏ రంగులోకి మారిందో? ఎందుకు మారిందో ? ఆలోచించండి. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోండి. దీనివల్ల ఒక్కోసారి ప్రమాదకర ఆరోగ్య సమస్యలను ముందే పసిగట్టవచ్చు.
Also read: ఈ ఫోటోలో మీకు ఏం కనిపిస్తోందో చెప్పండి, మీరెలాంటి వ్యక్తిత్వం కలవారో తెలిసిపోతుంది